సాగు నీటి కోసం రైతుల ఆందోళన

నల్గోండ, ఆగస్టు 17
రాష్ట్రంలో గోదావరి గలగల పాడుతుంటే కృష్ణమ్మ మాత్రం వెలవెలబోతోంది. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్‌లో జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది వానకాలం మొదలై రెండు నెలలైనా నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ కు పూర్తిస్థాయిలో కృష్ణమ్మ చేరలేదు. దీంతో నాగార్జున సాగర్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాగర్‌లో నీటి నిల్వలు అడుగంటు తుండడంతో ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సాగర్‌ ఆయకట్టు సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. తొమ్మిదేళ్ళ తర్వాత నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నీటి గండం ఏర్పడిరది.ఎగువ కృష్ణాపరివాక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా బేసిన్‌ లోని ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు మాత్రం జల కళను సంతరించుకున్నాయి. కానీ సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు(215.8070 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 863.40 అడుగులు (116.92టీఎంసీలు)గా మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటిమట్టం 808 అడుగులు ఉండగా, శ్రీశైలానికి ఎగువ వరద రావడంతో 55.4 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలానికి కూడా ఎగువ నుంచి వరద రాక తగ్గింది. శ్రీశైలం నుంచి వరద నీరు లేక నాగార్జున సాగర్‌ లో నీటి మట్టం క్రమంగా డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 518.10 అడుగులుగా (147.8335టీఎంసీలు) ఉంది.సాగర్‌ ప్రాజెక్ట్‌ కనిష్ఠ నీటిమట్టం 510 అడుగులు డెడ్‌ స్టోరేజ్‌ మట్టానికి 8అడుగుల దూరంలో ఉంది. వారం రోజులుగా శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తితో రోజూ 20వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేశారు. దీంతో ప 519. అడుగులకు చేరింది. గత ఏడాది ఇదే రోజున సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 3,83,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, సాగర్‌ నీటిమట్టం 586.60 అడుగులు (300 టీఎంసీలు)గా ఉంది. ఈ ఏడాది కంటే గతేడాది నాగార్జున సాగర్‌ నీటిమట్టం 67.50 అడుగుల (148.3325 టీఎంసీల) నీటి నిల్వ అధికంగా ఉంది.కృష్ణ పరివాహక ప్రాంతంలో సాధారణంగా జూలై నుంచి అక్టోబర్‌ వరకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ లో ప్రస్తుత నీటి నిల్వలను పరిశీలిస్తే వానాకాలం పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. కుడి, ఎడమ కాలువలు వానకాలం పంటకు 264 టీఎంసీల నీళ్లు అవసరం. అయితే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటే వంద టీఎంసీల నీరు సాగర్‌ రిజర్వాయర్‌ లోకి చేరాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు మూడో వారంలో వచ్చే వరదపైనే ఆయకట్టుకు నీటి విడుదల ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో తుఫాన్‌ ప్రభావంతో లేటైనా అక్టోబర్‌ లో నీటి విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ కింద తెలుగు రాష్ట్రాల్లో కుడి, ఎడమ కాలువలు కింద 22 లక్షల ఎకరాలు సాగవుతుంది. నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఐదేళ్లుగా వానాకాలం పంటలకు ఎక్కువ శాతం ఆగస్టు నెలలోనే సాగునీటిని విడుదల చేశారు. గత ఏడాది జూలై 28వ తేదీన కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. గత ఏడాది ఆగస్టు 11వ తేదీన 26 సాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఐదేళ్లుగా సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల ఇలా..
సంవత్సరం సాగర్‌ నీటి విడుదల తేదీ` నాటి నీటి మట్టం
2018`19 24`08`2018` 562 అడుగులు (238.47టీఎంసీలు)
2019`20 12`08`2019` 556 అడుగులు (223.19టీఎంసీలు)
2020`21 08`08`2020` 587 అడుగులు (305.62టీఎంసీలు)
2021`22 02`08`2021` 587 అడుగులు (305.62 టీఎంసీలు)
2022`23 29`07`2022` 552 అడుగులు (215.98 టీఎంసీలు)
నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ నీరు లేకపోవడంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది సాగర్‌కు నీటి జాడ లేకపోవడంతో ఆయకట్టు రైతులు దుక్కులు దున్ని, మెట్ట నార్లు పోసుకోని ఎదురు చూస్తున్నారు. సాగునీరు లేక ఆయకట్టు భూములన్నీ బీళ్ళుగా మారాయి. ఈ ఏడాది ఆగస్టు నెల మూడవ వారంవరకు సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల లేకపోతే వానాకాలం పంటలకు క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని విడుదల చేస్తారన్న నమ్మకంతో ముందస్తుగా వరి నారు పోసి, రెండెకరాలు దుక్కి దున్నడానికి, దమ్ము చేయడానికి పెట్టుబడులతో కలిపి ఇప్పటికే రూ.20వేల వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *