హాట్‌ టాపిక్‌గా పత్తికొండ నియోజకవర్గం

కర్నూలు, జూలై 4
పత్తికొండ వైసీపీలో ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు సీటు కోసం మరో నలుగురు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాత్రం అధిష్టానం ఈ సారి కూడా తనకే సీటు కేటాయిస్తుందనే ధీమాలో ఉన్నారు. మిగతా నేతలు మాత్రం ఎవరికి వారుగా పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గంలో వ్యతిరేకత మొదలైంది. వీటన్నిటి మధ్య పత్తికొండ నియోజకవర్గం హాట్‌ టాపిక్‌గా మారింది. అధిష్టానం ఎవరికి సీటు కేటాయిస్తుందోనని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గాన్ని హేమా హేవిూలు పాలించిన చరిత్ర కలిగి ఉంది. ప్రస్తుతం కంగాటి శ్రీదేవి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదట పార్టీ శ్రేణులు ఆమెకు గెలిపించుకునేందుకు పని చేశారు. ఎమ్మెల్యే కూడా ప్రజలతో మమేకమవుతూ నేతలను కలుపుకుంటూ వెళ్లేవారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే కుటుంబీకుల తీరు ఎమ్మెల్యేకు వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బంధువులు భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వారిని కట్టడి చేసినట్లు సమాచారం. ఇక మరో నాయకుడిపై కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు చాలాఆరోపణలతో ఎమ్మెల్యే కుటుంబీకుల తీరు పట్ల ప్రజలు విసుగు చెందుతున్నట్లు సమాచారం. ఇవన్నీ దాటుకుని ప్రజలు మళ్లీ తనకే పట్టం కడతారనే ధీమాలో ఎమ్మెల్యే ఉన్నారు. ఈ అభిప్రాయంతో ఆమె మళ్లీ తనకే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సారి అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటిస్తే వ్యతిరేక వర్గం ఆమె గెలుపునకు కృషి చేయరనే సంకేతాలు విన్పిస్తున్నాయి. దీంతో అధిష్టానం ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటు ఇస్తుందో లేదోననే సందిగ్ధంలో నియోజకవర్గ ప్రజలున్నారు.వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో మరో నలుగురి పేర్లు బాహాటంగా విన్పిస్తున్నాయి. అందులో మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి తనయుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఆయన సోదరి మాజీ ఎంపీపీ నాగరత్నమ్మలు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దివంగత మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రిగా పని చేశారు. ఆయన చేసిన పలు అభివృద్ది పనులను ప్రజలు గుర్తించుకున్నారని, తమకూ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉందనే ధీమాలో ఉన్నారు. తమకు సీటిస్తే మాత్రం గెలిచి తీరుతామని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మాత్రం కర్నూలు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ సీటివ్వకుంటే మాత్రం పత్తికొండ నుంచైనా పోటీ చేయనున్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పత్తికొండకు చెందిన మరో నేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రధాన అనుచరుడైన పోచంరెడ్డి మురళీధర్‌ రెడ్డి కూడా ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.గత ఎన్నికల సమయంలో చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు గురి కావడంతో ఆయన భార్య ప్రస్తుత ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. దీంతో ఆ సమయంలో ఆమె గెలుపునకు కృషి చేసిన మురళీధర్‌ రెడ్డి ఈ సారి తప్పకుండా తనకే సీటు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈయన నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని చెబుతున్నారు. ఇక హిందూపురం ఎంపీగా ఉన్న పత్తికొండకు చెందిన గోరంట్ల మాధవ్‌ కూడా ఈసారి తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రాష్ట్ర అధినేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అందుకోసం సమయం దొరికినప్పుడల్లా తన సామాజిక వర్గీయులతో మంతనాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారని, బీసీ కోటలో తనకు సీటు కేటాయిస్తే గెలిచి తీరుతానని చెబుతున్నారు.ఈ నియోజకవర్గంలో తుగ్గలి నాగేంద్ర వైసీపీ సానుభూతి నాయకులుగా, బీసీ నాయకుడిగా ఈయనకు మంచి పేరుంది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుపై ఈయన తీవ్ర ప్రభావం చూపుతారు. పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈ క్రమంలో తుగ్గలి నాగేంద్ర ఎవరికి సహకరిస్తారోనన్న చర్చ సాగుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మద్దతిస్తారా ?, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, నాగరత్నమ్మలకు మద్దతిస్తారా ? లేక బీసీ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ కు గానీ, ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడైన పోచంరెడ్డి మురళీధర్‌ రెడ్డిలకు మద్దతిస్తారా అనేది సస్పెన్స్‌ గా మారింది. వీరంతా కీలక నేతలను కలుస్తూ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *