ఇంగ్లండ్‌ అదుర్స్‌

సిడ్నీ: అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ తొలిసారి మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 3-1తో ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇంగ్లిష్‌ జట్టు తరఫున ఎల్లా టూన్‌ (36వ నిమిషం), లారెన్‌ హెంప్‌ (71వ), అలిస్సా రూసో (86వ) గోల్స్‌ చేయగా.. ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ సామ్‌ కెర్‌ ఏకైక గోల్‌ సాధించింది. ఈ మ్యాచ్‌ వీక్షణకు 75 వేల మంది ప్రేక్షకులు హాజరుకావడం విశేషం. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో స్పెయిన్‌తో ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనుంది. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్‌ స్టార్‌ సామ్‌ కెర్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో ఆతిథ్య జట్టు ఫార్వర్డ్‌ విభాగం మరింత బలోపేతమైంది.

ఇరు జట్లూ తొలి నిమిషం నుంచి అటాకింగ్‌ గేమ్‌తో ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 7వ నిమిషంలో కెర్‌కు చక్కని అవకాశం దక్కినా.. ఇంగ్లండ్‌ కీపర్‌ సమర్థంగా అడ్డుకొంది. మరో రెండు నిమిషాలకు ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టాన్‌వే నేరుగా కొట్టిన షాట్‌ను ఆసీస్‌ కీపర్‌ అర్నాల్డ్‌ అడ్డుకోవడంతో గోల్‌ చేసే అవకాశం చేజారింది. ఆ తర్వాత ఇరు జట్లకూ అడపాదడపా అవకాశాలు దక్కినా ఫినిషింగ్‌ లోపంతో గోల్‌ చేయలేక పోయాయి. అయితే, 36వ నిమిషంలో రూసో పాస్‌ను చాకచక్యంగా అందుకొన్న టూన్‌ బంతిని నేరుగా గోల్‌లోకి పంపడంతో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంతో ఫస్టా్‌ఫను ముగించింది.

కెర్‌ గోల్‌ చేసినా..:

సెకండా్‌ఫలో స్కోరు సమానికి ఆసీస్‌ తీవ్రంగా ప్రయత్నించింది. ఈక్రమంలో 63వ నిమిషంలో సామ్‌ సోలోగా ముందుకుసాగుతూ ఇంగ్లండ్‌ బాక్స్‌ బయట నుంచి నేరుగా కొట్టిన కిక్‌.. సుడులు తిరుగుతూ వెళ్లి గోల్‌లో పండింది. దీంతో ఆసీస్‌ 1-1తో స్కోరు సమం చేసింది. మరో ఏడు నిమిషాలకు ఇంగ్లండ్‌కు సువర్ణావకాశం లభించినా రూసో హెడర్‌ వైడ్‌గా వెళ్లింది. కానీ, 71వ నిమిషంలో లాంగ్‌ పాస్‌ను ఆసీస్‌ ప్లేయర్‌ కార్పెంటర్‌ క్లియర్‌ చేయలేక పోవడంతో.. ప్రత్యర్థి ఇన్నర్‌ బాక్స్‌లో బంతిని దొరకబుచ్చుకొన్న హెంప్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌ చేయడంతో ఇంగ్లండ్‌ 2-1తో పైచేయి సాధించింది. మరో 10 నిమిషాల తర్వాత కెర్‌కు స్కోరు సమం చేసే గొప్ప అవకాశం లభించినా.. ఆమె కొట్టిన హెడర్‌ బయటకు పోయింది. అయితే, 81వ నిమిషంలో హెంప్‌ ఇచ్చిన పాస్‌ను రూసో మూలగా గోల్‌లోకి పంపి ఇంగ్లండ్‌ విజయాన్ని ఖరారు చేసింది. కాగా, శనివారం మూడో స్థానం కోసం జరిగే పోరులో స్వీడన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *