వారసులొస్తున్నారు…

కాకినాడ, ఆగస్టు 10
వారసత్వ రాజకీయాలు మనకేం కొత్త కాదు. దాన్నేదో తప్పుగా చూసే జమానా అసలే కాదు. ఇంకా చెప్పాలంటే? వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురాని నేతల్నే తేడాగా చూసే రోజులివి. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడుకుల్ని ఎమ్మెల్యేలుగా చేసి వాళ్ళు అసెంబ్లీలో అధ్యక్షా?. అంటే చెవులారా విని తృప్తి పడాలనుకుంటున్న నాయకులు కొందరైతే? చనిపోయిన తండ్రికి నివాళిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్న కొడుకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఈ తాపత్రయం పెరిగిపోగా?. అధికార పార్టీలో కాస్త మోతాదు ఎక్కువగా ఉంది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ తండ్రి బతికున్న సమయంలోనే కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నెహ్రూ చనిపోయాక గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఓడిపోయారు అవినాష్‌. ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని వైసీపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. ఈసారి ఎలాగైనా గెలిచి తన తండ్రికి నివాళిగా ఇవ్వాలన్నది ఆయన పట్టుదల అట.పెడన నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్‌ లీడర్‌ కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌ తండ్రి మరణంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా పెడనలో సత్తా చాటాలన్న పట్టుదలతో ప్లాన్స్‌ సిద్ధం చేసుకుంటున్నారట ఆయన. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు. పేర్ని నాని తండ్రి కృష్ణమూర్తి కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. అదే క్రమంలో తాను యాక్టివ్‌గా ఉన్నపుడే కుమారుడు కిట్టును ఎమ్మెల్యే చేయాలని భావిస్తున్నారట నాని. బందరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవటం, అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించటం, గడప గడపకు కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారట ఆయన. ఈసారి తాను తప్పుకుని బందరులో కొడుకుని బరిలో దింపాలనుకుంటున్నారట నాని.అదంతా ఒక ఎత్తయితే.. ఈసారి తండ్రులను గట్టెక్కించే పనిలో బిజీగా తిరుగుతున్నారట కొందరు కొడుకులు. ఇందులో కూడా రెండు కేటగిరీలు ఉన్నాయి. తండ్రి గెలుపుకోసం పనిచేస్తూనే పొలిటికల్‌ ఓనమాలు దిద్దుకోవాలనుకుంటున్నవారు కొందరైతే?వయసు విూద పడ్డ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే ఎలివేట్‌ అయ్యే ప్రయత్నంలో ఉన్నవారు మరి కొందరట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ లిస్టు కూడా బానే ఉంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు కృష్ణప్రసాద్‌ కౌన్సిలర్‌ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉదయభాను గెలుపు కోసం ఇప్పటి నుంచే అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తున్నారట. ప్రతి కార్యక్రమానికి తండ్రితో వెళ్లి తానే అన్నీ చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ తరపున అన్ని కార్యక్రమాలను ఆయన కొడుకు మండలి రాజా చక్కబెడుతున్నారు. దాదాపు టీడీపీ క్యాడర్‌ అంతా మండలి రాజాకి టచ్‌ లోనే ఉంటోదంట. ఇక పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌ కూడా అప్పుడే నియోజకవర్గంలో తండ్రి తరపున ప్రచారం మొదలుపెట్టేశారట. ఇలా?ఎన్నికల సీజన్‌కు కాస్త ముందే తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ రాజకీయం జిల్లాలో ఊపందుకుంది. గెలుపు ఓటముల్ని పక్కన పెడితే ప్రయత్న లోపం లేకుండా పనిచేసి విజయాన్ని తమ తమ తండ్రులకు గిఫ్ట్‌ గా ఇవ్వాలనే ఆలోచనతో వారసులు నాన్నకు ప్రేమతో అంటున్నారట. ఆ ప్రేమను జనం ఏ మాత్రం అర్ధం చేసుకుంటారో చూద్దాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *