నకిలీలెవరు? హక్కుదారులెవరు?

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం తట్టిఅన్నారంలో రూ.800 కోట్ల విలువైన 70 ఎకరాల భూదందా. అందులో అసలెవరు? నకిలీలెవరు? హక్కుదారులెవరు? పత్రాలు సృష్టించిందెవరు? ఇప్పుడీ ప్రశ్నలు అధికార వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కింది స్థాయి అధికారులు ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని నివేదిక సమర్పించినా.. లావాదేవీలకు ఆమోదముద్ర వేశారు. దీని వెనుక ఏ శక్తులు పని చేశాయన్న చర్చ నడుస్తున్నది.రెవెన్యూ శాఖ నుంచి ఆర్డీవో స్థాయి అధికారి నేతృత్వంలో స్పెషల్‌ టీం రంగంలోకి దిగింది. అలాగే ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా జిల్లాలోనే అతిపెద్ద భూదందా గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టింది. ఇప్పటికే కొందరు ప్లాట్ల యజమానులను కలిసింది. వారి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాదాపు అన్ని ఆధారాలతో దందాను వెలుగులోకి తీసుకురావడంతో ప్లాట్ల యజమానులు, ఇతర హక్కుదారులంతా అప్రమత్తమయ్యారు. ఎలాగైనా చట్టపరంగా హక్కులు సంపాదించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై భిన్న కోణాల్లో ఎంక్వయిరీ నడుస్తుండడంతో అటు కొందరు అధికారులకు, ఇటు బోగస్‌ డాక్యుమెంట్ల సృష్టికర్తలకు ముచ్చెమటలు పడుతున్నాయి. దాంతో మరింత ఉధృతం కాకుండా ముందుగానే చల్లార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రి కూడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి ఫోన్‌ చేసినట్లు తెలిసింది. మనోళ్లే కొనుగోలు చేశారని, కోర్టు డిక్రీ ఉందని, దాని ఆధారంగా భూమి కొనుగోలు చేసినట్లు వివరించారు. ఐతే ప్లాట్ల యజమానుల సంగతి ఏందని ఎంపీ ప్రశ్నించినట్లు సమాచారం. తట్టిఅన్నారం భూదందాలో అసలైన హక్కుదారులెవరో అంతుచిక్కడం లేదు. నాలుగు వర్గాలు తామే నిజమైన హక్కుదారులంటున్నాయి. కానీ ఖాస్రా పహాణీ ప్రకారమే పట్టాదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులు లే అవుట్లు చేశారు. అక్కడి నుంచే 840 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కోర్టు డిక్రీ ఉందంటూ ఇంకొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఇష్యూలో ఎవరు అక్రమార్కులు? ఎవరికి హక్కులు కల్పిస్తారు? ప్లాట్ల యజమానులకు న్యాయం ఎలా చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ గందరగోళాన్ని సృష్టించిన వ్యక్తులకు ఎలాంటి శిక్ష వేస్తారో వేచి చూడాలి. హక్కులు సాధించుకునే వరకు తాము ఎంత వరకైనా న్యాయపోరాటం చేస్తామని ప్లాట్ల యజమానులు తెగేసి చెబుతున్నారు. తాము పైసా పైసా కూడబెట్టుకొని 40 ఏండ్ల క్రితమే కొనుగోలు చేశామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *