12 నుంచి అసెంబ్లీ…?

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో శనివారం సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో నిర్దిష్టంగా తేదీలను ఖరారు చేయనున్నారు. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయాన్ని వివిధ పార్టీల లెజిస్లేచర్‌ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత ఫైనల్‌ కానున్నది. కనీసంగా వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు జరపాలని కోరుకున్నా నిర్వహించడానికి సిద్ధమేననే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పీకర్‌ స్పష్టం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మార్చి 15న ముగిసినందున ఆరు నెలల వ్యవధిలో మళ్లీ జరగాల్సి ఉన్నది. ఆ ప్రకారం ఈ నెల 14న తిరిగి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్నది.గత సెషన్‌ను గవర్నర్‌ ప్రోరోగ్‌ చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా మూడవ సిట్టింగ్‌గా జరగనున్నది. కేబినెట్‌ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే రోజు సాయంత్రం పార్టీ కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ అవలంబించాల్సిన వైఖరిపై క్లారిటీ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అన్ని పార్టీలూ వాటివాటి శాసనసభా పక్ష సమావేశాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఇది జరుగుతున్నా కేసీఆర్‌ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం. విద్యుత్‌ రంగం విషయంలో సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నదని, రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్య, చేసుకుంటున్నదని ఇప్పటివరకూ చేసిన విమర్శలకు అనుగుణంగా ఈ తీర్మానంలో కేంద్రంపై ఘాటుగానే ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉన్నది. కేబినెట్‌ సమావేశంలో చర్చల అనంతరం అసెంబ్లీ సెషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *