పార్లమెంట్‌ బరిలోకి మరో గాంధీ…

2024 సార్వత్రిక ఎన్నికల రణరంగంలో ప్రియాంక గాంధీ అడుగుపెడతారని పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. వయోభారం, అనారోగ్యం కారణాలతో ఈసారి ఎన్నికల బరికి సోనియా దూరంగా ఉంటారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రియాంక ఆరంగేట్రంపై వస్తున్న వార్తలు సర్వత్రా ఆసక్తి కల్గిస్తున్నాయి. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక గాంధీ..ఎన్నికల్లో పోటీ చేయాడనికి ప్రియాంకకు అన్ని అర్హతలు, అనుభవం ఉందంటూ ఆమె భర్త రాబర్డ్‌ వాద్రా చేసిన వ్యాఖ్యలే ఈ తాజా చర్చకు ఊతమిచ్చాయి. ఇన్నాళ్లుగా అటు తల్లి సోనియా గాంధీకి, ఇటు సోదరుడు రాహుల్‌ గాంధీకి చేదోడువాదోడుగా నిలుస్తూ.. ఎన్నికల వేళ ఆ ఇద్దరి తరఫున ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక గాంధీ.. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీపై 2019లోనే పెద్ద చర్చ జరిగింది. వారణాసి నియోజకవర్గంలో బరిలోకి దిగి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే సవాల్‌ విసురుతారని కూడా కథనాలు వెలువడ్డాయి. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ఎన్నకల్లో పోటీ చేస్తానంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా అమేథీలో ఆమె వ్యాఖ్యానించారు. కానీ ఆమె కేవలం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. పక్కపక్కనే ఉన్న రాయ్‌బరేలి, అమేథీ నియోజకవర్గాల్లో తల్లీకొడుకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2019లో రాహుల్‌ గాంధీ అమేథీలో ఓటమిపాలయ్యారు. దక్షిణాదిన పార్టీకి ఊపు తేవాలన్న ఉద్దేశంతో కేరళలోని వాయనాడ్‌ స్థానం కూడా పోటీ చేయడం వల్ల ఆ స్థానంలో గెలుపొంది పార్లమెంటులోకి అడుగు పెట్టారు. తద్వారా లోక్‌సభలో ఇద్దరు గాంధీలు (సోనియా, రాహుల్‌) ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఈసారి సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రమైన డిమాండ్‌ ఉంది. ఆరోగ్యం సహకరిస్తే సోనియా గాంధీని పెద్దల సభ (రాజ్యసభ)కైనా పంపించవచ్చని, ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్‌ క్రేజ్‌ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.రాజకీయాల్లో పలుకుపడి కల్గిన కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారంటే.. పవర్‌ సెంటర్లకు ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌లో సోనియా గాంధీ 2019 వరకు క్రియాశీలంగా వ్యవహరిస్తూ పార్టీలో, గాంధీ పరివారంలో పవర్‌ సెంటర్‌గా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో బాధ్యతలు రాహుల్‌ గాంధీకి అప్పగించినప్పటికీ.. పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదన్న కథనాలు వచ్చాయి. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న తన ఆలోచనలను దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన పాతతరం నేతలు అమలు చేయనీయలేదని రాహుల్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ నాయకత్వ పగ్గాలను వదిలేసిన రాహుల్‌, తర్వాత పరోక్షంగా పార్టీపై పట్టు బిగించారు. పాతతరం నేతలకు పొగపెట్టారు. 23 మంది నేతలు జీ`23గా మారి సోనియా గాంధీకి లేఖ రాయడం వెనుక రాహుల్‌ దూకుడే కారణమన్న విషయం తెలిసిందే. తర్వాతి క్రమంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు 4,080 కిలోవిూటర్ల మేర భారత్‌ జోడో పేరుతో చేపట్టిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాహుల్‌ గాంధీ రాజకీయాలను ఆటవిడుపుగా చూస్తారని, ఆయనకు పరిణితి లేదని ప్రత్యర్థులు చేసిన ప్రచారం, ముద్రను ఈ పాదయాత్ర ద్వారా కొంతవరకు చెరిపేసుకోగలిగారు. తొలుత ప్రధాని అభ్యర్థిగా సొంతపార్టీలోనే సీనియర్‌ నేతల విశ్వాసం పొందలేకపోయిన రాహుల్‌ గాంధీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిపి ఏర్పాటు చేసిన కూటమి నుంచి కూడా సానుకూలత పొందగల్గుతున్నారు.. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో రాహుల్‌ గాంధీతో సమానంగా? ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాల్లో కాస్త ఎక్కువగానే ప్రియాంక గాంధీకి ఆదరణ కనిపిస్తుంది. ప్రజలు ఆమెలో ఉక్కు మహిళగా పేరొందిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చూస్తున్నారు. చూడ్డానికి మాత్రమే కాదు, వేషభాషలు, మాట్లాడే తీరు కూడా నానమ్మను తలపించేలా ఉంటాయి. ఈ మధ్యనే జరిగిన హిమాచల్‌, కర్నాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి బాధ్యత వహించి, అక్కడ పార్టీకి విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే కర్ణాటకలో రాహుల్‌ గాంధీ 21 సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించగా? ప్రియాంక గాంధీ 25 సభలు, రోడ్‌షోలలో ప్రసంగించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారంలో ప్రియాంక ముఖ్య పాత్ర పోషించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె సహజసిద్ధమైన ఆకర్షణ, అయస్కాంత తేజస్సు, స్పష్టమైన వ్యక్తీకరణ వంటి ప్రతిభ, నైపుణ్యాలు సమాజంలోని విభిన్న వర్గాలను ఆకట్టుకునేలా చేస్తున్నాయని ప్రియాంక ఎదుగుదలను నిశితంగా గమనిస్తున్నవారు అంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించకపోయినప్పటికీ.. ఆమె నేతృత్వంలో పార్టీ బలోపేతం కావడం, గతం కంటే పుంజుకోవడాన్ని ఇందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ఈ ప్రత్యేకతలు ఆమెను పార్టీలోనే కాదు, కుటుంబంలోనూ మరో పవర్‌ సెంటర్‌గా మార్చేందుకు దోహదపడతాయి. అదే జరిగితే.. రాహుల్‌ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడుతుంది. పార్టీ లేదా కుటుంబం ప్రియాంక గాంధీకి ఏమాత్రం అవకాశం కల్పించినా.. పరోక్షంగా రాహుల్‌ గాంధీ విఫలం చెందినట్టు అంగీకరించాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం ప్రియాంక రాక సందర్భంగా ఎదురవుతున్న సందేహాలు, సవాళ్లు, ప్రశ్నలు. అన్నాచెల్లెళ్లు రాహుల్‌ ? ప్రియాంక ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రియాంకను రాయ్‌బరేలి నుంచి, రాహుల్‌ గాంధీ వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో పార్టీకి ఊపొస్తుందని సలహాలు, సూచనలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి మహిళా శక్తి పార్టీకి అనుకూలంగా మారుతుందని, దేశ జనాభాలో సగం ఉన్న మహిళలను ఆకట్టుకోవడంలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తారని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. మరోవైపు కుటుంబ రాజకీయాలు, రాజకీయ వారసత్వాల గురించి పదే పదే విమర్శలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం, గాంధీ కుటుంబం ప్రియాంక ఆరంగేట్రంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *