ఎస్వీ యూనివర్శిటీలో క్షుద్ర పూజలు `

తిరుపతి, జూన్‌ 29
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపుతోంది. విరూపాక్ష సినిమా తరహాలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత రెండు రోజుల క్రితం ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ భవనానికి కొంత దూరంలో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో క్షుద్ర పూజలు జరిగాయి. ఈ పూజలకు ముగ్గు, బొగ్గు పొడి, ఉప్పుతో పుర్రె గుర్తుతో ముగ్గులు వేసి కోడి గుడ్లు, రక్తంతో పూజలు చేశారు. గత కొద్ది రోజులుగా యూనివర్శిటీ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి నెలకొనడంతో యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్ధినీ, విద్యార్ధులు భయాందోళనకు గురవుతున్నారు. అంతే కాకుండా రాత్రి సమయాల్లో యూనివర్శిటీ ప్రాంతాల్లో మద్యం సేవించి, వ్యర్ధాలను చెల్లాచెదురుగా పడేసి వెళ్తున్నారు. ఎందరో మేధావుల విద్యను అభ్యసించిన ఎస్వీ యూనివర్శిటీలో.. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది పేద విద్యార్ధులు ఇక్కడకు వచ్చి విద్యను అభ్యసిస్తుంటారు. హాస్టల్లలో ఉంటూనే చదువుకుంటారు. ఎక్కువ మంది విద్యార్ధులు పగలు చెట్ల క్రింద చదువుకుంటూ ఉంటే, మరికొందరు లైబ్రరీకి వెళ్తుంటారు. ఇలా తరచూ లైబ్రరీకి, మైయిన్‌ బిల్డింగ్‌, క్యాంటీన్‌ వద్దకు విద్యార్ధులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్శిటీ ప్రాంగణంలోకి ప్రవేశించి రాత్రి సమయాల్లో క్షుద్ర పూజలకు, అసాంఫీుక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో అధ్యాపకులు, విద్యార్దులు భయాందోళనకు గురి అవుతున్నారు. దీనిపై ఎస్వీ యూనివర్శిటీ విద్యార్ధుల సంఘం నాయకులు స్పందిస్తూ.. క్షుద్రపూజలు ఎవరూ చెస్తున్నారో, ఎందుకు యూనివర్శిటీనే ఎంచుకున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. నిత్యం విద్యార్ధులు రాకపోకలు సాగించే నాలుగు రోడ్ల కూడలి వద్దనే క్షుద్ర పూజలు చేస్తున్నారని, ముఖ్యంగా యూనివర్శిటీ ఆవరణంలో సీసీ కెమెరాలు లేకపోవడంతోనే గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని అన్నారు. అసాంఫీుక కార్యకలాపాలు అడ్డాగా యూనివర్సిటీని మార్చుకుంటూ.. మద్యం సేవించడం వంటివి చేస్తున్నారని తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బింది ఎక్కువగా లేకపోవడం వంటి కారణాల వల్లే తరచూ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఎస్వీ యూనివర్శిటీ ఉన్నతాధికారుల దృష్టికి క్షుద్ర పూజల వ్యవహారాన్ని విద్యార్థులు తీసుకు వెళ్లారని చెప్పారు. కానీ ఇంకా ఉన్నతాధికారులు స్పందించలేదని.. వెంటనే స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎస్వీ యూనివర్శిటీ ఉన్నతాధికారులు పట్టించుకోక పోతే విద్యార్ధులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *