జగన్‌ ఆత్మరక్షణలో పడ్డారా…

రాజమండ్రి, అక్టోబరు 13
చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదు. నేను ఏపీలో లేని టైంలోనే చంద్రబాబును పోలీసులు లోపలేశారు. ఇది తాజా చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఎం జగన్‌ చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. మొన్నటికి మొన్న నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేసిన జగన్‌ ఒక్కసారిగా టోన్‌ మార్చడానికి కారణం ఏంటీ? నిజంగా జగన్‌ ఆత్మరక్షణలో పడ్డారా లేకుంటే దీనికి వేరే కారణం ఏమైనా ఉందా? జగన్‌ రాజకీయం గమనిస్తే ప్రతి మాటలో, చేసే పని వెనుక పెద్ద ప్లానే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా అదే ఉందనే టాక్‌ వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు లాంటి బలమైన రాజకీయ నాయకుడిని జైలుకు పంపించేంత సాహసం చేయరు. అలా చేస్తే అవతలి వ్యక్తికి సానుభూతి వెళ్తుంది ఎన్నికల్లో తమకు దెబ్బపడుతుందని లెక్కలు వేసుకుంటారు. కానీ జగన్‌ పూర్తిగా భిన్నం. చంద్రబాబును ఎన్నికల టైంలోనే జైల్లో పెట్టారు. అంతే కాదు టీడీపీని అష్టదిగ్బంధనం చేశారు. ఇది జనాల్లో విస్తృతంగా చర్చకు దారి తీసింది. అయితే అరెస్టు వరకు బాగానే జరిగినప్పటికీ ఆ టైంలో కొందరు వైసీపీ లీడర్లు చేసన తప్పిదం మరింత చర్చనీయాంశమైంది. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత మంత్రి రోజా సహా చాలా మంది వైసీపీ లీడర్లు బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు అరెస్టు టైంలో వైసీపీ లీడర్లు చేసిన అతి వల్ల పార్టీకి కొంత డ్యామేజీ జరిగిందని జగన్‌ గ్రహించారు. క్షేత్రస్థాయిలో దీనిపై నెగటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో వైసీపీ అలర్ట్‌ అయింది. చంద్రబాబు అరెస్టుపై కొంతమంది నాయకులే స్పందించాలని స్పష్టం చేసింది అధిష్ఠానం. జగన్‌ లండన్‌ నుంచి వచ్చిన తర్వాత పార్టీ నేతలకు క్లాస్‌ తీసుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు పార్టీకి ఏం సంబంధమని నిలదీసినట్టు సమాచారం. ఇలా పార్టీ పరంగ జరిగి డ్యామేజీని కంట్రోల్‌ చేసేందుకు చంద్రబాబు అరెస్టుతో తమకు ఎలాంటి సంబంధంలేదని చట్టం తన పని తాను చేసుకుంటుందనే లైన్‌లో జగన్‌ మాట్లాడారు. తాను ఇండియాలో లేనప్పుడే చంద్రబాబు అరెస్టు జరిగిందని ఆయన ఎక్కడ ఉన్నా పెద్దగా ఒరిగేదేవిూ లేదన్నట్టు మాట్లాడారు. ఆయన వల్ల తమకు పార్టీకి వచ్చే నష్టమేవిూ లేదన్నట్టు కామెంట్‌ చేశారు. దీనిపై టీడీపీ నేతలు మాత్రం మరో కోణంలో విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరిగిందని అందుకే జగన్‌ స్వరం మార్చారని విమర్శిస్తున్నారు. నిడదవోలు సభలో స్కాంస్టార్‌ అంటూ ఆరోపణలు చేసిన వ్యక్తి పార్టీ సమావేశంలో మాత్రం బాబుపై పగలేదంటూ కామెంట్‌ చేశారని గుర్తు చేస్తున్నారు. జగన్‌ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై సామాన్యులకు అనుమానం వస్తోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ పై ఏపీ సీఐడీ జగన్‌ కు కనీస సమాచారం ఇవ్వలేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 33 రోజులుగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన వేసుకున్న బెయిల్‌ పిటషన్లు, క్వాష్‌ పిటిషన్లు రాష్ట్ర కోర్టుల్లో తిరస్కరణ గురయ్యాయి. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ప్రభుత్వం, ఏపీ సీఐడీ చూపించలేకపోయిందని అందుకే ఇప్పుడు జగన్‌ యూ టర్న్‌ తీసుకున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *