ప్రైమ్‌ ల్యాండ్స్‌ పేరిట కంపెనీ దగా..

టీమ్‌ వన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు చెందిన ప్రైమ్‌ ల్యాండ్‌ అనే కంపెనీ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరులో రిజర్వ్‌ అనే ప్రాజెక్టు పేరుతో 30 ఎకరాల్లో లే అవుట్‌ వేసింది. రోడ్లు వేసి, ప్లాట్లు చేసింది. సైట్‌ డిజైన్‌, డిజైన్‌ విజన్‌, మాస్టర్‌ ప్లాన్‌, ఇంటీరియర్‌ విజువలైజేషన్‌, ఆర్కిటెక్చరల్‌ మూడ్‌ బోర్డు, ల్యాండ్‌ స్కేప్‌ విజువలైజేషన్‌, ఎక్స్‌ క్లూజివ్‌ ఫీచర్స్‌ అన్నీ రూపొందించారు. 5, 10, 20 గుంటల ప్లాట్లు చేశారు. ఇందులో రెండెకరాలు నేచర్‌ రిసార్ట్‌ నిర్మిస్తామని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ రిసార్ట్‌ లో రూ.99 లక్షలకే ఫామ్‌ హౌజ్‌ అంటూ చెబుతున్నారు. క్లబ్‌ హౌజ్‌, రిసెప్షన్‌, వెయిటింగ్‌ ఏరియా, కాఫీ లాంజ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, స్పా, స్టీమ్‌ రూమ్స్‌, జిమ్‌, మెడిటేషన్‌ సెంటర్లు, ఇండోర్‌, ఔట్‌ డోర్‌ స్పోర్స్ట్‌, మినీ థియేటర్‌, ఓపెన్‌ థియేటర్‌, కమ్యూనిటీ హాల్‌, లాంజ్‌ పార్టీ స్పేస్‌ వంటివి అనేకం చూపించారు. 30, 40 ఫీట్ల రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. అన్నీ పేపర్ల విూద చూపిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోకుండా, కస్టమర్లకు గుంటల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తూ పట్టాదారు పాసు పుస్తకాలను ఇప్పిస్తున్నారు.ఈ ప్రాంతంలో రెవెన్యూ నిర్ణయించిన మార్కెట్‌ ధర ఎకరానికి రూ.12,37,500గా ధరణి పోర్టల్‌ చూపిస్తున్నది. కానీ కంపెనీ వాళ్లు మాత్రం రూ.40 లక్షలకు అమ్మేస్తున్నట్లు చూపిస్తున్నారు. వాస్తవానికి కంపెనీ గజానికి రూ. 15వేలవరకు ధర పెట్టింది. అంటే ఎకరానికి కస్టమర్‌ నుంచి వసూలుచేస్తున్న రూ.7 కోట్లకు స్టాంప్‌ డ్యూటీ లెక్క కట్టాలి. కానీ ఎటూ కాకుండా రూ.40 లక్షల వరకు మాత్రమే లెక్కిస్తున్నది. ఏ ప్రాతిపదికన స్టాంప్‌ డ్యూటీ కడుతున్నారో అర్థం కావడం లేదు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లే అవుట్‌ వేస్తే ఏ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారో, అంత కంటే ఎక్కువే ఇస్తామంటూ బ్రోచర్లలో ప్రచారం చేస్తున్నారు. అలాగే గజం ధర రూ.15 వేలకు పైగా పెట్టారు. మరి ఇంత ధర వెచ్చించినప్పుడు అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నించలేదో అర్థం కావడం లేదు. దాని పక్కనే డీటీసీపీ అప్రూవ్డ్‌ లే అవుట్లు ఉండడం గమనార్హం. ఈ కంపెనీ గూడూరులో సర్వే నం.193, 198, 199, 200, 201 ల్లోని 30 ఎకరాల్లో వెంచర్‌ వేసింది. కానీ వెంచర్‌ కాదంటూ సేల్‌ డీడ్స్‌ ధరణి పోర్టల్‌ ద్వారా నడిపిస్తున్నది. దీనికి రెవెన్యూ అధికారులు ఫుల్‌ సపోర్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నది.