అమెరికాకి గ్రీన్ సిగ్నల్.. కెనడాకి రెడ్ సిగ్నల్.. అందుకు భారత్ ప్రతీకారం

India-Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజ్జర్ హత్యలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణల్ని నిరూపించే ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడం, భారత దౌత్యాధికారిని ఉన్నపళంగా బహిష్కరించడం వల్లే.. ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో.. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కెనడాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసులో అమెరికాకి పూర్తి సహకారం ఇస్తాం గానీ.. నిజ్జర్ హత్య కేసులో కెనడా దర్యాప్తుకు భారత్ ఏమాత్రం సహకరించబోందని కుండబద్దలు కొట్టారు. ఈ భిన్న వైఖరికి గల కారణాలేంటో కూడా ఆయన వివరించారు.

కెనడాలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నిజ్జర్ హత్య కేసులో మా ప్రధాన దౌత్యవేత్తల్లో ఒకరిని బహిష్కరించడం వల్ల మేము కెనడాపై ప్రతీకార చర్యల్ని మొదలుపెట్టాం. ఏ పని చేసినా, దానికి కచ్ఛితంగా రియాక్షన్ ఉంటుంది. అందుకే.. న్యూఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని కోరాం. జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన తర్వాత భారత్‌లో భావోద్వేగాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి విచారణ చేపట్టకుండానే భారత్‌ని కెనడా దోషిగా నిలబెట్టింది. ఇదేనా చట్టబద్ధత? కెనడాలో ఏదైనా ఖచ్చితమైన సాక్ష్యం ఉంటే.. అది మాకు చెప్పాలని, దానిపై మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మేము చెప్తూనే వస్తున్నాం. కానీ.. కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం అందలేదు. అలాంటప్పుడు ఆ కేసుపై మేమెలా స్పందించగలం? ఈ కేసుకి సంబంధించిన సమాచారం ఇవ్వనంతవరకూ కెనడా దర్యాప్తుపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేం’’ అని ఆయన చెప్పుకొచ్చారు

ఇక గురుపత్వంత్ హత్యకు కుట్ర కేసులో అమెరికా అధికారులు నిర్దిష్టమైన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారని సంజయ్ కుమార్ తెలిపారు. అమెరికాలో గ్యాంగ్‌స్టర్లు, మాదక ద్రవ్యాల రవాణదారులు, ఉగ్రవాదుల గురించి ఆ అగ్రరాజ్యం కీలక సమాచారాల్ని అందజేసిందని.. గురుపత్వంత్ హత్య కుట్రకు భారత్‌లో ఉన్నవారికి సంబంధం ఉండొచ్చని అమెరికా భావించిందని అన్నారు. న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో.. అమెరికా దర్యాప్తుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. కానీ.. కెనడా మాత్రం అలాంటి కచ్ఛితమైన ఆధారాలు ఇవ్వలేదన్నారు. నిజ్జర్ హత్యలో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి పునరుద్ఘాటించిన ఆయన.. కెనడియన్ భూమిని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కెనడాలో చాలామంది ఉగ్రవాదులు ఖలిస్తానీ మనస్తత్వానికి చెందిన వారేనని, కొందరు భారత్‌లో ముఠాలు నడుపుతున్నారని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *