అక్రమాలకు అడ్డాగా ఇంటర్‌ బోర్డు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు అక్రమాలకు అడ్డాగా మారిందా?. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారా?, ప్రభుత్వానికి చెప్పకుండానే సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయా?. అంటే అధికారవర్గాలు, సిబ్బంది, అధ్యా పకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. రిటైర్డ్‌ ఉద్యోగులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ఓఎస్డీ, కన్సల్టెంట్‌, సలహాదారులుగా నియమించొద్దని 2015, మే 2న ఆర్థిక శాఖ జీవోనెంబర్‌ 55ను జారీ చేసింది. ఆ జీవోను సైతం ఖాతరు చేయకుండా ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురిని ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు 2018, జూన్‌ 18న ఆర్థిక శాఖ జీవో నెంబర్‌ 81ని విడుదల చేసింది. ఒకవేళ అనారోగ్యం, ఇతర సమస్యలున్న ఉద్యోగులను ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతితో బదిలీలు చేసేందుకు అవకాశమున్నది. కానీ గుట్టుచప్పుడు కాకుండా మంత్రికి, ప్రభుత్వానికి తెలియకుండా అవినీతికి పాల్పడుతూ ఇటీవల ముగ్గురిని బదిలీ చేయడం విమర్శలకు దారితీస్తున్నది. ఇక డిప్యూటేషన్లను ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను డిప్యూటేషన్‌ కింద వివిధ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల నిర్వహణను గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలుఇంటర్‌ బోర్డులో పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ)గా పనిచేసిన సుశీల్‌కుమార్‌ 2019, ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. 2019 ఇంటర్‌ వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆయనను ఓఎస్డీగా నియమించింది. ఆ తర్వాత 2019`20, 2020`21, 2021`22లోనూ ఆయన కొనసాగుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 15 వరకు ఆయన ఓఎస్డీగా కొనసాగుతారు. ఇంటర్‌ బోర్డులో డిప్యూటీ సెక్రెటరీగా పనిచేసిన జగన్‌మోహన్‌రెడ్డి 2021, ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. ఈ ఏడాది మే 1 నుంచి ఆయనను ఓఎస్డీగా నియమించారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం పూర్తిగా లేని అతనికి కంప్యూటరైజేషన్‌తోపాటు, ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ ఈ ఆఫీస్‌ పనులను పర్యవేక్షించాలని చెప్పడం విమర్శలకు తావిస్తున్నది. ఎయిడెడ్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన సారధి బహుగుణ ఉద్యోగ విరమణ పొందారు. ఆయనను 2020, నవంబర్‌ 20న ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ లెర్నింగ్‌, ఆడియో` విజువల్‌ లెసన్‌ కంటెంట్‌ తయారు చేసే బాధ్యతలను అప్పగించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న పలువురు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు డిప్యూటేషన్‌ కింద వివిధ బాధ్యతలు అప్పగించారు. చాగంటి శ్రీనివాస్‌, రమణి, రవూఫ్‌, మహేందర్‌, శ్రీనివాసరావుకు డిప్యూటేషన్‌ ఇచ్చారు. పదోన్నతి పొందిన వారు ప్రొబేషన్‌ కింద కనీసం ఏడాదిపాటు ఆ బాధ్యతలను నిర్వహించాలి. ఆ తర్వాతే డిప్యూటేషన్‌ కింద వారిని తీసుకోవాలి. ఆ నిబంధనలను ఖాతరు చేయకుండా డిప్యూటేషన్‌ కల్పించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎయిడెడ్‌ కాలేజీల్లో పనిచేసిన సందీప్‌ను ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి రికార్డ్‌ అసిస్టెంట్‌గా, జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఎస్‌ఎంఎ రసూల్‌ను సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. వారికి పదోన్నతులు ఇవ్వాలంటే డీపీసీ నిర్వహించాలి. వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న ఎం లక్ష్మారెడ్డిని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి లేకుండా, మంత్రికి, ప్రభుత్వానికి తెలియకుండా ముగ్గురిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ (జీజేసీ)లో హిస్టరీ జేఎల్‌గా పనిచేసిన బి సుజాతరెడ్డిని హయత్‌నగర్‌ జీజేసీకి, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట జీజేసీలో పనిచేస్తున్న భగవంతాచారిని మహబూబ్‌నగర్‌ జీజేసీకి బదిలీ చేశారు. విధులకు గైర్హాజరైన పి వేణు నల్లగొండ జిల్లా నాంపల్లి జీజేసీలో పనిచేశారు. నిబంధనల ప్రకారం ఆ కాలేజీలోనే తిరిగి నియమించాలి. కానీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జీజేసీకి బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *