భాగ్యనగరంలో అభివృద్ధి ఒక వైపేనా….

కొద్ది రోజుల కిందట సైబరాబాద్‌ వైపు వెళ్లానని న్యూయార్క్‌లో ఉన్నానా.. హైదరాబాద్‌లో ఉన్నానా అన్నది గుర్తించలేకపోయానని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో వ్యాఖ్యానించారు. ఆయన అలా అన్న గంటల్లోనే… గంట పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని ఓ భాగం అతలాకుతలం అయిపోయింది. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మరో పసిప్రాణం నాలాకు బలైపోయింది. పాల కోసం వెళ్తూ చిన్నారి నాలాలో పడి మత్యువాత పడటానికి కారణం జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమేనని వెల్లడైంది. నాలాల్లో మరణాలు జరగరాదని గత రెండేళ్లుగా మంత్రి కేటీఆర్‌ తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. ఎప్పటికప్పుడు సవిూక్షలు నిర్వహిస్తున్నా ఘోరం జరిగిపోయింది.గత వర్షాకాలం నాలా మరణాలు లేవనుకుంటుండగానే ఈసారి వానాకాలం రాకముందే వేసవిలోనే అయినా నాలాలో పసిప్రాణం బలైపోయింది. దీనికి పూర్తి బాధ్యత జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డులదేనని చెప్పక తప్పదు. వీడీసీసీ రోడ్డు కోసం జీహెచ్‌ఎంసీ ఉన్న రోడ్డును తవ్వి పనులు చేపట్టింది. డ్రైనేజీ లైన్‌ వేయడంలో వాటర్‌బోర్డు జాప్యం చేసింది. పనుల ప్రాంతంలో గుంతను పట్టించుకోలేదు. పనులు జరిగే ప్రాంతాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ఏర్పాటు చేయాల్సిన సైనేజీలు వంటివి పూర్తిగా గాలికొదిలేశారు.ఓపెన్‌ నాలాకు ఓ చిన్నారి బలైపోయింది. కార్లు, బైకులు కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. అద్భుతాల్ని తలపించేలా ఉండే ఐటీ కారిడార్‌ ఓ వైపు.. గంట పాటు భారీ వర్షం వస్తే తట్టుకోలేని నగరం మరో వైపు ఉందా అన్న భావన కలిగేలా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌ మౌలిక సదుపాయాలపై చర్చ కూడా అందుకే ప్రారంభమయింది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు రాత్రి సమయంలో వెళ్తే?..రజనీకాంత్‌ చెప్పినట్లుగా మనం ఏదో విదేశీ నగరంలో ఉన్నామా అన్నభావన కలిపిస్తుంది. విశాలమైన రహదారులు. అద్భుతమైన అద్దాల మేడలు. విలాసవతమైన ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉండే అపార్టుమెంట్లు కనిపిస్తు? ఉంటాయి. అదే సమయమంలో ఎటు చూసినా ఫ్లై ఓవర్లు .. లగ్జరీ బ్రాండ్ల షోరూములు… హైక్లాస్‌ రెస్టారెంట్లు ఇలా కళ్లు చెదిరేలా కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల ప్రతీ చోటా ఫ్లైఓవర్లు ప్రారంభించడంతో పాటు డ్రోన్లతో అద్భుతమైన దృశ్యాలు తీసే టెక్నాలజీ రావడంతో ఇక ఆ దృశ్యాలు ఊహించనంతగా వైరల్‌ అవుతున్నాయి. అందుకే హైదరాబాద్‌ అద్భుతంగా అభివృద్ధి చెందిందన్న్‌ భావన అందరిలోనూ కులుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కూడా వీటిని చూపించి … అభివృద్ధి చెందామని చెబుతున్నారు. హైదరాబాద్‌ నగరం విస్తరిస్తోంది. ఓ పదేళ్ల కిందట హైదరాబాద్‌ శివారు విస్తరించేది కాదు. కూకట్‌ పల్లి నుంచి ఎల్బీ నగర్‌ వరకూ ఉన్నదే నగరం. అయితే ఇటీవలి కాలంలో శివార్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. విల్లాలు.. ఇండిపెండెంట్‌ హౌస్‌లలో ఉండేందుకు జనం ఆసక్తి చూపిస్తూండటంతో ఇప్పుడు నగరం ఔటర్‌ దాటి ఇరవై కిలోవిూటర్ల వరకూ విస్తరిస్తోంది. ఈ వైపు రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ది కోసం మౌలిక సదుపాయాలు పెంచుతూ పోతున్నారు కానీ.. అసలైన హైదరాబాద్‌లో మాత్రం మౌలిక సదుపాయాలు ఎక్కడివక్కడే ఉండిపోతున్నాయి. ముఖ్యంగా సవాల్‌గా మారిన వర్షాలు పడినప్పుడు వరదల నిర్వహణను అధిగమించలేకపోతున్నారు. నాలాలు కుంచించుపోవడం.. చెరువులు ఆక్రమణకు గురి కావడమే కాదు.. వాతావరణ మార్పుల కారణంగా… రోజంతా పడే వర్షం ఒక్క గంటలోనే పడుతోంది. ఫలితంగా హైదరాబాద్‌లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ప్రపంచస్థాయి సెక్రటేరియట్‌ ను నిర్మించుకున్నామని ప్రభుత్వం సంబరంగా .. ప్రకటించుకుంటున్న సమయంలో.. ఓపెన్‌ నాలాలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వర్షం దాటికి కార్లు, వాహనాలు కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. దీంతో సెక్రటేరియట్‌ గొప్పదనం కన్నా.. ఇవే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. సెక్రటేరియట్‌ వల్ల గొప్పలు చెప్పుకోవచ్చు కానీ ముందు హైదరాబాద్‌ ప్రజలకు సమస్యలుగా ఉన్న వాటిని పరిష్కరించాలి కదా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ఎంత వానపడినా నిర్వహణ ఉండేలా నాలాలు మారుస్తామని.. చెరువుల ఆక్రమణలు తొలగిస్తామని.. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు వచ్చిన భారీ వరదల సమయంలో చెప్పారు.కానీ మళ్లీ మళ్లీ అలాంటివి జరుగుతున్నాయి కానీ ఎలాంటి పురోగతి ఉండటం లేదు. ప్రైవేటు కంపెనీలు.. ఐటీ కారిడార్‌లో భవనాలు కడతాయని వాటిని చూపించి హైదరాబాద్‌ ను న్యూయార్క్‌ చేశామని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని అసలు చేయాల్సిన అభివృద్ధి మాత్రం చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాధానం చెప్పడం ప్రభుత్వానికీ ఇబ్బందికరంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *