తోట వర్సెస్‌ రావెల

ఏపీ బీఆర్‌ఎస్‌లో అప్పుడే చిచ్చు రేగిందా? పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీపై మొదట్లో గట్టి ఫోకస్‌ పెట్టినట్టు కనిపించినా ఆ తర్వాత పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్ర పార్టీ శాఖపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఏపీలో మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు. మరోనేత రావెల కిశోర్‌ బాబును కూడా పార్టీలో చేర్చుకున్నారు.అయితే కొంతకాలంగా ఈ ఇద్దరు నేతలకు పడటం లేదని సమాచారం. ఆదివారం గుంటూరులో ఏపీ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రోగ్రామ్‌కు అదే జిల్లాకు చెందిన రావెల కిశోర్‌ బాబుకు ఆహ్వానం అందలేదు. దీంతో ఏపీ బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు నేతలు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్న చెప్పిన బీఆర్‌ఎస్‌ సింగరేణి తరఫున బిడ్‌ దాఖలు చేస్తామని ప్రకటించింది. అప్పట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణకు చెందిన నేతలు సైతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏపీ బీఆర్‌ఎస్‌లో ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. మరి ఈ విబేధాలను బీఆర్‌ఎస్‌ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *