ప్రభుత్వ పథకాలకు గ్రామాలు దూరం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు ఆ గ్రామానికి అందడం లేదు. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో ఆ గ్రామ రైతుల కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం. సర్కారు, సింగరేణి దోబూచులాడుతున్న తీరు వల్లే ఈ పరిస్థితి తయారైందన్న ఆవేదన అక్కడి రైతుల్లో వ్యక్తం అవుతోంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామస్థులపై శీతకన్ను చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఇరకాటంలో పెట్టి తమను ఇబ్బందుకుల గురి చేస్తున్నారు తప్ప న్యాయం మాత్రం చేయడం లేదని అంటున్నారు. సాగుపైనే మమకారం పెంచుకుని తరాలుగా జీవనం సాగించిన తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు కోసం భూ సేకరణ జరిపిన అధికారులు నోటిఫై చేసి రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే అవార్డు నగదును ఓ ప్రైవేటు బ్యాంకులో జమ చేశారు. దీంతో తమ పని పూర్తయిందని సింగరేణి సంస్థ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. రైతుల చేతికి చిల్లిగవ్వ రాకున్నా కూడా సంస్థ భూములను స్వాధీనం చేసుకున్నట్టుగా రికార్డుల్లోకి ఎక్కడం విస్మయం కల్గిస్తోంది. 2011 నుండి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న రైతులు ధరణి పోర్టల్‌ అమలుతో అదృశ్యం అయ్యారు. సింరేణి సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకున్న ప్రభుత్వం పట్టాదారుల పేర్లు మార్చేసింది. దీంతో అప్పటి నుండి రైతు బంధు, రైతు భీమా పథకాలు బుధవారంపేట రైతాంగానికి అందడం లేదు.ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు మృత్యువాత పడగా ఒక్కరికి కూడా పరిహారం అందలేదు. తాజాగా మడిపల్లి రాజయ్య అనే రైతు చనిపోవడంతో ఆ కుటుంబానికి బాసటగా నిలిచేదెవరని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం రాజయ్య మృత్యువాత పడడంతో గ్రామస్థులు తమకు న్యాయం చేయాలని మరోసారి వేడుకుంటున్నారు. భీమా అమలు కావాలంటే కొత్త పాసు పుస్తకాలు అవసరం ఉండగా ధరణి పోర్టల్‌లో సింగరేణి సంస్థ యాజమాన్యంగా పేర్కొనడం తమకు శాపంగా పరిణమించిందని రైతులు అంటున్నారు. సింగరేణి సంస్థ ఏకపక్షంగా తీసుకున్న అవార్డు నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని న్యాయం చేయాలని హై కోర్టును ఆశ్రయించినప్పటికీ సర్కారు యంత్రాంగం మాత్రం పట్టదారులుగా ఉన్న తమ పేర్లను తొలగించిందని వాపోతున్నారు. బుధవారంపేట గ్రామానికి చెందిన భూసేకరణ విషయం హై కోర్టులో విచారణ నడుస్తున్నందున పట్టాదారుల పేర్లను తొలగించాల్సిన అవసరం లేదని వారంటున్నారు. రికార్డుల్లో తమ పేర్లు ఉన్నట్టయితే తమకు ప్రభుత్వం నుండి రావల్సిన రైతు బంధు, రైతు భీమా పథకాలు అయినా వచ్చేవని అంటున్నారు. రెవెన్యూ అధికారులు ధరణీ పోర్టల్‌ లో తమ పేర్లను తొలగించడం వల్ల తమ పరిస్థితి రెంటికి చెడ్డా రేవడిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై కోర్టు ఆదేశాలు వచ్చే వరకు అయినా తమ పేర్లను పట్టాదారుల కాలంలో చేర్చినట్టయితే ప్రభుత్వ పథకాలను అందుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *