యువగళానికి భారీ ఎత్తున స్పందన

యువగళం పాదయాత్ర నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయా లేదా అన్నది గమనించాల్సిన బాధ్యత, ఆ యాత్ర ప్రభావం ప్రజల విూద ఎంత ఉంది? తదితర అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత రాజకీయ సామాజిక అధ్యాయనసంస్థగా మాపై బాధ్యత ఉంది. అందులో భాగంగానే యువగళం పాదయాత్ర జరిగిన ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అంశాలను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఈ విశ్లేషణ.పాదయాత్ర ఒక లక్ష్యం కోసం సాగుతుంది. ఆ లక్ష్యంలో భాగంగా మొదటిది యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్టివేట్‌ అవుతున్నారు. రెండోది తనను తాను ఒక సమర్థవంత నాయకుడిగా నిరూపించుకున్నారు. మూడోది తన చుట్టూ ఉండే నాయకుల మాటల తాలూకు ‘ఎకో చాంబర్‌’ ని దాటుకొని, క్షేత్ర స్థాయి రియాలిటీకి దగ్గరగా వస్తున్నారు. అంటే, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ పాదయాత్ర ద్వారా కూడగడుతున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ఈ మూడు లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధించారు. ఈ మూడు లక్ష్యాలు నారా లోకేశ్‌ని నాయకుడిగా మరో మెట్టు ఎక్కించే సోపానాలే.ఈ లక్ష్యాలు సాధించడానికి లోకేశ్‌ ఒక కొత్త రాజకీయ వ్యుహాన్ని ఎంచుకున్నారు. అదే ‘‘కాన్‌ఫ్లిక్ట్‌, కన్‌ఫ్రంటేషన్‌’’ పద్ధతి. అంటే, ముందుగా స్థానిక వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తూ ఆయన తిరుగుతున్న నియోజవర్గంలో సంఘర్షణ సృష్టిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణుల ఆత్మవిశ్వాసం విూద దెబ్బకొడుతున్నారు. దీనితో అధికార వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు ఆత్మరక్షణలో పడుతున్నారు. దీంతోపాటు అప్పటి వరకు స్థానికంగా ఉన్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల బండారం బట్టబయలు అవ్వడంతో ఈ అంశం ప్రజల్లో చర్చకు దారితీసి వైఎస్‌ఆర్‌సిపి ప్రతిష్ట ప్రజల్లో కోల్కోలేని విధంగా దెబ్బతింటోంది. నారాలోకేష్‌ చేపట్టిన ఈ వ్యూహం వల్ల అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేసులు పెడతారని భయపడిన జనం, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధైర్యంగా అడుగు బయటపెడుతున్నారు. ఫలితంగా కేవలం పాదయాత్ర చేస్తున్న జిల్లాల్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై సవాల్‌ విసురుతున్నారు.జనవరి 27 వ తేదీన చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో ‘‘యువగళం’’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలో అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొన్న లోకేశ్‌, తన పాదయాత్రను విజయవంతంగా రెండో దశలోకి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 5 నియోజకవర్గాల్లో పాదయాత్రకు తగినంత స్పందన రాలేదు. పెద్ద ఎత్తున ప్రజలూ, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనలేదు. పైగా అక్కడ ప్రజల మాటలను బట్టి చూస్తే, ఒక రకంగా ఈ 5 నియోజకవర్గాల్లో యువగళం విఫలమైందనే చెప్పొచ్చు. కాగా, ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయమే, యువగళానికి పెద్ద మలుపు! ఆ విజయం టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరగడానికి కారణమైంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తర్వాత అనంతపురం జిల్లాకు చేరిన పాదయాత్ర ప్రభావం రెట్టింపయింది. టీడీపీ కార్యకర్తలు చురుకుగా యువగళం పాదయాత్రలో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు.‘‘కాన్‌ఫ్లిక్ట్‌, కన్‌ఫ్రంటేషన్‌’’ పద్ధతిలో భాగంగానే ఎమ్మెల్యేలపై విమర్శల విల్లులు ఎక్కుపెడుతున్నారు నారా లోకేశ్‌. పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో ముందుగానే వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేల అవినీతి చిట్టా, వారిదందాలు పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి, చేస్తున్న అన్యాయాలు, కబ్జాలు, దందాలపై బహిరంగసభల్లో వారిచిట్టాను బయటపెడుతూ అధికార వైఎస్‌ఆర్‌సిపి నేతలను చికాకు పరుస్తున్నారు. ఈ అంశాలతో అధికార వైఎస్‌ఆర్‌సిపి నేతలు వాటికి జవాబు చెప్పుకోవడానికే సమయం సరిపోతుంది.చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిపై మాట్లాడాలంటేనే బయపడే నాయకులు ఉన్న ఆ జిల్లాలో వాటిని బేఖాతర్‌ చేస్తూ ఆయనపైనే విమర్శలు ఎక్కుపెట్టి ‘‘కాన్‌ఫ్లిక్ట్‌, కన్‌ఫ్రంటేషన్‌’’ కు తెరలేపారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డిని ‘‘పాపాల పెద్దిరెడ్డి’’ అని అభివర్ణించడంతో ఈ వ్యూహం మొదలైంది. ఆ తర్వాత ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేస్తున్నారన్నారు. ఆ తర్వాత 180 ఎకరాల ఇటినా భూములు బెంజ్‌ మంత్రి కాజేశారంటూ మంత్రి గుమ్మనూరు జయరాంపై కూడా పదునైన విమర్శలు చేశారు. ఇలా ప్రతి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తుంటే, ఆత్మరక్షణలో పడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు కనీసం తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు. ఇది తెలుగుదేశం కార్యకర్తల్లో ధైర్యం పెరగడానికి కారణమైంది. అందుకే, ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు సైతం ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. అయితే, ప్రజల్లో సౌమ్యులుగా పేరున్న అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి లాంటి నాయకులపై లోకేశ్‌ అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ, లేదంటే పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అనంతపురానికి చెందిన ఒక సీనియర్‌ తెలుగుదేశం నాయకుడు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.లోకేశ్‌ అనుసరిస్తున్న ‘‘కాన్‌ఫ్లిక్ట్‌, కన్‌ఫ్రంటేషన్‌’’ వ్యూహం కొత్తదేం కాదు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టిపి నాయకురాలు షర్మిలా కూడా తన పాదయాత్రలో స్థానిక నాయకులను విమర్శించడం మొదలుపెట్టారు. కానీ, అది పెద్ద దుమారాన్ని సృష్టించింది. అందుకు కారణం షర్మిలాకు తెలంగాణలో క్యాడర్‌ లేకపోవడమే! ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి బలమైన క్యాడర్‌ ప్రతీగ్రామంలో ఉండటం వల్ల లోకేశ్‌ వ్యుహం ఫలిస్తోంది. క్యాడర్‌ని యాక్టివేట్‌ చేస్తోంది. ఇది ఆయన సాధించిన విజయమే అయినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యేలను తిట్టడం ఒకరోజుకు పరిమితం చేస్తే చాలని, ఆ పై నియోజకవర్గంలో తిరిగినన్నీ రోజులు స్థానిక సమస్యల్ని ఎత్తి చూపాలని, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టమైన ప్రణాళికలను ప్రకటిస్తే మేలని విద్యావంతులైన యువత అభిప్రాయపడుతోంది.అధికార వైఎస్‌ఆర్‌సిపి పై విపరీతమైన వ్యతిరేకత ఉన్నా… దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ నాయకులు క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. కార్యకర్తలు యాక్టివేట్‌ అయినంతగా, ఎమ్మెల్యే స్థాయి నాయకులు యాక్టివేట్‌ అవడం లేదు. క్షేత్రస్థాయిలో టిడిపి స్థానిక నాయకుల ఉనికే కనిపించకపోవడం దీనికి నిదర్శనం. క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు తిరిగేలా చేయడానికి వ్యూహం రచించాలని టిడిపికి చెందిన సామాన్యకార్యకర్తలు భావిస్తున్నారు. పాదయాత్ర తర్వాత యాత్ర శిబిరంలో స్థానిక నాయకులతో మాట్లాడుతూ వారితో ఆయన సాన్నిహిత్యం ఏర్పర్చుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అక్కడే వాళ్లతో మాట్లాడుతూ నిజంగా క్షేత్ర స్థాయిలో చురుకుగా తిరుగుతున్నది ఎవరు? నాయకుల చుట్టూ తిరుగుతున్నది ఎవరు? అంటూ చురకలు కూడా వేస్తున్నారు. పాదయాత్ర వల్ల ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన నాయకులు అనే అవగాహన ఆయన తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో కోట్ల, జేసీ లాంటి పేర్లున్న రాజకీయ కుటుంబాలను కూడా లోకేశ్‌ మెప్పించగలిగారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నాయకులు జేసీ ప్రభాకర్‌ రెడ్డి లాంటివాళ్లే యువగళం పాదయాత్రను చూసి భావోద్వేగానికి గురయ్యారంటే, పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.లోకేశ్‌ ఎక్కడా ఫలానా నియోజకవర్గం నుంచి ఈ సారి ఈ అభ్యర్థి పోటీ చేస్తాడని నోటి మాటగా చెప్పకపోయినా, ఆయనే అభ్యర్థులను కేటాయిస్తున్నట్టుగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ప్రజల్లోకి సందేశం వెళ్తోంది. ధర్మవరంలో టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్‌ని ప్రకటించారని ధర్మవరంలో, తెలుగుదేశం నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనపడ్డాయి. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడిని కాదనీ, ఈ పని నారా లోకేశ్‌ చేస్తే తప్పని కొంతమంది తెలుగుదేశం సీనియర్‌ నాయకులు ఈ చర్యలను తప్పుపడుతున్నారు. ఈ చర్యలు తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది, కాబట్టి… ఆయన ఈ విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలని లేదంటే యువగళం పాదయాత్ర కాస్త, పార్టీ టికెట్స్‌ కేటాయింపులు ప్రాధన్యతగా సాగుతున్నట్లు ప్రతికూల సంకేతాలు ప్రజలకు, నేతలకు వెళ్తాయని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు భావిస్తున్నారు.గార్లెదిన్నె మండలం జంబులదిన్నెలో నిర్వహించిన ‘రైతన్నతో లోకేశ్‌’ కార్యక్రమం అంతా కృత్రిమంగా జరిగింది. అక్కడ మంచాలు, ఇతర సెట్టింగ్స్‌ చూస్తే అదొక మార్కెటింగ్‌ ఈవెంట్‌ లాగా అనిపించింది తప్పా, సహజంగా రైతుల కోసం చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి విషయాల్లో టిడిపికి సహకరిస్తున్న స్ట్రాటజి సంస్థ జోక్యం చేసుకోకపోతేనే కార్యక్రమం సహజంగా సాగుతుందని రాయదుర్గం నుంచి వచ్చిన ఒక సీనియర్‌ తెలుగుదేశం నాయకుడు అభిప్రాయపడ్డారు. స్ట్రాటజి సంస్థ ప్రతీ అంశంలో తలదూరుస్తున్నారని, తాము ఈ స్ట్రాటజి సంస్థ ప్రతినిధులతో ఇబ్బందులు పడుతున్నామని సీనియర్‌ మంత్రులుగా పనిచేసినవారు, మూడునాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారంటే, స్ట్రాటజి సంస్థ కారణంగా నాయకులు ఎంత ఉక్కపోతకు గురవుతున్నారో స్పష్టమౌతోంది.‘రైతన్నతో లోకేశ్‌’ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసిన ప్రొఫెసర్‌ ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. ఆయన అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా లేకపోగా, ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ‘విూరు రైతులాగా కష్టపడతారా? విూ కొడుకు దేవాన్ష్‌ రైతు అవుతానంటే ఏం సలహా ఇస్తారు?’ అని తికమకపెట్టారు. ఈ కార్యక్రమంలో కొంతమంది రైతులకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు. అయితే ఏ రైతు ఏ ప్రశ్న అడగాలో ముందే స్క్రిప్టు నిర్ణయించారు. గుత్తి మండలం కేతిపల్లికి చెందిన ఒక రైతుతో మాట్లాడుతున్నప్పుడు తనకు ఒక ప్రశ్న ఇచ్చి, ఆ ప్రశ్న అడగడానికి తనను ఎంపిక చేశారని చెప్పారు. సహజంగా రైతులతో, రైతే యాంకరింగ్‌ చేస్తూ నిర్వహించాల్సిన ‘రైతన్నతో లోకేశ్‌’ కార్యక్రమాన్ని ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ వాళ్లు, స్క్రిప్ట్‌ ప్రకారం నిర్వహించినట్టు కొట్టొచ్చినట్టు కనపడిరది. ఏదైనా అడుగుదామని వచ్చిన రైతులకు నిరాశే ఎదురైంది.లోకేశ్‌ ప్రసంగాల్లో చాలావరకు మార్పు వచ్చింది. మునపటితో పోలిస్తే ఆయన ప్రసంగాల్లో పరిపక్వత కనిపిస్తోంది. తన ప్రసంగాల్లో చాలాసార్లు ‘బాబుగారే సీఎం’ అని గుర్తు చేయడం వల్ల లోకేశ్‌ని మెచ్చుకునేవాళ్ల సంఖ్యతో పాటు ఆయన విశ్వసనీయత కూడా పెరుగుతోంది. రాష్ట్రముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నప్పుడు కూడా ప్రతిసారి ‘‘రెడ్డి’’ అనడం వల్ల ‘‘రెడ్డి సామాజిక వర్గం’’ మానసికంగా దూరమయ్యే ప్రమాదాన్ని ఆయన పసిగట్టినట్టున్నారు. అందుకే, తన ప్రసంగాల్లో అంతకుముందులాగా ‘‘జగన్‌ రెడ్డి’’ అనకుండా, ‘జగన్‌ మోహన్‌, దొంగ మోహన్‌’ అంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముస్లింలలో ఆకట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.ప్రసంగాలలో ప్రస్తావిస్తున్న అంశాలు మెరుగ్గా ఉంటున్నప్పటికీ, భాష విషయంలో ఇంకా తప్పులు దొర్లుతున్నాయి. అదీగాక, ఎవరో రాసిచ్చింది బట్టిపట్టి వచ్చి మాట్లాడినట్టుగా ఆయన ప్రసంగాల్లో గ్రాంథిక పదాలు దొర్లుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ సభల్లో వింటున్న వాళ్లకు ఆయన మాటలు సొంపుగా అనిపించడం లేదు. కానీ, ప్రయివేట్‌గా మాట్లాడేటప్పుడు లోకేశ్‌ చాలా బాగా మాట్లాడతారని, తమతో మాట్లాడిన భాషనే సభల్లోనూ మాట్లాడితే ప్రజలను తన మాటలతో అద్భుతంగా ఆకట్టుకోగలరని తెలుగుదేశం నాయకులు నమ్మకంగా చెప్తున్నారు. అలాగే, స్థానిక చరిత్ర తెలుసుకొని, తన ప్రసంగాల్లో చరిత్రను ప్రస్తావిస్తే ఇంకా ఎక్కువగా ప్రజలకు కనెక్ట్‌ అవ్వొచ్చనే కర్నూల్‌కి చెందిన పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్‌ అభిప్రాయపడ్డారు.యువగళంలో కేవలం యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్స్‌ని అంతగా పట్టించుకోవడం లేదని కొంతమంది సీనియర్‌ టిడిపి నాయకులు వాపోతున్నారు. లోకేశ్‌ పక్కన పెద్ద నాయకులే తప్ప స్థానిక నాయకులకు, సీనియర్‌ నాయకులకు నడిచే అవకాశం ఇవ్వడం లేదని బాహాటంగానే తమ గోడను వెళ్లబోసుకుంటున్నారు. అలాగే పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కువగా ‘‘సైకో పోవాలి, సైకిల్‌ రావాలి’’ పాట వేస్తున్నారు. ఈ పాటతో పాటు నాడు ఎన్టీఆర్‌ చైతన్య రథం వస్తుంటే, ఉర్రూతలూగించిన ‘చేయేత్తి జై కొట్టు తెలుగోడా, మా తెలుగు తల్లికి మల్లేపూవు దండ’ పాటలు కూడా వేయాలని ములిగుండంలో భాస్కర్‌ రెడ్డి అనే ఒక సీనియర్‌ కార్యకర్త అభిప్రాయపడ్డారు. ఇది ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం కూడా కాబట్టి, ప్రతి సభలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ‘‘ఎన్టీఆర్‌’’ని లోకేశ్‌ గుర్తు చేస్తే సబబుగా ఉంటుందని పాతతరం టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. సీనియర్‌ నాయకులను దూరం పెడుతున్నారనే భావన వారిలో పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యువగళం పాదయాత్ర నిర్వాహకులదే.టీడీపీ ఏర్పడినప్పటి నుంచీ ‘‘బీసీ’’ లే ఆ పార్టీకి వెన్నెముక. ఇప్పుడు పాదయాత్రకు తరలివస్తున్న వారిలో కూడా సింహాభాగం బీసీలదే. పసుపు జెండా పట్టుకొని రోడ్డెక్కుతున్న వాళ్లలో ఎక్కువ మంది బీసీలే ఉన్నట్లు స్పష్టం కనబడుతోంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్సీపీ వైపు నిలబడటం వల్లే గెలుపు వారిని వరించింది. కాబట్టి, ఈ సారి బీసీలను ఆకట్టుకోవాలంటే, కేవలం మాటలతో సరిపెట్టకుండా, బీసీల కోసం ప్రత్యేక పథకాన్ని స్పష్టంగా ప్రకటిస్తేనే టీడీపీకి పూర్వవైభవం వస్తుందని ఆ దిశగా ముందడుగు వేయాలని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్‌ టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. యువగళం పాదయాత్రలో టిడిపితోటే బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని, పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు తమ మనస్సులో మాటను పంచుకున్నారు.యువగళం పాదయాత్రలో ముఖ్యంగా ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. చాలామంది ఉత్సాహాంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమ నాయకుడిని ప్రజలకు మరింత దగ్గర చేసే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన టీం ని మెచ్చుకోవాల్సిందే. అయితే, పాదయాత్రలో భాగంగా రోజూ వివిధ సామాజికవర్గాల ప్రజలతో మాటమంతీ, భేటీల్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నా… నడిచేటప్పుడు కేవలం నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ, తమ సమస్యలు వినడం లేదని వివిధ గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా ఆయన తీసుకుంటున్న వినతులను ఏం చేస్తున్నారో తమకు తెలియాలని , ప్రతిస్పందన ఉండటం లేదని హిందూపురం నుంచి వచ్చిన ఒక రైతు వాఖ్యానించాడు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం దొరకడం లేదంటున్నారు. కనీసం పక్కన నిలబడే అవకాశం ఇవ్వడం లేదంటున్నారు. ముందుగానే ప్లాన్‌ చేసిన సెలెక్టడ్‌ ఇంటారక్షన్స్‌ కన్నా, సహజంగా అందరితో మాట్లాడాలని వెంకటాపురంలో అలివేలు అనే మహిళా సంఘం సభ్యురాలు చెప్పింది. కేవలం యువకులే కాకుండా అన్ని వర్గాలతో కలిసి నడిస్తేనే ఈ యువగళం సకల జనుల గళమవుతుంది!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *