వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ…

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకరు ప్రతిపక్ష పార్టీ ఎంపీ.. మరొకరు అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇద్దరు ఒకరినొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.. బాగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చుకోవడంతోపాటు.. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలంటూ ఇదరువు నేతలు హితోక్తులు బోధించారు.. అభివృద్ధి పనుల్లో అధికార, విపక్షాలు కలిస్తే మంచిదంటూ వ్యాఖ్యానించారు. వారెవరో కాదు.. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు.. అయితే, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల కాలంలో ఏం చేసినా చర్చే.. విజయవాడ లోక్‌సభ పరిధిలోని టీడీపీ నేతలతో ఆయనకు పడటం లేదు. కానీ.. నియోజకవర్గాల్లో ఆయన పనులు.. పర్యటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎంపీ నిధులతో నందిగామ నియోజకవర్గంలోని తోటరావులపాడులో వాటర్‌ ట్యాంక్‌ నిర్మించారు. వాటర్‌ ట్యాంక్‌ ప్రారంభోత్సవానికి టీడీపీ ఎంపీ కేశినేని నానితోపాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయం ఉప్పు నిప్పుగా ఉన్న తరుణంలో ఇలా టీడీపీ ఎంపీ.. వైసీపీ ఎమ్మెల్యే ఒకేచోట కనిపించడం చర్చగా మారింది.
ఎంపీ నానిని వైసీపీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరిస్తే.. బదులుగా ఎమ్మెల్యే జగన్మోహన్‌రావును కూడా శాలువాతో గౌరవించారు ఎంపీ. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఆపై కలిసే వాటర్‌ ట్యాంక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలని చెప్పిన ఎంపీ కేశినేని నాని.. అక్కడితో ఆగకుండా వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌ నాలుగేళ్లుగా తనకు తెలుసు అన్నారు కేశినేని నాని. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించాను అన్నారు. తనకు తెలిసినంత వరకు మొండి తోక బ్రదర్స్‌ చాలా మంచి వాళ్లు అని మరోసారి కితాబు ఇచ్చారు. ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా చేసేలా బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు చేయబోనంటూ నాని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. బెజవాడ పార్లమెంట్‌కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తానన్నారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతా అని కేసిఆర్‌ అంటే తాను బెజవాడ పార్లమెంట్‌ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తాను అంటూ వ్యాఖ్యానించారు. ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు నాని. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను, మొండి తోక సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్‌ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నాను అన్నారు. ప్రతిపక్షాలతో సిద్ధాంత పరమైన ఫైట్‌ ఉంటుందన్నారు కేశినేని నాని. బెజవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. తాను ఢల్లీి మనిషిని అన్నారు. ఎంపీగా ఉన్నా లేకపోయినా తనకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. తాను ఏమన్నా మాట్లాడితే పార్టీ మారుతున్నా అని ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థులను ఎద్దేవా చేశారు. తన వల్ల టీడీపీకి నాలుగు ఓట్లు పడాలి అనే పనులే చేస్తానన్నారు. గడ్కరీ, చంద్రబాబుకి తాను శిష్యుడినని చెప్పుకొచ్చారు కేశినేని నాని. వెనుకబడిన బెజవాడ పార్లమెంట్‌ అభివృద్ధి కోసమే పని చేస్తానన్నారు. తన శ్వాస, ఊపిరి అన్నీ బెజవాడ పార్లమెంట్‌ కోసమే అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు వంతు వచ్చింది. ఆయన కూడా తగ్గేదే లేదన్నట్టుగా టీడీపీ ఎంపీ కేశినేని నానిని పొగడ్తల్లో ముంచెత్తారు.అయితే, నందిగామ వైసీపీ ఎమ్మెల్యేను ఎంపీ కేశినేని నాని ఎందుకు పొగిడారు..?స్థానిక టీడీపీ నేతలపై ఉన్న అక్కసుతోనే కేశినేని నాని గేర్‌ మార్చారా..?మాజీ ఎమ్మెల్యే సౌమ్య టీడీపీ నేత కేశినేని చిన్ని శిబిరంలో ఉన్నారా..? టీడీపీలోని ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకే నాని వ్యూహం మార్చారా.. అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *