పడిపోతున్న కోడిగుడ్ల ధర? నష్టాల్లో యజమానులు

ఒకవైపు కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతున్నాయి.ఇంకోవైపు ఎండలు వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో పడుతున్నారు.. పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్ట్రీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు..ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న కోళ్ల రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా గిట్టు బాటుకాని విధంగా గుడ్డు ధర ఉండడంతో పరిశ్రమ నష్టాల బాట పట్టింది..మరో వైపు మండే ఎండలతో కోళ్లు మృత్యువాత పడటం జరుగుతుంది.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 500 కి పైగా కోళ్ల పరిశ్రమలు ఉండగా వీటిలో సుమారు 25 లక్షల వరకు కోళ్లను రైతులు పెంచుతున్నారు.ఇటీవల కాలంలో దాణా రేట్లు పెరగడం, గుడ్డు ధర మూడు రూపాయలకు చేరు కోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల దాణా టన్ను రూ.18 వేల నుంచి రూ.30 వేలకు చేరుకోవడం, అదేవిధంగా కోళ్ల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కొక్క కోడిగుడ్డు ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉష్టోగ్రతలు 42 డిగ్రీలు పైచిలుకుగా రోజు రోజుకు పెరగుతుండడంతో వేడిమి తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి..ఇంకోవైపు పెరిగిన విద్యుత్‌ చార్జీలు, కూలీలకు వేతనాలు, ఇతర ఖర్చులతో కలుపుకుని ఒక గుడ్డు ఉత్పత్తికి సుమారుగా రూ.4 ల వరకు ఖర్చవుతుంది.దీంతో ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.4.23 ఉన్నప్పటికీ రైతులకు మాత్రం రూ.2.95 లు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు గుడ్డుకు ధర లేక పోవడం ఎగుమతులు అంతంత మాత్రంగా ఉండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి కొత్త బ్యాచ్‌లను వేసేందుకు కూడా రైతులు వెనకాడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *