నిర్వాసితుల కోసం మహాపాదయాత్ర

తరతరాలుగా ఆ భూమితో, ఆ ఊరితో తీరని అనుబంధం. వేకువజామున నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ సేద తీరే వరకు ఆ పల్లెతోనే జీవన ప్రయాణం. అలాంటి ఆ మాతృభూమిని రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసి.. పల్లె తల్లి ఒడిలో నుంచి కన్నీటితో బయటికి వచ్చారు. తాము ఇబ్బందులు పడినా.. రానున్న తరాలు బాగు పడతాయనే సదుద్దేశంతో ముందడుగు వేశారు. ఎన్నో కలలతో కట్టుకున్న సొంత ఇంటిని వదిలేసి నిర్వాసితులుగా మారారు. అండగా ఉంటామన్న ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలతో సరిపెడుతుంటే.. కష్టాన్ని దిగమింగి కాలంతో పోరాడుతున్నారు. ఇలా రోడ్డున పడిన పోలవరం నిర్వాహసితుల కోసం సీపీఎం పోరు కేక పెట్టింది. నిర్వాసితుల గోడు వినే వరకు కదం తొక్కుతామని ముందుడుగు వేసింది. యాత్ర అడుగులో అడుగేసిన నిర్వాసితుల కన్నీళ్లు ఎరుపెక్కాయి. తమ ఆవేదన ఆలకించాలని నినదించాయి.పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉంటూ పంటలు సుభిక్షంగా పండుతాయని ఉద్దేశంతో వేల ఎకరాల భూములు, గ్రామాలు ఖాళీ చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లిన అభాగ్యులు కన్నెర్ర చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా, సరైన పునరావాసం కల్పించకుండా కాలం గడుపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా పోరు కేకతో నిర్వాసితులు మహాపాదయాత్రకు కదం తొక్కారు. జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసిన బాధ్యత మొదట తమదేనన్న కేంద్ర ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణాలను అంగరంగ వైభవంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల వేదనలను ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎంతో కలిసి పోరు కేక పెట్టారు.. కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని గుడ్డి, చెవిటి ప్రభుత్వాల్ని మనం ఎన్నుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు విమర్శించారు. వరదలొస్తే మురుమూరు గ్రామం నీటమునిగే ప్రమాదముందని, 41 కాంటూరులో కలపాలని కోరుతూ అధికారికి మెమోరాండం సమర్పించారు. మురుమూరులో మొత్తం 356 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. పాదయాత్రకు వైసీపీ కాచవరం నాయకులు సంఫీుభావం పలికారు. అనంతరం పల్లూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.పోలవరం నిర్వాసితులకు పునరావసంతోపాటు పూర్తి పరిహారం చెల్లించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని మహా పాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని, 1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాలు రీ సర్వే చేయాలని, మండలాన్ని యూనిట్‌ గా తీసుకొని పునరావాసం పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని కోరింది. పునరావాసం ఏకకాలంలో అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని, ప్రతి ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గ్రామాలు ఖాళీ చేయించే నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలని, నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరింది.అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 400 కిలోవిూటర్ల మేర 15 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. జూలై నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నాతో ఈ పాదయాత్ర ముగుస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *