అమెరికన్లకు కులవ్యవస్థ గురించి వివరించడం అంటే

“జాతివివక్ష ప్రధానంగా శరీరం రంగుపై ఆధారపడి ఉంటుంది. కానీ కులవివక్ష అలా కాదు. ఇది చాలా సంక్లిష్టమైనది. పుట్టుకతో కులం తోడవుతుంది. నిచ్చెనమెట్ల హిందూ వ్యవస్థలో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. దీన్ని అమెరికన్లను వివరించడం అంత సులువు కాదు” అని భూపతి అభిప్రాయపడ్డారు.

కుల వ్యవస్థను వివరించడానికి “కులం ఎముక, జాతి చర్మం” అని ఇసాబెల్ విల్కర్సన్ రాసిన పుస్తకంలో వాక్యాలను తోడు తెచ్చుకుంటూ ఉంటానని ప్రేమ్ పరియార్ చెప్పారు. నేపాలీ మూలాలున్న ప్రేమ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పాలసీ ఛేంజ్ ప్రధాన నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్నారు.

2020లో వచ్చిన పుస్తకం ‘క్యాస్ట్: ది ఆరిజన్స్ ఆఫ్ అవర్ డిస్‌కంటెంట్స్’లో కులం, జాతి చరిత్రలను పరిశీలిస్తూ, రెండిటినీ పోల్చి రాశారు ఇసాబెల్ విల్కర్సన్.

అమెరికా ప్రధాన స్రవంతిలో కుల వివక్షను గుర్తించడానికి ఇది సహాయపడిందని పరియార్ అభిప్రాయపడ్దారు.

నేపాల్ నుంచి అమెరికా వెళ్లిన ప్రేమ్ పరియార్‌కు అక్కడా కుల వివక్ష ఎదురైంది. అయితే, ఆయన అనుభవాలను అక్కడి అగ్రవర్ణాల అధ్యాపకులు చిన్నచూపు చూశారు. కుల వివక్ష “భారతదేశానికి సంబంధించిన సమస్య” అని, అమెరికాలో దాని గురించి చర్చ ఎందుకు? అంటూ నిర్లక్ష్యం చేశారు.

కుల వివక్ష ఉందని అంగీకరించడం పట్ల విముఖత అగ్రవర్ణాలకు కొత్తేం కాదని థామస్ అన్నారు. క్రిస్టియానిటీలో కులం, జెండర్ వివక్షలపై ఆమె పనిచేస్తున్నారు.

“ప్రివిలేజ్ (ఆధిపత్యం/ప్రత్యేకత) అనే పదం వాడడానికి వాళ్లు భయపడతారు. ఎందుకంటే అమెరికా సమాజంలో వారికి దక్కిన స్థానం వారు సంపాదించుకున్నది కాదని, ప్రివిలేజ్ వల్లే వచ్చినదని అనుకునే ప్రమాదం ఉందని భావిస్తారు. అమెరికాలో హిందూ, ముస్లింల లాగ దక్షిణాసియా ప్రజలు కూడా మైనారిటీలే” అంటూ ఆమె వివరించారు.

అయితే, కులం అనేది హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదని, దక్షిణాసియా మతాలన్నింటిలో ఈ అసమానత ఉందని హార్వర్డ్‌లోని ఆంత్రోపాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ అజంతా సుబ్రమణియం ఈ సంవత్సరం ప్రారంభంలో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి రాసిన ఒక లేఖలో ప్రస్తావించారు.

“కానీ, అణగారిన వర్గాల్లో కూడా చాలామంది హిందువులే” అని ఆమె రాశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *