ఆర్‌ ఫైవ్‌ జోన్‌లో లేఅవుట్లు రెడీ..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్‌ 5 జోన్‌ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన 50 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ఇవ్వనుంది. అమరావతి పరిధిలోని పలు గ్రామాల పరిధిలో సుమారు 1402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని లే అవుట్‌ లలో అభివృద్ధి ప్రక్రియ పూర్తి అయ్యింది. సరిహద్దు రాళ్లు వేయటమే కాకుండా వాటి పై నెంబరింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఆ యా లే అవుట్ల దగ్గర లే అవుట్‌ మ్యాప్‌ లను కూడా ప్రదర్శనకు పెట్టారు.మరోవైపు వెంకటపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 50 వేల మంది లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా లే అవుట్‌ లలోనే సభ ఏర్పాటు చేయాలని భావించినా?గ్రామాల రహదారులు ఇరుకుగా ఉండటంతో సీడ్‌ యాక్సిస్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సభకు ఎంపిక చేశారు. ఆ పక్కన వాహనాల పార్కింగ్‌ కోసం స్థలాన్ని ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల విూదుగా లాంఛనంగా పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత లబ్దిదారులకు షెడ్యూల్‌ తేదీలు ఖరారు చేసి వాటి ప్రకారం పట్టాలు అందజేస్తారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. మొత్తం లే అవుట్‌ స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాంటింగ్‌ చేశారు. మిగిలిన భూమిలో అంతర్గత రోడ్ల కోసం ఎక్కువ స్థలం కేటాయించారు. అప్రోచ్‌, అంతర్గత రోడ్లకు 36 శాతం భూమిని కేటాయించారు. మొత్తం ల్యాండ్లో 10 శాతం ఓపెన్‌ స్పేస్‌ గానూ, మిగిలిన భూమిని పార్కింగ్‌, యుటిలిటీ కోసం కేటాయించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల తయారీ కసరత్తు కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఆన్‌ లైన్‌ చేయటం, లబ్దిదారుల మ్యాపింగ్‌ కూడా కంప్లీట్‌ అయ్యింది. ఎల్లుండి పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా చేపట్టనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *