కమలానికి వ్యతిరేకంగా కూటమి

రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీకి శాపంగా మారబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి వచ్చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకూ పాదయాత్ర చేసి తన ఇమేజ్‌ ని పెంచుకున్న రాహుల్‌ గాంధీ ఇప్పుడు మరో మెట్టు ఎక్కి జాతీయ స్థాయిలో తనదైన ముద్రను పదిలం చేసుకున్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్‌ చౌక్‌ దాకా ‘తిరంగా మార్చ్‌’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్‌, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్‌, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి.2019 ఎన్నికలలో అమేధీ నుంచి ఓటమి పాలైన రాహుల్‌ గాంధీ వాయనాడ్‌ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. అమేధీని కోల్పోవడంతో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రమైన వత్తిడికి లోనైంది. ఆ నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సోనియాగాంధీ తో బాటు రాహుల్‌ గాంధీ విశేషంగా కృషి చేశారు. అయితే సీనియర్‌ నాయకుల తిరుగుబాటు, ప్రధాని మోదీ విపరీతమైన ప్రజాకర్షణ ముందు రాహుల్‌ గాంధీ చేసిన ఏ చర్య కూడా సత్‌ ఫలితాన్ని ఇవ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి చందంగానే సాగుతున్నది.ఎన్నికల వ్యూహం లేకపోవడం, పార్టీ నాయకులను అదుపు చేసే యంత్రాంగం లేకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి కలిసిరాలేదు. అదే సమయంలో సోనియాగాంధీ అనారోగ్యం పాలుకావడంతో ఆమె, ఆమెతో బాటు రాహుల్‌ గాంధీ పార్టీని పూర్తిగా వదిలేయాల్సి వచ్చింది. దాంతో నాయకుడు లేని నావలా కాంగ్రెస్‌ పార్టీ తయారైంది. ఈ దశలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అశోక్‌ గెహ్లాట్‌ కు పార్టీ అప్పగించాలని సోనియాగాంధీ కుటుంబం నిర్ణయించుకుని ఆ దిశగా ఏర్పాట్లు చేసుకున్నా కూడా అశోక్‌ గెహ్లాట్‌ అత్యాశతో కథ అడ్డం తిరిగింది.వృద్ధుడైన మల్లికార్జున ఖార్గేని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా నియమించుకుని కాంగ్రెస్‌ పార్టీ కాలక్షేపం చేస్తున్నది. లోక్‌ సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకురావాలని సంకల్పించిన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఆరంభించారు. భారత్‌ జోడో యాత్ర ఆరంభించే నాటికి కనిష్ట స్థాయిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ యాత్ర ముగిసే నాటికి ప్రజల నుంచి ఆశించిన స్పందన సమకూర్చుకోగలిగింది.అక్కడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ పై చాలా చోట్ల సానుకూల స్పందనలు కూడా మొదలయ్యాయి. పార్టీ పూర్తి స్థాయిలో కోలోకుని, ఎన్నికలను ఎదుర్కునే స్థితిలోకి ఇంకా రాలేకపోయినా కూడా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా మారిందని చెప్పవచ్చు. ఈ స్థితిలో రాహుల్‌ గాంధీ పై కఠిన చర్యలు తీసుకుని బీజేపీ తప్పటడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ పై ఒక్క సారిగా సానుభూతి పెల్లుబుకింది.ఇంత కాలం కాంగ్రెస్‌ పార్టీని ‘‘పెద్దన్న’’ గా అంగీకరించని చాలా పార్టీలు రాహుల్‌ గాంధీకి సంఫీుభావం ప్రకటించాయి. దేశం మొత్తంలోని ఒకరిద్దరు బిజెపీయేతర ముఖ్యమంత్రులు తప్ప అందరూ రాహుల్‌ గాంధీపై లోక్‌ సభ లో తీసుకున్న చర్యను ఖండిరచారు. అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్‌, బీఆర్‌ఎస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, విూడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్‌ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి.నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడికి ఇది పరాకాష్టగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ మరింత పకడ్బందీగా తన వ్యూహాలను అమలు చేసి అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బీజేపీకి కష్టాలు తప్పవు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *