సెంట్రల్‌ విస్టాలో వాస్తు లోపాలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అట్టహాసంగా ప్రారంభించిన సరికొత్త పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ విస్తా చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. పాత పార్లమెంటు భవనం 1927లో ప్రారంభం కాగా, మరో వందేళ్లకు భారత పార్లమెంట్‌ తన అడ్రస్‌ మార్చుకోనుంది. సెంట్రల్‌ విస్తా విషయంలో దాదాపు ప్రతి అంశం వివాదాలకు కారణం అవుతోంది. సెంట్రల్‌ విస్తా మొత్తం ప్రాజెక్ట్‌ 2026 నాటికి పూర్తి కానుంది. ప్రస్తుతానికి పార్లమెంట్‌ సభ్యుల సమావేశాలు జరిగే లోక్‌ సభ, రాజ్య సభ సముదాయాలను పూర్తి చేశారు. ఈ భవనాలను ఈ నెల 28వ తేదీన ప్రారంభించాలని మోడీ భావిస్తున్నారు.మే 28 సావర్కార్‌ జయంతి అయినందున ఆ రోజు ప్రారంభోత్సవం జరపరాదన్న వాదన బలంగా వినబడుతోంది. బ్రిటిషర్ల కాలు మొక్కి శిక్ష నుంచి తప్పించుకున్న సావర్కార్‌ అసలు దేశ భక్తుడే కాదని వీరి వాదన. కానీ బీజేపీ మాత్రం సావర్కార్‌ ను మచ్చ లేని దేశ భక్తుడిగా గుర్తిస్తోంది. ఇది ఒక అంశం అయితే, సెంట్రల్‌ విస్తాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభోత్సవం జరిపించాలంటూ 19 ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఇంకా కొన్ని రాజకీయ పక్షాలు స్పందించాల్సి ఉంది. అయితే సెంట్రల్‌ విస్తాను ప్రధాని మోడీ మాత్రమే ప్రారంభిస్తారనని అది కూడా సావర్కార్‌ జన్మదినం రోజైన మే 28వ తేదీనే జరుగుతుందని బీజేపీ చెబుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇంత వరకూ ఆహ్వానం కూడా పంపించలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.ప్రస్తుత పార్లమెంటు భవనం 1911 నుంచి 1932 వరకూ నిర్మాణం జరుపుకుంది. కాగా 1927లో నిర్మాణం కాకముందే అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ను ప్రారంభించింది. బ్రిటిష్‌ ఇంజనీర్లు ఎడ్వర్డ్‌ లూత్సాన్‌, హెర్బెర్ట్‌ బెకర్‌ లు భారత పార్లమెంట్‌ భవనాన్ని డిజైన్‌ చేసి నిర్మించారు. భారతదేశ ఆధినిక చరిత్ర ఈ పార్లమెంట్‌ భవనంతో ముడివేసుకుంది. అంబేడ్కర్‌, నెహ్రూ, ఇందిరాగాంధీ, పటేల్‌, వాజ్‌ పేయి, జగ్జీవన్‌ రామ్‌, పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, వీవీగిరి, అబ్దుల్‌ కలాం, సర్వేపల్లి , జాకీర్‌ హుస్సేన్‌, రాజీవ్‌ గాంధీ వంటి దిగ్గజాలు ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేశారు. అలాంటి ప్రపంచంలోనే అత్యద్బుతమైన పార్లమెంట్‌ భవనాలలో ఒకటిగా చెప్పుకునే భారత పార్లమెంట్‌ భవనం ఇక ముందు ఆ ఖ్యాతిని కోల్పోనుంది. ప్రస్తుత భవనం నిర్మించి శతాబ్దం కావస్తున్న నేపథ్యంలో మరో భవనాన్ని మోడీ సర్కార్‌ నిర్మిస్తోంది. ఖర్చు విషయం పక్కన పెడితే చారిత్రక ప్రాధాన్యతను మనం కోల్పోతున్నమన్నది వాస్తవం. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికాలోని పార్లమెంట్‌ భవనానికి 230 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతటి అమెరికా కూడా చారిత్రక మూలాలను వదల కుండా ఇప్పటికీ కేపిటల్‌ హిల్‌ ను తమ పార్లమెంట్‌ భవనంగా గౌరవిస్తోంది. సెంట్రల్‌ విస్తా గురించి చూస్తూ గుజరాత్‌ కు చెందిన విమల్‌ పటేల్‌ అనే వాస్తు శిల్పి అధీనంలో సెంట్రల్‌ విస్తా రూపొందుతోంది. ఈ భవన సముదాయం వాస్తుతంత్ర విధానంలో నిర్మితం అవుతోందని విమల్‌ పటేల్‌ బృందం చెబుతోంది. సెంట్రల్‌ విస్తా వాస్తుపై పండితులు పెదవి విరుస్తున్నారు. 86 ఎకరాల్లో నిర్మితం అవుతున్న ఈ ప్రాజెక్ట్‌ వాస్తుకు పూర్తి విరుద్ధమని వారి వాదన. త్రికోణ ఆకారంలో నిర్మితం అవుతున్న సెంట్రల్‌ విస్తా చివరికి నష్టాలను కలిగిస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఒరిస్సా భువనేశ్వర్‌ లోని బ్రహ్మేశ్వర దేవాలయం వాస్తు సెంట్రల్‌ విస్తాలో కనిపిస్తుందని దేవాలయాల వాస్తు మరో నిర్మాణానికి పెట్టడం అరిష్టమని పండితులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా సెంట్రల్‌ విస్తా బీజేపీ నాయకత్వానికి మరో తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *