ఓయూలో ఏం జరుగుతోంది…

ప్రతిష్టాత్మక శత వసంతాల ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోంది. ఓయూతో అనుబంధం ఉన్న ఎవరైనా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. మంత్రులను మించిన భద్రతలో వీసీ దర్పం ప్రదర్శిస్తుండగా, ప్రగతిభవన్‌ తరహాలో ఓయూ పరిపాలనా భవనం ఎదుట భద్రతా బలగాల పహారా కనిపిస్తోంది. ఒక వైపు దాదాపు మూడు వందల మంది పోలీసులు, మరోవైపు వీసీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియమించిన రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు దాదాపు ఒక వంద మంది ( బీ సెక్యూర్‌, సెక్యూరిటీ సంస్థ ) , ఇంకోవైపు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అత్యవసర పరిస్థితిలో రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పటిష్ట వలయం కనిపిస్తోంది. ఇది దాటుకుని ముందుకు వెళ్లడం కష్టతరం కాదుకదా… దాదాపు అసాధ్యం. దీంతో రోజూ వివిధ పనులపై పరిపాలనా భవనానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సార్లు ఉద్యోగుల రాకపోకలను సైతం వీరు అడ్డుకుంటున్నారు. ఈ ఉదంతంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీకి ఛాన్స్‌లర్‌ హోదాలో ఉన్న గవర్నర్‌ , రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని వేడుకుంటున్నారు.వర్సిటీలో పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ కోసం గత నాలుగేళ్లుగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్‌ కోసం చూస్తూ పరిశోధనలపై ఆసక్తితో నెట్‌, సెట్‌ వంటి అర్హతలు సాధించి, గ్రావిూణప్రాంత విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని దాదాపు పదిహేను రోజులుగా ఏదో ఒక రూపేణా ఉద్యమిస్తూ వచ్చారు. ఎలాంటి విద్యార్థి సంఘాల ప్రమేయం లేకుండా, విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమించడం గమనార్హం . ఇలాంటి పరిస్థితుల్లో వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ సంస్కరణల పేరుతో పీహెచ్‌డీ ప్రవేశ నిబంధనలలో మార్పులు చేయడం వివాదాస్పదంగా మారింది. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు నిర్వహిస్తామని, దానికి అనుగుణంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయింది. ఆ సమయంలోనూ విద్యార్థులు వీసీకి తమ వినతిపత్రం అందించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ విద్యార్థులను కలవకపోవడం, వారిని పరిపాలనా భవనంలోకి రానీయకపోవడం వంటివి పరిస్థితిని మరింత జటిలం చేశాయి.విద్యార్థుల ఆగ్రహం గమనించిన ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ తనతో పాటు పరిపాలనా భవనానికి సైతం పటిష్ట భద్రత కావాలని పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాదాపు మూడువందల మంది పోలీసు సిబ్బంది కేవలం ఈ ఉన్నతాధికారుల భద్రతలో ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో పాటు సవిూపంలోని మరో పది వరకు పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది, మరి కొన్ని ప్లాటూన్ల రిజర్వ్‌ బలగాలతో ఓయూ నిండిపోయింది. వర్సిటీ పరిస్థితి అంత దారుణంగా లేదని స్థానిక పోలీసులు చెబుతున్నా, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి మరీ భద్రతను కట్టుదిట్టం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసు అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. తాము ఉన్నది శాంతిభద్రతల పరిరక్షణకా ? ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ రక్షణకా అని లోలోన చర్చించుకుంటున్నారు.వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ వైఖరిని సాధారణ విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు . విద్యార్థులపై తప్పుడు కేసులు బనాయించడం, తన ప్రైవేట్‌ సెక్యూరిటీచే దాడులు చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీకి వీసీగా ఉన్న ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ తండ్రి స్థానంలో ఉండి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సింది పోయి, ఇటువంటి నిరంకుశ నియంతలా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. తమ బాధ చెప్పుకునేందుకు సైతం అవకాశం ఇవ్వకపోవడం పైశాచికమని దుయ్యబడుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *