భారతీయ చరిత్రలోనే గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ నేడు ఆయన జయంతి

రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్‌ గ్యాలరీకి అందజేశారు. రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్‌ భట్టాద్రిపాద్‌ దంపతులకు ఏప్రిల్‌ 29, 1848న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్‌ మహారాజా అయిల్యమ్‌ తిరునాళ్‌ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్‌ జెన్సన్‌ వద్ద నేర్చుకున్నాడు. పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *