ఆ 25 మంది ఎవరు….

బీఆర్‌ఎస్‌ లో టికెట్ల వ్యవహారం హీటెక్కింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల హడావుడి తగ్గగానే ముఖ్యమంత్రి కేటీఆర్‌ పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఆయన పార్టీ వ్యవహారాలపై సీరియస్‌ గా దృష్టి సారించారు.పార్టీలో అసమ్మతిని, అసంతృప్తులను బుజ్జగించడమో, వీలు కాకపోతే సాగనంపడమో చేయడానికి అవసరమైన కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇక పార్టీ నాయకులతో ప్రగతి భవన్‌ లో వరుస భేటీలకు సమాయత్తమౌతున్నారు. ముఖ్యంగా సిట్టింగులకు పార్టీ టికెట్ల విషయంలో ప్రజలలో వారికి ఉన్న ఆదరణ, పని తీరు వంటివి పరిగణనలోనికి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికిప్పడైతే ఓ పాతిక మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.ఆ పాతిక మందిపైనా వారి వారి నియోజకవర్గాలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. అలాగే పార్టీ వర్గాలు, శ్రేణులూ కూడా వారికి టికెట్‌ ఇస్తే పని చేసేది లేదని ఖరాకండీగా చెప్పేశారని కూడా బీఆర్‌ఎస్‌ వర్గాలలో చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ కూడా ఆ పాతిక మందినీ మార్చే నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలలో అసంతృప్తులను బుజ్జగించి వారికి పార్టీ విజయానికి కార్యోన్ముఖులుగా మార్చేందుకు కేసీఆర్‌ రెడీ అవుతున్నారనీ, ఒకటి రెండు రోజులలో విడతల వారీగా వివిధ నియోజకవర్గాల బాధ్యలు, కీలక నేతలతో వరుస భేటీలకు ఆయన సమాయత్తమౌతున్నారని అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఆగస్టు తరువాత ఎప్పుడైనా విడుదల కావచ్చునన్న అంచనాతో కేసీఆర్‌ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారని అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే లోగానే పార్టీకి మైలేజ్‌ పెరిగే విధంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నారనీ, అన్ని కార్యక్రమాలలోనూ ఎమ్మెల్యేలను భాగస్వాములను చేయడం ద్వారా వారికీ ప్రజలలో మైలేజ్‌ పెరిగే విధంగా కార్యాచరణ రూపొందించారనీ పార్టీ వర్గాలు చేబుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *