పశ్చిమ వైసీపీలో దూకుడు

పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి వర్గపోరు తీవ్రంగానే ఉంది. పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్‌ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్‌ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయిన్పటికీ పరిస్థితి మొదటికొస్తుంది తప్పితే మార్పు లేదట. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్‌ నరసింహరాజును ఆ మధ్య ఇంఛార్జ్‌ పదవి నుంచి తప్పించారు. తాజాగా మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో ఉండి వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటోంది కేడర్‌.ఉండి వైసీపీ ఇంఛార్జ్‌గా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఉండేవారు. ఆయన 2014లో ఓడిపోవడంతో.. 2019లో సర్రాజును కాదని.. పీవీఎల్‌ నరసింహారాజును బరిలో దించింది పార్టీ. ఈ మార్పూ వర్కవుట్‌ కాలేదు. ఉండిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని భావించిన వైసీపీ పెద్దలు నరసింహారాజును తప్పించి.. గోకరాజు రామరాజును ఇంఛార్జ్‌గా నియమించారు. ఏమైందో ఏమో.. రామరాజును తప్పించి మళ్లీ నరసింహరాజును తెరపైకి తీసుకొచ్చింది పార్టీ. అసలే గ్రూపుల గోలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో పీవీఎల్‌కు మళ్లీ ఎందుకు పగ్గాలు అప్పగించారన్నది కేడర్‌ ప్రశ్న. ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ అదే జరుగుతుందని భయపడుతున్నారట. అసలు ఈ పంచాయితీ మనకెందుకు అని భావిస్తున్న కొందరు నేతలు తాజా పరిణామాలు రుచించక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.వైసీపీ గ్రామ కమిటీలలో పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. తనకు అనుకూలంగా ఉన్నవారికే నరసింహారాజు చోటు కల్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కమిటీలపై వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా సమాచారం లేదట. ఉండిలో వైసీపీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. పీవీఎల్‌ నరసింహారాజు డీసీసీబీ ఛైర్మన్‌ను చేశారు. నియోజకవర్గంలో గోకరాజు రామరాజు కుటుంబానికి పట్టు ఉంది. ఇంతచేసినా ఉండిలో వైసీపీకి తేడా కొట్టడానికి కారణం సమన్వయ లోపమే అన్నది కేడర్‌ చెప్పే మాట. పదవుల్లో ఉన్న నేతలు కేడర్‌ను చేరదీయకపోవడం.. కేడర్‌ విశ్వసించేలా పనులు చేపట్టకపోవడం పెద్దలోటుగా చెబుతున్నారు. ఇప్పుడు పాతరాజుగారే మళ్లీ ఇంఛార్జ్‌గా వచ్చారు. మరి.. గతంలోలా వర్గాలను ప్రోత్సహిస్తారో? లేక అందరినీ కలుపుకొని వెళ్తారో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *