భారంగా మారుతున్న విద్య

ఇరవయ్యేళ్ల క్రితం వరకు కూడా బడికి వెళ్లడానికి పిల్లలు, పంపించడానికి తల్లిదండ్రులూ పెద్దగా ఇబ్బందిపడలేదు. ఫీజులు ఎలా ఉన్నా కొంత ఆలస్యంగా కట్టినా పిల్లల్ని, తల్లిదండ్రులనూ ఇబ్బందిపెట్టేవారు కాదు. క్రమేపీ విద్యాలయాలన్ని బిజినెస్‌ సెంటర్లుగా మారిపోయి వ్యాపారానికి, త్వరగా ధనికులు కావడానికి ఇదో మార్గంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలపట్ల ప్రభు త్వాలు నిర్లక్ష్య వైఖరితోనే ప్రైవేటు పాఠశాలలు విజృంభిస్తున్నాయి. చదువు పేరుతో రుబ్బురోలులా మారుతున్నాయి. పిల్లల్ని ఆరోగ్యానికి, తిండికి దూరంచేస్తున్నాయి. బొత్తిగా స్కూలు ప్రతిష్టకోసమే పిల్లలకి ర్యాంకుల పిచ్చి పట్టించారన్నదే వాస్తవం. పిల్లలు బాగా చదువుతారు, మరింత బాగా చదివించడం ఓకే. కానీ ర్యాంకులు, స్టేట్‌, నేషనల్‌ ర్యాంకులనే పేరుతో ఆరోగ్యాన్ని స్కూళ్ల యాజ మాన్యాలు లాగేసుకునే స్థాయిలో పనిచేస్తున్నాయి.దీనికి సమాంతరంగా ఫీజుల ఇబ్బంది పెడుతున్నాయి. బ్యాంకు రుణాలతో ఇబ్బందిపడుతున్న కుటుంబాలు వాటితో పాటు ఇటు స్కూలు యాజమాన్యాల దబాయింపులు కూడా ఎదుర్కొంటు న్నారు. ఇది ఏవిధంగా విద్యా విధానమో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏదో ఒక పేరుతో ప్రత్యేక వసతులు కల్పించామంటూ ప్రతీ ఏడాదీ ఫీజులు పెంచుతున్నారు. పెంచిన మేరకు రహస్యంగా వసూలు చేయస్తుండడం కూడా జరుగుతోంది. బయటికి తెలిస్తే ప్రమాదమనే భయంతో యాజమాన్యాలు ప్రతి నిధుల ద్వారా వసూళ్లు మొదలెట్టారు. అదంతా స్కూళ్ల అభివృద్ధికి ఉపయోగపడేవేగానీ పిల్లలకు కాదు. వచ్చే ఏడాది పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఇప్పుడున్న వారి నుంచి వసూలు చేసుకుంటున్నారు. పైకి మాత్రం విద్య వ్యాపార వస్తువు కాదనే అంటూనే తెరవెనక ధనార్జనా మార్గాలు ఎన్నో చేస్తున్నారు. చాలాకాలం స్టేషనరీ అంతా పుస్తకాలతో పాటు బయట బుక్‌ స్టాల్స్‌లోనే కొనే వీలుండేది. ఇపుడు ఏకంగా తమ స్కూలు స్టాళ్ల లోనే కొనాలని ఒక నిబంధన పెట్టడం, అక్కడ కొన్నవే అంగీకరిస్తామనడం తల్లిదండ్రులను భయపెట్ట డమే అవుతోంది. సిలబస్‌ పుస్తకాలు బయటా దొరుకుతున్నపుడు స్కూళ్ల స్టాల్స్‌లో ఎందుకు కొనాలంటే అదంతే! కొనకపోతే పిల్లల్ని ఇబ్బంది పెడతారన్న భయంతో తల్లిదండ్రులూ అంగీకరిస్తున్నారు. పోనీ అదేమన్నా ధర కాస్తంత తగ్గిస్తారా అంటే అదేవిూ ఉండదు. స్కూళ్లలో స్టాల్‌ పెట్టడానికి బయటివారికే అనుమతించి లాభసాటి వ్యాపారం చేయడం పరిపాటి అయింది. చిత్రమేమంటే కొన్ని పాఠశాల యాజమాన్యాలు వారి వద్దనే పుస్తకాలు, యూనిఫారాలు కొనాలని లేకుంటే అడ్మిషన్‌ కష్టమని నేరుగా చెబుతు న్నారు. విద్యార్ధుల అభివృద్ధిని ఆశించాల్సిన పాఠశాలలు తమ వ్యాపారాభివృద్ధికే ప్రాధాన్యతనీయడం శోచనీయమని తల్లి దండ్రుల ఆవేదన. అధికా రులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం అంతంత మాత్రమే. ఆ సెట్‌, ఈ సెట్‌ అంటూ వాటికి ప్రిపేర్‌ చేయిస్తాం అంటూ ప్రత్యేక క్లాసు లు పేరుతో మరింత డబ్బు గుంజేయడం నేర్చుకున్నా రు. తల్లిదండ్రులతో సంప్రదించకుండానే కొన్ని పాఠ శాలలు ఇలాంటి దోపిడీ కీ పాల్పడుతుండడం శోచనీయం. దీనికి తోడు ఇటీ వలి కాలంలో డిజిటల్‌ టీచింగ్‌ ఆరంభించారు. ఆన్‌లైన్‌ క్లాసుల విధానంలో పిల్లలకు పాఠాలు చెప్పాలన్న ఆలోచన ఎంత వరకూ విజయవంతమవుతుంది? పట్టణాల్లో, గ్రామాల్లో పాఠశాల పిల్లల పరిస్థితి ఏమిటి? వారికి అందుకు తగిన వసతులు ఏర్పాటు చేసుకునే ఆర్ధిక మద్దతు ఉంటుందా? టీవీల్లో సినిమాలు, సీరియల్స్‌ చూసి ఆనందించడానికి, పాఠాలు చెబుతూ పిల్లల్ని ఆకట్టుకోవడానికీ తేడా ఉంటుంది. ఈ నూతన విద్యాబోధనా విధానం అలవర్చుకోవాలని, భవిష్య త్తును ప్రభుత్వమే నిర్ణయించేసింది. దీంతో ఎక్కడా లేని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పిల్లల భవిష్యత్తుకు మూలాధారమైన పాఠశాల విద్యావిధానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కు అంతగా ప్రాధాన్యతనీయడం లేదన్నది స్పష్టం. వేల సంవత్సరాల పాటు భూమిపై హక్కు లేక ఆర్థిక అణచివేతకు, చదివే హక్కు లేక కుల పీడనకు గురైన ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి సామాజిక తరగతుల ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండడంతో కొంతమేరకైనా చదువుకోగలుగుతున్నారు. అత్యంత వెనకబడిన తరగతుల (ఎం.బి.సి) పిల్లలు నేటికీ ప్రభుత్వ బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈ తరగతుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారు. ఉన్నత సామాజిక తరగతుల్లోని పేదలు కూడా నష్టపోతారు. నూతన విద్యావిధానం అమలు చేయడం అంటే ఇదే! విద్యారంగంలో తిరోగమనాన్ని నిలవరించి అందరికీ ప్రభుత్వ విద్య అందే విధంగా, విద్యా హక్కు అమలు సంపూర్ణంగా జరిగేలా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మన ముందుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *