Ben + Brendan: బెన్‌ + బ్రెండన్‌

తాజా యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టు.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు మొదటి రోజే చేసిన స్కోరు 398. ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున చెలరేగిన ఈ జట్టు రోజు ముగియకముందే ఇన్నింగ్స్‌ను సైతం డిక్లేర్‌ చేసింది. అయితే ఈ మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా ఇంగ్లండ్‌ దూకుడు మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. గతేడాది నుంచి బెన్‌ స్టోక్స్‌ సేన సుదీర్ఘ ఫార్మాట్‌లో సరికొత్త ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఒకరకంగా టెస్టులకు దూరమవుతున్న అభిమానులను తిరిగి ఆకర్షించేలా ఇంగ్లండ్‌ ఆటతీరు ఉంటోందని వ్యాఖ్యానించే వారూ లేకపోలేదు. ఈనేపథ్యంలో సర్వత్రా వినిపిస్తున్న పేరు.. బజ్‌బాల్‌. ఈ వ్యూహం ప్రకారమే ప్రస్తుతం ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ల్లో దూసుకెళుతోంది. ఆసీస్‌తో తొలి టెస్టులో ఈ వ్యూహం బెడిసికొట్టినా.. తగ్గేదేలే అంటూ మరింత దూకుడుగా రెండో టెస్టుకు బరిలోకి దిగబోతోంది. అసలింతకీ ఏమిటి బజ్‌బాల్‌? అంటే ఓ ఏడాది వెనక్కి వెళ్లాల్సిందే..
మారిన వ్యూహం

2022లో ఇంగ్లండ్‌ జట్టు యాషెస్‌ సిరీస్‌ను 0–4తో, విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 0–1తో కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసింది. అలాగే కెప్టెన్‌గా ఉన్న జో రూట్‌ సైతం బాధ్యతల నుంచి వైదొలిగాడు. దీంతో అదే ఏడాది మేలో ఈ రెండు కీలక పదవులను ప్రపంచ క్రికెట్‌లో దూకుడుకు మారుపేరుగా నిలిచిన బ్రెండన్‌ మెకల్లమ్‌ (కోచ్‌), బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌)లతో పూరించింది. ఫలితంగా కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయగా.. రీషెడ్యూల్‌ ప్రకారం జరిగిన ఐదో టెస్టులో భారత్‌పై గెలిచి ఆ సిరీస్‌ను 2–2తో సమం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ స్టోక్స్‌ సేన ఛేజింగ్‌ చేసే గెలవడం విశేషం. కివీస్‌తో రెండో టెస్టునైతే 50 ఓవర్లలోనే 299 పరుగులతో ముగించింది. ఇక భారత్‌ నిర్దేశించిన 378 పరుగులను సైతం అవలీలగా ఛేదించింది. ఈ లక్ష్యాలన్నీ కూడా టాప్‌ బౌలర్లు బరిలో ఉండగానే అధిగమించింది.

మెకల్లమ్‌ ముద్దు పేరుతో..

బజ్‌బాల్‌ వ్యూహంతో స్వల్ప సమయంలోనే ఇంగ్లండ్‌ జట్టు ఆటతీరు ఎవరూ ఊహించని విధంగా మారిపోయింది. వాస్తవానికి బజ్‌ అనేది మెకల్లమ్‌ ముద్దుపేరు. న్యూజిలాండ్‌ ఆటగాడిగా తన విధ్వంసకర బ్యాటింగ్‌ను అభిమానులు అంత సులువుగా ఎవరూ మర్చిపోరు. తన తరహా శైలినే ఇంగ్లండ్‌ టెస్టు జట్టులోనూ ప్రవేశపెట్టడంతో అభిమానులు, మీడియా ఈ ఆటను బజ్‌బాల్‌గా పిలుచుకుంటున్నారు. మ్యాచ్‌లో తాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దూకుడే మంత్రంగా బ్యాట్లను ఝుళిపించడమే ఈ ప్లాన్‌ ప్రధాన ఉద్దేశం. ఒక రకంగా ఆటగాళ్లకు స్వేచ్ఛను కల్పిస్తూ చెలరేగి ఆడేలా చేయడం కూడా. రూట్‌ సైతం తన ఇన్నింగ్స్‌లో రివర్స్‌ ర్యాంప్‌ షాట్లు ఆడుతుండడం జట్టులో వచ్చిన మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. అలాగే వికెట్‌ కోసం ఫీల్డింగ్‌ సెటప్‌లోనూ, బౌలింగ్‌లో మార్పులను కూడా స్టోక్స్‌ సాహసోపేతంగా చేస్తూ వస్తున్నాడు. బజ్‌బాల్‌ ఆటతీరుకు పరాకాష్టగా గత డిసెంబరులో పాక్‌లో జరిగిన రావల్పిండి టెస్టును ఉదాహరణగా చెప్పవచ్చు. అందులో ఒక్క రోజే ఇంగ్లండ్‌ 506 పరుగులు చేయడంతో క్రికెట్‌ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అయితే అన్ని వేళలా ఇదే ఆటతీరుతో ముందుకెళ్లడం దెబ్బతీస్తుందని, సుదీర్ఘకాలం ఇలాంటి వ్యూహం పనిచేయదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

లార్డ్స్‌లో మరింతగా చెలరేగుతాం: బ్రెండన్‌

యాషెస్‌ తొలి టెస్టులో ఓటమితో బజ్‌బాల్‌ వ్యూహంపై విమర్శలు వినిపిస్తుండగా.. ఇంగ్లండ్‌ కోచ్‌ మెకల్లమ్‌ మాత్రం వెనక్కి తగ్గబోమంటున్నాడు. లార్డ్స్‌లో జరిగే రెండో టెస్టులో తమ నుంచి బజ్‌బాల్‌ 2.0 చూస్తారని స్పష్టం చేశాడు. ‘మా శైలిని మార్చుకోం. రెండో టెస్టులో మరింత దూకుడుగా ఆడతాం. ఆసీస్‌ వారి ఆటతీరుతో విజయం సాధించినందుకు సంతోషంగా ఉండొచ్చు. మున్ముందు కూడా వారు అలాగే ఆడతారేమో. మేం కూడా మా వ్యూహం ప్రకారమే ముందుకెళతాం’ అన్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *