జనసేనాని యాక్షన్‌ ప్లాన్‌ ఎప్పుడు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేళ్లు దాటుతుంది. రాజకీయంగా ఆయన అడుగులు ఇంకా ఎక్కువే. కానీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. ఎన్నికల్లో గెలవాలన్న కనీస ధ్యాస లేని నేతగానే పవన్‌ను చూడాల్సి ఉంటుంది. జనసేనాని తెలంగాణ నేతలను వెనకేసుకు రావడానికి చేసిన ప్రయత్నం రాజకీయంగా వికటించే అవకాశముంది. పవన్‌ రాజకీయమంతా ఆంధ్రప్రదేశ్‌ లోనే. తెలంగాణలో ఆయన దృష్టి పెట్టడం కూడా తక్కువే. అలాంటిది పవన్‌ తెలంగాణ మంత్రులను వెనకేసుకు రావడం చర్చనీయాంశమైంది. ఒకరు చెబితే వినిరేకం వ్యక్తి కాదు. అలా అని సోదరుడు చిరంజీవిలాగా సున్నిత మనస్కుడూ కాదు. ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుంటే ఇక రాజకీయాలు ఎలా చేస్తారని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అయినట్లే అని వారిలో వారు మౌనంగా రోదిస్తూ ఉండి పోవాల్సి వస్తుంది. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఏం కాంటెస్ట్‌లో అన్నారో తెలియదు కానీ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పవన్‌ కల్యాణ్‌. ఏపీ మంత్రుల్లో ఒక సీదిరి అప్పలరాజు మాత్రమే పరిధి దాటి మాట్లాడారు. అందుకు సీఎంవో కార్యాలయం నుంచి ఆయనకు అక్షింతలు కూడా పడ్డాయి. అప్పలరాజు కామెంట్స్‌ ఎవరూ స్వాగతించరు. అయితే మిగిలిన మంత్రులు తమ ప్రాంతంపై జరుగుతున్న దాడిపైనే స్పందించారు. దానిపై తప్పు పవన్‌ ఏం కనిపించిందో ఆయనే చెప్పాలి. కేవలం ఎన్నికల సమయంలోనే ఏపీలో అభివృద్ధిపై మాట్లాడటం తెలంగాణ మంత్రులకు సాధారణమయిపోయిందన్న ఏపీ మంత్రులు చేసిన కామెంట్స్‌లో తప్పేమిటన్నది అందరూ వేసే ప్రశ్న. నేనున్నానంటూ రావడం పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న తప్పిదమే అనుకోవాలి. ఆయన నిలకడలేని స్వభావం కూడా రాజకీయంగా ఆయనతో పాటు సహచర నేతలకు, అభిమానులకు, పార్టీ క్యాడర్‌ను ఇబ్బంది పెడుతుందనే అనుకోవాలి. పవన్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. తానే కేసీఆర్‌ ను తిట్టిపోస్తే అందులో తప్పులేదు. కానీ ఏపీ మంత్రులు తిరిగి ప్రశ్నిస్తే తప్పెలా అవుతుందో చెప్పాలంటూ మంత్రి పేర్ని నేని వేసిన ప్రశ్నకు పవన్‌ సమాధానం చెప్పగలరా? ఇలా పవన్‌ రోజురోజుకూ తనంతట ఇమేజ్‌ను ఏపీలో దిగజార్చుకుంటున్నారన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. సీరియస్‌ గా రాజకీయాలు అన్నా చేయాలి. లేకుంటే మానేయాలి. అంతే తప్ప ఇలా అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తూ పార్టీని రాజకీయంగా ఇబ్బందిపెడుతున్నారంటున్నారు ఆయన అభిమానులు. పవన్‌ కల్యాణ్‌ ఇంత వరకూ ప్రజల్లోకి రాలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏపీ వచ్చి కొంత హడావిడి చేసి వెళ్లిపోయారు. తర్వాత మామూలే. సినిమా షూటింగ్‌లు చేసుకోవడంలో తప్పులేదు. ఆయనకు అది వృత్తి. నాలుగు కాదు ఎన్నైనా చేసుకోవచ్చు. కాకుంటే అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తే జనం నమ్మకం ఎలా సాధిస్తారన్నది ఆ పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ప్రశ్న. హైదరాబాద్‌లో ఉండి ట్వీట్‌ చేయడం ద్వారానో, వీడియో విడుదల చేయడం ద్వారానో రాజకీయాలు చేయాలనుకుంటే ఆ కాలం కాదిది. ప్రజల్లో నలిగిని వాళ్లనే జనం విశ్వసిస్తారు. తమనేతగా గుర్తిస్తారు. అంతే తప్ప అప్పుడప్పుడు వచ్చి చేసే విమర్శలకు విలువ ఎలా ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌ నిజాయితీ పరుడే కావచ్చు. నిక్కచ్చిగా ఉంటారని భావించవచ్చు. కానీ అస్సలు రాజకీయం తెలీకపోతే ఎలా అంటూ ఆయన అభిమానులే ముక్కున వేలేసుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *