అందుబాటులోకి కవచ్‌…

శ్రీకాకుళం, జూలై 8, (న్యూస్‌ పల్స్‌)
టెక్నాలజీలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సైబర్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన మొబైల్స్‌లోకి ఏవేవో యాప్‌లు వచ్చి చేరుతున్నాయి. అలా వచ్చి చేరుతున్న యాప్‌ల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనకు తెలియకుండానే సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ అయి ఫోన్‌లో డేటా సైబర్‌ కేటుగాళ్ల చేతికి చేరిపోతుంది. అలా సేకరించిన డేటాతో మన వ్యక్తిగత సమాచారం సేకరించి మనల్ని బ్లాక్‌ మెయిల్‌ చేసేవారు కొందరైతే?లింకులు, ఆ యాప్‌ల ద్వారా మన బ్యాంక్‌ అకౌంట్లును ఖాళీ చేసేస్తున్నారు మరికొందరు. జరగవలసిన నష్టమంత జరిగి, మన అకౌంట్‌ ఖాళీ అయ్యాక గాని సైబర్‌ మోసం జరిగినట్లు గుర్తించలేము. మరికొందరికి అయితే ఈ యాప్‌ల విషయంలో కాస్త అనుమానం వచ్చినా వాటిపై క్లారిటీ తీసుకునేందుకు ఎవరినీ సంప్రదించాలి, ఎలా బయటపడాలి అనేది తెలియదు.ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టేందుకు శ్రీకాకుళం జిల్లా పోలీస్‌ శాఖ ఓ అడుగు ముందుకేసింది. సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు పబ్లిక్‌ కోసం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద దిశ సైబర్‌ కవచ్‌ సాఫ్ట్‌వేర్‌ మిషన్‌ ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను సైబర్‌ మిషన్‌కు కనెక్ట్‌ చేసి స్కాన్‌ చేస్తే అందులో ఉన్న వైరస్‌,సైబర్‌ మాల్వార్‌తో పాటు తెలియకుండా ఇన్స్టాల్‌ అయిన యాప్‌లను కూడా గుర్తించి తొలగించవచ్చు. దిశ సైబర్‌ కవచ్‌ చూడటానికి ఏటీఎం మిషన్‌ తరహాలోనే ఉంటుంది. మొబైల్‌ ఛార్జింగ్‌ పిన్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా సైబర్‌ కవచ్‌ మెషిన్‌కు అనుసంధానం చేస్తే.. ఆ మొబైల్‌లో ఉన్న సమాచారాన్ని బట్టి వైరస్‌ను గుర్తించవచ్చు. వాటిని వెంటనే డిలీట్‌ చేసుకోవచ్చు.
ఎవరైనా సరే వచ్చి తమ కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ మెషిన్‌కు ఫోన్‌ను అనుసంధానం చేసి వైరస్‌ను డిలీట్‌ చేసుకోవచ్చనీ.. తమ సిబ్బంది కూడా సహాయం అందిస్తారని జిల్లా ఎస్పీ జి.ఆర్‌. రాధిక చెబుతున్నారు. ఈ మెషిన్‌ దగ్గర సహాయంగా ఉండేందుకు ఒకరికి శిక్షణ కూడా ఇచ్చామని ఎవరైనా వచ్చి ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని తెలిపారు .ఈ మోనిటర్‌ ద్వారా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించబడదని కూడా ఎస్పీ స్పష్టం చేశారు.సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టేలా దిశ సైబర్‌ కవచ్‌ సాఫ్ట్‌వేర్‌ మిషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *