ప్రార్థనా సమయంలో విద్యార్థుల ఆంగ్ల ప్రసంగం

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ప్రార్థనా సమయంలో విద్యార్థులు వంతుల వారీగా ఆంగ్లంలో క్లుప్తంగా ప్రసంగించాలని కార్పొరేషన్‌ విద్యాశాఖ అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ధీటుగా కార్పొరేషన్‌ పాఠశాలల్లో విద్యార్థులు అనర్గళంగా ఆంగ్గంలో మాట్లాడలేకపోతున్నారని గుర్తించిన కార్పొరేషన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మొత్తం 281 కార్పొరేషన్‌ పాఠశాలలున్నాయి. వీటిలో 70 మహోన్నత, 92 మాధ్యమిక, 119 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఇప్పటికే ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఆంగ్లంలో సరళంగా మాట్లాడించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ఆంగ్ల అధ్యాపకుడు తరగతిలో విద్యార్థులు రెండు నిమిషాలపాటు ఏదైనా అంశం గురించి మాట్లాడిస్తున్నారు. దీనికిగాను విద్యార్థులు ప్రతి రోజూ లైబ్రరీకి వెళ్ళి తమకు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకుని తరగతి గదిలో ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆంగ్లభాషపై ఆసక్తి ఏర్పడేలా రోజూ ఉదయం ప్రార్థనా సమావేశంలో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ విషయమై కార్పొరేషన్‌ విద్యా శాఖ సహాయకులు మునియన్‌ మాట్లాడుతూ… ప్రార్థన సమయంలో తిరుక్కురళ్‌ పఠనం, తాత్పర్యం చెప్పడం మినహా తక్కిన అంశాలను విద్యార్థులు ఆంగ్లంలో సంభాషిస్తారని తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధిస్తారన్నారు. కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ(Gagandeep Singh Bedi) ఆదేశానుసారం కార్పొరేషన్‌ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీపడే విధంగా తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *