ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ లను మార్చనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించాలంటే సిట్టింగ్‌ లలో అత్యధికులను మార్చక తప్పదా? అలా మార్చకుంటే కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కల నెరవేరదా? అంటే బీఆర్‌ఎస్‌ శ్రేణులే ఔనని అంటున్నాయి. ఇంటెలిజెన్స్‌ రిపోర్టులన్నీ సిట్టింగ్‌ లపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న నివేదికలే ఇచ్చాయని అంటున్నారు. కనీసంలో కనీసం 50 మంది సిట్టింగ్‌ లు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనీ ఇంటెలిజెన్స్‌ నివేదికలతో కేసీఆర్‌ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. కనీసం 50 నియోజకవర్గాలలో సిట్టింగులకు టికెట్‌ ఇస్తే విజయం కష్టమని నివేదికలు తేల్చేయడంతో కొత్త వారి కోసం అన్వేషణ మొదలైందని చెబుతున్నారు. సొంత పార్టీలో పోటీకి నేతలు కరవైన నియోజకవర్గాలలో ఇతర పార్టీల్లో బలమైన నేతలను బీఆర్‌ఎస్‌ లోకి ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారనీ అంటున్నారు. అమోఘమైన అభివృద్ధి, అనితర సాధ్యమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా తమ ప్రభుత్వం పట్ల ఇంత ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకోవడమేమిటని తెరాస నేతలు ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నారు. గత ఎన్నికలలో కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కేసీఆర్‌ కు ఇంటెలిజెన్స్‌ నివేదికలు షాక్‌ ఇచ్చాయని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 104. వీరిలో కనీసం 50 మంది తిరిగి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్నది ఇంటెలిజెన్స్‌ నివేదికల సారాంశం.దీంతో ఆయా నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థుల కోసం కేసీఆర్‌ అన్వేషణ ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడే ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చనున్నట్లు ప్రకటిస్తే మొదటికే మోసం వస్తుందన్న భయం బీఆర్‌ఎస్‌ అధినాయకత్వాన్ని వెంటాడుతోందని అంటున్నారు. ఆ కారణంగానే సిట్టింగులకే సీట్లు అని గతంలో చెప్పిన మాటను తప్పలేక, ఓటమి ఖాయమని నివేదికలు తేల్చేసిన సిట్టింగులను మళ్లీ పార్టీ అభ్యర్థులుగా నిలపేందుకు నిర్ణయం తీసుకోలేక సీఎం కేసీఆర్‌ సతమతమౌతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ నేపథ్యంలోనే సిట్టింగులను మార్చాల్సిన నియోజకవర్గాల ఇన్‌ చార్జ్‌ మంత్రులతో కేసీఆర్‌ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కాగా కొన్ని చోట్ల మంత్రులకే వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా నివేదికలు ఉండటంతో వారిని పక్కన పెట్టి కొత్త ఇన్‌ చార్జ్‌ లను నియమించాలన్న యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.కాగా టికెట్లు దక్కని సిట్టింగులను సముదాయించే పనిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రి హరీష్‌ రావులకు కేసీఆర్‌ అప్పగించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ మాత్రం ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో కంటే ఏడెనిమిది స్థానాలలో విజయం సాధించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *