కసరత్తుతో కనికట్టు

దూసుకుపోతున్నారుఅందగత్తెలను ఎవరు మాత్రం ఇష్టపడరు? ఆకర్షించే అందానికి చక్కని అభినయం తోడయితే ఇక తిరుగులేదని నిరూపిస్తున్నారు మన హీరోయిన్లు. అభినయాన్ని తెరపై అలవోకగా ఒలికించగల నేర్పుతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రపరిశ్రమలో అగ్రతారగా ఎదగాలన్నా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నా అందంతో పాటు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాల్సిందే. సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, వర్కౌట్లు చేయాల్సిందే. అందుకే పరిశ్రమలో అగ్రహీరోయిన్లుగా ఎదిగినా నిరంతరం ఫిట్‌నెస్‌ మంత్రాన్ని జపిస్తున్నారు. గంటలు గంటలు జిమ్‌లో చెమటోడ్చి తమ రూపాన్ని సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. అయస్కాంతంలా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.

నయనానందం…40వ పడికి చేరువవుతున్నా యువ కథానాయికలను సవాల్‌ చేసే అందం నయనతార సొంతం. దక్షిణాదిలోనే అందమైన కథానాయికల్లో ఆమె ఒకరు. అంతేనా ఫిటెస్ట్‌ తారల్లోనూ ఆమెదే అగ్రస్థానం. ఎంత బిజీగా ఉన్నా రెగ్యులర్‌ వర్కౌట్స్‌, యోగాను నయన్‌ అస్సలు మిస్సవ్వరు. మితాహారం తీసుకుంటారు. జంక్‌ఫుడ్‌ను దరిచేరనీయరు.
సమంత సరికొత్తగా…తెలుగు సెలబ్రిటీల ఫిట్‌నెస్‌ అనగానే గుర్తుకొచ్చే కథానాయిక సమంత. ఆమె వర్కౌట్స్‌లో కార్డియో వెయిట్‌ ట్రైనింగ్‌, యోగా తప్పనిసరి. ఒక్కోసారి తరహా వర్కౌట్‌ను ఫాలో అవడం శామ్‌ స్టైల్‌. ఎప్పటికప్పుడు కొత్త వర్కౌట్స్‌ను ట్రై చేస్తుంటారు. బరువులు ఎత్తడంలో సమంత దిట్ట అనే చెప్పాలి. హ్యాండ్‌స్టాండ్‌, బార్‌బెల్‌ బ్యాక్‌ స్క్వాట్స్‌ ఎంత కష్టమైనా వెనుకాడరు. ఏరోబిక్స్‌, ఏరియల్‌ యోగాను రోజూ ప్రాక్టీస్‌ చేస్తారు.
ఫిట్‌నెస్‌ ఫస్ట్‌…ఫిట్‌నెస్‌ విషయంలో బాగా శ్రద్ధ పెట్టే దక్షిణాది యువ కథానాయికల్లో రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. జిమ్‌లో వర్కౌట్‌ చేసే వీడియోలను ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. బార్‌బెల్‌ వర్కౌట్స్‌, బాడీ వెయిట్‌ ఎక్సర్‌సైజ్స్‌ చేయడంలో తను నిపుణురాలు.
32 ఏళ్ల కన్నడ సోయగం పూజాహెగ్డే… పాలరాతి శిల్పానికి ప్రతీకలా కనిపిస్తారు. కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే గ్లామర్‌ను మెయింటైన్‌ చేస్తూ వస్తున్నారు. ఉదయం వర్కౌట్స్‌తో మొదలుపెట్టి యోగాతో రోజును ముగిస్తారు పూజా. ఏరియల్‌ సిల్క్‌ యోగాను ఆమె ఎక్కువగా సాధన చేస్తారు. దీనివల్ల శరీర సౌష్టవంతో పాటు చురుకుదనం పెరుగుతుంది.

వర్కౌట్స్‌తో రోజు మొదలు…అభిమానులు తమన్నా పేరును పదే పదే పలవరించడానికి ఆమె అందమే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్‌నె్‌సను కాపాడుకోవడానికి ఆమె ప్రతిరోజూ పలు రకాల వ్యాయామాలు చేస్తారు. జిమ్‌లో కార్డియో ఎక్సర్‌సైజ్‌, వెయిట్‌ ట్రైనింగ్‌ను ఎక్కువ చేస్తారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగాసనాలు వేయడంతో పాటు ధ్యానం చేస్తారు. షూటింగ్‌లో చిన్న విరామం దొరికితే చాలు పర్వతారోహణకు వెళతారు.
వర్కౌట్‌ మోడ్‌…వెండితెరపై అందాలన్నీ రాశిపోసినట్లు కనిపిస్తారు కథానాయిక రాశీఖన్నా. సోమరిగా గడపడం సుతారం ఇష్టముండదు అంటారు ఆమె. ఉదయం వేళల్లోనే కాదు, ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు వర్కౌట్‌ మోడ్‌లోకి వెళ్తారు రాశి. జిమ్‌లో వర్కౌట్స్‌తో పాటు యోగాసనాలు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తారు.
అలవోకగా ఆసనాలు…పున్నమి చంద్రుని అందాలను తనలో పొదువుకున్న టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌. ముందు ఫిట్‌నెస్‌, ఆ తర్వాతే మరేదైనా అంటారు ఆమె. తల్లయినా సరే మునుపటి ఫిట్‌నె్‌సను అందిపుచ్చుకొన్నారు కాజల్‌. అత్యంత క్లిష్టమైన యోగాసనాలనూ ఆమె అలవోకగా వేస్తారు. ఆ వీడియోలను తన అభిమానులతో సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటారు. తన ఫిట్‌నె్‌సను కాపాడుకోవడంలో ఈత, సైక్లింగ్‌ ముఖ్యపాత్ర వహించాయంటారు కాజల్‌.
రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఏరియల్‌ యోగా వీడియోలు సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయ్యాయి. అలాగే కార్డియో వర్కౌట్లకు శ్రీనిధి శెట్టి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *