కాంటూరులో మారుతున్న లెక్కలు

అధికారులు రూపొందించిన గణాంకాల ప్రకారం పోలవరం ప్రాజెక్టులో 41.15 విూటర్లకు నీటిని నిలువ చేస్తే 54 గ్రామాలు ముంపునకు గురికావాలి. కానీ, తాజా గోదావరి వరదల్లో జరిగింది వేరు. విఆర్‌.పురం, కూనవరం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అనేక గ్రామాలు నీటమునిగాయి. ఇది దాదాపుగా 45.72 విూటర్ల నీటి నిలువతో సమానం ! అధికారుల లెక్కలకు ఏ మాత్రం పొంతన లేని ఈ పరిస్థితే పోలవరం ముంపు గ్రామాల్లో భయానక పరిస్థితిని సృష్టిస్తోంది. వరద తగ్గిన్నా అన్ని గ్రామాల్లో ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా రెండు సార్లు వచ్చిన వచ్చిన వరదతో అధికారులు రూపొందించిన కాంటూరు లెక్కలు తప్పుల తడికని తేలింది. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా ఈ లెక్కలు రూపొందించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముంపు లెక్కలు మరోసారి తీయాలన్న డిమాండ్‌ స్థానికంగా వినిపిస్తోంది. స్థానికులకు వరద తీవ్రత పై సాధారణంగా అంచనా ఉంటుంది. భద్రాచలం వద్ద వరద తీవ్రతను బట్టి ఇక్కడి గ్రామాల ప్రజలు అంచనాకు వస్తారు. దానికనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటారు. అయితే, కాఫర్‌ డ్యాం నిర్మాణంతో ఈ పరిస్థితి మారింది. బ్యాక్‌ వాటర్‌పై అంచనా లేకపోవడంతో స్థానికులు ముంపు తీవ్రతపై అంచనాకు రాలేకపోతున్నారు. అధికారులు రూపొందించిన ముంపు లెక్కలే ప్రస్తుతానికి ఆధారంగా మారాయి. 45.72 విూటర్ల మేర ప్రాజెక్టులో నీటిని నిలువ చేస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో 57 గ్రామాలు, ఉమ్మడి తూర్పుగోదావరిలో 165 గ్రామాలు కలిపి మొత్తం 222 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు. దీని ఆధారంగానే తొలి విడత వరదలో చివరిక్షణం వరకు ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు. అదే సమయంలో 41.15 విూటర్ల ఎత్తుకు చేరిన వరద నీరే ఈ గ్రామాలన్నింటిని ముంచివేసింది. వేలాది కుటుంబాలకు ఆస్తినష్టాన్ని మిగిల్చింది. దీంతో పూర్తిస్థాయిలో నీటిని నిలువ ఉంచితే పరిస్థితి ఏమిటని ఈ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుండిగానీ, అధికారయంత్రాంగం నుండి గానీ జవాబు రావడం లేదు. 1986లో వచ్చిన వరదలకు భద్రాచలంలో 74 అడుగుల నీటిమట్టం నమోదైందని, తాజా వరదలకు 71 అడుగుల వరకే వరద చేరిందని, అయినా అప్పట్లో ముంపునకు గురి కాని జనావాసాలు సైతం తాజా వరదలకు మునిగిపోయాయాని స్థానికులు చెబుతున్నారు. వరద నుండి స్థానికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలు సైతం ముంపునకు గురయ్యాయి అధికారుల గణాంకాల ప్రకారం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 194 టిఎంసిలు. మొదటి దశ 41.15 విూటర్లు పూర్తయితే 120 టిఎంసిల నీటి నిల్వకు అవకాశముంటుంది. గత జులై 11న పోలవరం అప్పర్‌ స్పిల్‌ వే వద్ద 38.12 విూటర్లు, ఈ నెల 11న 36.02 విూటర్ల చొప్పున గరిష్టంగా వరద నమోదైంది.ప్రస్తుత వైసిపి ప్రభుత్వంతోపాటు గత టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చూపించిన శ్రద్ధ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించడంలో చూపలేదు. ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న పోలవరం, దేవీపట్నం మండలాల ప్రజలను బలవంతంగా తరలించి అడ్డుతొలగించుకున్నాయి. పొమ్మనకుండా పొగపెట్టిన చందంగా కాఫర్‌ డ్యాం పూర్తి చేయడంతో వరదల నేపథ్యంలో ఎనిమిది మండలాలు ముంపునకు గురవుతున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాల్సిన బిజెపి ప్రభుత్వం… నిర్మాణం మాత్రమే తమ బాధ్యత అంటూ పునరావాస కల్పన తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. దీన్ని ప్రశ్నించాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీలు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 41.15 విూటర్ల కాంటూరు పరిధిలో 21 వేల కుటుంబాలకు 3,473 కోట్ల రూపాయల మేర సాయం అందించేందుకు చేసిన ప్రకటన ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *