విశాఖ రాజధాని సాధ్యమేనా

అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహస్తున్న ఏపీ సీఎం జగన్‌ తీరు పట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. విపక్ష నేతగా సందర్భాల్లో అమరావతే రాజధాని అని విస్పష్టంగాప్రకటించారు. అంతే కాదు జగన్‌ ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో సాధించి తెస్తానన్నారు. పాతిక మంది వైసీపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకు వస్తానని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాకా ప్రత్యేక హోదానూ విస్మరించారు. అమరావతే రాజధాని అన్న విషయంలోనూ మడమ తిప్పేశారు. అమరావతి అభివృద్ధిని విస్మరించి మూడు రాజధానుల నాటకానికి తెరతీశారు. ఈ విషయంలో కోర్టులు అభ్యంతర పెట్టినా, అమరావతే రాజధాని అని ఏపీ హైకోర్టు విస్పష్టంగా చెప్పినా, హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించకపోయినా.. విశాఖ నుంచే పాలన సాగిస్తానంటూ ముఖ్యమంత్రి సహా ఆయన కేబినెట్‌ సహచరులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా జగన్‌ శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టున శంకుస్థాపన చేశారు. నౌపడా వద్ద పోర్టు నిర్వాసితులు కాలనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాఖ విషయంలో కీలక ప్రకటన చేశారు. అందరూ మెచ్చే నచ్చే నగరంకనుకే విశాఖను రాజధానిగా ఎంపిక చేసుకున్నామన్నారు. సెప్టెంబర్‌ నుంచి తాను విశాఖలోనే స్థిరపడతాను అక్కడ నుంచే పాలన కొనసాగిస్తానని విస్ఫష్టంగా చెప్పారు. వికేంద్రీకరణలో భాగమే ఇది అని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ గడువు డిసెంబర్‌ లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో సెప్టెంబర్‌ లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వస్తున్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా జగన్‌ విశాఖ నుంచే పాలన అన్న ప్రకటనకు ముడిపెడుతూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్‌ ముందస్తుకు వెళతారని, అది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే ఏపీ కి కూడా ఎన్నికలు జరిగేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు.అందులో భాగంగానే ఆయన సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన అన్న ప్రకటన చేశారంటున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటమి.. విశాఖ రాజధాని ప్రతిపాదనకు అక్కడి జనం వ్యతిరేకించారనడానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో విపక్షాలపై చేసిన విమర్శలు.. తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ముందస్తు సంకేతమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపురం పెడితే రాజధాని అవుతుందా
మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అనురాధ వ్యాఖ్యానించారు. ఏపీకి మూడు రాజధానులు అన్నారని, త్వరలో తాను విశాఖలో కాపురం పెడతానని చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
సీఎం జగన్‌ పై టీడీపీ కామెంట్స్‌…
శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ లో విశాఖ వచ్చి కాపురం ఉంటానని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కాపురం పెట్టాలని మొన్న తాడేపల్లి ప్యాలెస్‌ వచ్చిన సందర్భంగా పొలిటికల్‌ లాబీయిస్ట్‌ విజయ్‌ కుమార్‌ చెప్పారా అని ఆమె ప్రశ్నించారు. లేదంటే విశాఖ శారదా పీఠం స్వరూపానంద ముహూర్తం పెట్టారా అని అనురాధ ఎద్దేవా చేశారు. రాయలసీమలో కాపురం పెట్టి ఇడుపులడలపాయలో అసైన్డ్‌ భూములు కొట్టేశారని, అమరావతిలో కాపురం పెట్టి రాజధాని రైతులను రోడ్డున పడేశారని వ్యాఖ్యానించారు. అమరావతిని పూర్తిగా నాశనం చేసి, భూములిచ్చిన రైతులను క్షోభ పెట్టారని, విశాఖ వెళ్లక ముందే ఎంపీ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని అక్కడికి పంపి 40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసేశారని ఆరోపించారు. ఋషికొండను బోడిగుండు చేసేసి రేపు సెప్టెంబర్‌ లో అక్కడ కాపురానికి వెళతారా అని జగన్‌ ను నిలదీశారు.
మూడు చోట్ల కాపురం పెట్టటమా…
వికేంద్రీకరణ అంటే మూడుచోట్ల కాపురం పెట్టడమా అని ఎమ్మెల్సీ అనురాధ సీఎం జగన్‌ ను ప్రశ్నించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం, కబ్జాలు మినహా ఏం లేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్‌ తన నోటి వెంటే చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఒకవేళ జగన్‌ చెప్పకపోయినా ప్రజలే చెప్పిస్తారన్నారు.ఒక హత్య` లక్ష అబద్ధాలతో కాలం గడపడం మినహా ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి జగన్‌ రెడ్డి చేసిందేంటని అనురాధ ప్రశ్నించారు. వివేకా హత్య కేసు వెబ్‌ సిరీస్‌ ను తలపిస్తోందని, నెట్‌ ఫ్లెక్స్‌, జీ 5, ప్రైమ్‌ కూడా వీరి ముందు దిగదుడుపేనని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో జగన్‌ అండ్‌ కో నటన ఆస్కార్‌ ను మించిపోయిందన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌ వైపే చూపిస్తున్నాయని, ముందు గుండెపోటని, ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారని గుర్తు చేశారు. గొడ్డలి టీడీపీదని, బీటెక్‌ రవి, ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని ఆరోపించి, నారాసుర రక్తచరిత్ర పేరుతో పుస్తకాలు వేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బయటకు రావాలన్నారు. విపక్షంలో సీబీఐ విచారణ కావాలన్న జగన్‌ అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదనటంపై ప్రశ్నించారు. వివేకా హత్యలో ఆయన కూతురు సునీత హస్తం ఉందని, వివేకా రెండో భార్యే హత్య చేయించిందని, సునీల్‌ యాదవ్‌ తల్లికి, వివేకాకు సంబంధం ఉందని రకరాలుగా ప్రచారాలు చేయటం దారుణం అన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఎంపీ అవినాష్‌ రెడ్డి జమ్మలమడుగులో ఉన్నారని, వివేకానంద రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో ఆయన్ను పొగిడి, ఇప్పుడేమో ఆయన్ను దుమ్మెత్తిపోస్తున్నారని ఫైర్‌ అయ్యారు.ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ అసెంబ్లీలో నంగనాచి కబుర్లు చెప్పిన సీఎం జగన్‌ ఇప్పుడు ఎందుకు భయపడున్నారని అన్నారు. హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌ వైపే చూపిస్తున్నాయని, జగన్‌ రెడ్డి అనుమతి లేకుండా హత్య సాధ్యమా అని పేర్కొన్నారు. పిన్నమ్మ తాళి తెంచిన జగన్‌ రెడ్డి ఏపీ ప్రజలకు న్యాయం చేస్తారా… చెల్లి భర్త పై హత్యానేరం మోపిన జగన్‌ రెడ్డి ప్రజలకు రక్షణ కల్పిస్తారా అని ప్రశ్నించారు. కుటుంబసభ్యులనే దారుణంగా మోసం చేసిన జగన్‌ రెడ్డి పాలనలో సామాన్యుల పరిస్థితేంటన్నారు. హత్య చేయలేదని చెబుతున్న అవినాష్‌ రెడ్డి ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఎందుకు తుడిచినట్టో చెప్పాలన్నారు. సునీతకు న్యాయం జరుగుతుందని, కోర్టులు న్యాయం చేస్తాయని నమ్ముతున్నామని అనురాధ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *