తిరుమల నడక మార్గంలో ఆంక్షలు

తిరుమల, ఆగస్టు 16
శేషాచలంలోని చిరుతలు నడక మార్గం వైపు వస్తుండటంతో వెంకన్న భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నడక మార్గంల్లో చిరుతలు, క్రూర మృగాల కదలికలు భక్తుల్ని మరింత కలవర పెడుతుంది. దాంతో టీటీడీ అప్రమత్తమైంది. నడక మార్గంలో సెక్యూరిటీని పెంచడంతోపాటు పలు కీలక నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించింది. అటివీశాఖ నివేదిక ఆధారంగా నడకదారిలో సెక్యూరిటీకి ప్రియారిటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త ఆలోచనలను తెర విూదికి తెచ్చింది.అదివో అల్లదివో.. అంటూ తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ కొండెక్కుతున్న భక్తులకు ఇప్పుడు నడక మార్గంలో పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆపదమొక్కుల స్వామి శ్రీ వెంకటేశ్వరుడి మొక్కులు తీర్చుకునేందుకు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో కొండెక్కే భక్తులు భద్రతపరంగా టిటిడి తీసుకున్న నిర్ణయాలను ఇకపై తూచా తప్పక పాటించాల్సి ఉంది. చిరుతల వరుస దాడులు, క్రూర మృగాల సంచారంతో అప్రమత్తమైన టిటిడి భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అటివిశాఖ వైల్డ్‌ లైఫ్‌ అడిషనల్‌ పీసీసీఎఫ్‌ శాంతిప్రియా పాండే నేతృత్వంలోని ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం చర్చించింది. ఈ సిఫారసులను పరిశీలించిన టిటిడి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తుల భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదన్న నిర్ణయానికి వచ్చింది. ఖర్చు ఎంతైనా భరించేందుకు టీటీడీ సిద్దమైంది. భక్తుల సేఫ్టీకి ప్రియాలిటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించింది.ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలను నడక మార్గంలో అనుమతించాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల దాకా పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని పేర్కొంది. అలిపిరి నుంచి తిరుమల వరకు ఉన్న 7.6 కిలోవిూటర్ల నడక మార్గంలో 3550 మెట్లు ఉండగా వెంకన్న సన్నిధికి చేరుకునేందుకు భక్తుడికి 4 గంటలకు పైగానే సమయం పడుతుంది. శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల కొండకు చేరెందుకు 2.1 కిలోవిూటర్లు ఉండగా 2,388 మెట్లు ఎక్కాల్సి ఉంది. ఇప్పుడు ఈ రెండు మార్గాల్లో వెళ్లే భక్తులకు క్రూర మృగాల భయం హడలెత్తిస్తోంది. దీంతో ఎన్నో ఆలోచనలకు నిర్ణయాలకు తెర తీసిన టిటిడి సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తోంది.కాలిబాటన వెళ్లే ప్రతి ఒక్కరికీ ఊతకర్రను ఇవ్వాలన్న కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ప్రతి భక్తుడి చేతిలో ఉండే ఊతకర్ర ఎంతగానో ఉపయోగ పడుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఊత కర్రలను కూడా సిద్ధం చేస్తుంది. కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఘాట్‌ రోడ్డులో బైక్‌ లకు అనుమతించనున్న టిటిడి.. ఇప్పటికే ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తుంది. భక్తులు గుంపులు గుంపులుగానే నడక మార్గాల్లో వెళ్ళాలని కోరుతోంది. నడక మార్గంలో భక్తులు జంతువులకు తినుబండారాలు ఇవ్వడం నిషేదించిన టిటిడి.. అలాంటి అమ్మకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్‌ ఇస్తోంది. అలిపిరి నుంచి తిరుమల వరకు 500 కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న టిటిడి.. నడక మార్గంలో ఇరువైపుల ఫోకస్‌ లైట్స్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. నడక మార్గం ఇరువైపులా వ్యూ లైన్స్‌ ఏర్పాటుచేసి, పొదలు లేకుండా చేస్తుంది. పొదల్లో పొంచి ఉన్న చిరుతలు బయటికి వస్తే దూరం నుంచే కనిపించే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు రోప్‌ పార్టీలతో బందోబస్తు, చిరుతలు, క్రూర మృగాలు అటాక్‌ చేసే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వెటర్నరీ టీమ్స్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకయ్యే ఆర్థిక వనరులన్నీ టిటిడి సమకూర్చనుండగా నిర్వహణ బాధ్యత అటవీ శాఖ చేపట్టనుంది. ఇక నడకమార్గంలో ఫెన్సింగ్‌ పై కేంద్ర అధ్యయన కమిటీ సలహా మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెపుతున్న టిటిడి.. అలిపిరి, గాలి గోపురం, 7 వ మైలు ప్రాంతాల్లో ప్రమాదాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనుంది.
RRRRRRRRRRRRRRRRRRRRRRRR

Leave a comment

Your email address will not be published. Required fields are marked *