ఎక్కడైనా ప్లాట్‌, వ్యవసాయ స్థలం కొనుగోలు చేస్తే కనీసం ఒకటీ, రెండు వైపులా రోడ్డు ఉంటుంది. ఈ వెంచర్‌ లో ప్లాట్‌ కొనుగోలు చేస్తే ఆకాశం నుంచే వెళ్లాలి. ఎందుకంటే నలుదిక్కులా రోడ్డు అనేది డాక్యుమెంట్‌ లో ఉండదు. లే అవుట్‌ లో మాత్రం కనిపిస్తుంటుంది. సేల్‌ డీడ్‌ లో మాత్రం నలుదిక్కులా ఇతరుల భూమి అని పేర్కొంటున్నారు. ఏ ఒక్కరికి కూడా సేల్‌ డీడ్‌ లో దారి చూపించలేదు. లే అవుట్‌ లో ప్లాట్ల నంబర్లు ఉన్నాయి. కానీ దాని ప్రకారం రోడ్లు, సరిహద్దులు డాక్యుమెంట్లలో పేర్కొనలేదు. నలుదిక్కులా ఇతరుల భూమియే ఉన్నట్లు చూపించారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచి వాళ్లు ప్లాట్లకు చేరుకోవాలో కంపెనీ చెప్పడం లేదు. పైగా అవసరాలకు అమ్మాల్సి వస్తే దారితెన్నులు లేని సేల్‌ డీడ్‌ ద్వారా స్థలాన్ని ఎవరు కొనుగోలు చేయడానికి ముందుగా రారు. దాంతో తిరిగి కంపెనీకే అప్పగించాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రైమ్‌ ల్యాండ్స్‌ పేరిట కంపెనీ పేరు కనిపిస్తున్నది. సేల్‌ డీడ్స్‌ మాత్రం ఎలిగాంట్‌ ఆగ్రో ఫామ్స్‌ ద్వారా చేయిస్తుండడం గమనార్హం.
? 363 గజాల్లో 550 చ.అ.ల ఫామ్‌ హౌజ్‌ కి రూ.56.90 లక్షలు, అంటే మూడు గుంటల స్థలమన్న మాట. గజం ధర రూ.15 వేలు. దీన్ని బట్టి ఏ స్థాయి ధరలు పెట్టారో లెక్కలు వేసుకోవచ్చు. అంటే ఎకరం ధర రూ.7 కోట్ల వరకు నడిపిస్తుండడం గమనార్హం. దీంట్లో మూడు గుంటలు, ఐదు గుంటలు, 10 గంటలు, 20 గుంటల్లో ఫామ్‌ ప్లాట్లు చేశారు.
? ఎలిగాంట్‌ ఆగ్రో ఫామ్స్‌ నుంచి కొత్తూరుకు చెందిన ఒకాయనకు సర్వే నం.201అ1లో ఎకరం కొనుగోలు చేశారు. దీనికి గాను రూ.40 లక్షలుగా లెక్క చూపించారు.
? మరొకరు సర్వే నం.193ఆ లో 25 గుంటలు కొనుగోలు చేస్తే రూ.18,75,000లుగా చూపించారు.
? ఇంకొకరు సర్వే నం.200/ఆ లో 22 గుంటలు కొనుగోలు చేస్తే రూ.11 లక్షలుగా రిజిస్ట్రేషన్‌ విలువ చూపించారు.
ఆర్చ్‌, రెస్టారెంట్‌, డైనింగ్‌ ఏరియా, గెస్ట్‌ రూమ్స్‌, ఇండోర్‌ ప్లే ఏరియా, బంక్విట్‌ హాల్‌ వంటివి అనేకం నిర్మిస్తామని కంపెనీ ప్రచారం చేస్తున్నది. కానీ వాటికి మాత్రం అనుమతులు లేవు. మూడు బంక్విట్‌ హాళ్లు నిర్మిస్తామన్నారు. అందులో 1800 సిట్టింగ్‌ కెపాసిటీ ఉంటుంది. 16 ప్రైవేటు కాటేజీలు కూడా ఉంటాయి. వరల్డ్‌ క్లాస్‌ ఫీచర్స్‌ తో 40 వేల చ.అ.ల విస్తీర్ణంలో క్లబ్‌ రీసార్ట్‌ నిర్మిస్తామంటున్నారు. బడా కంపెనీ కూడా అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లను ఫామ్‌ ప్లాట్లుగా అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ నడుస్తున్నది. అటు రెవెన్యూ, ఇటు హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెరా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *