జైల్లో చంద్రబాబు…. ప్రజల్లో వైసీపీ…

విజయవాడ, అక్టోబరు 10
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి నెల దాటిపోయింది. ఏసీబీ కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకు పిటిషన్లపై పిటిషన్లు దాఖలైనా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో కూడా తెలియడం లేదు. మరోవైపు వైసీపీ రోడ్లపైకి వచ్చేందుకు భారీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళి నెల దాటింది. బాబును జైలుకు పంపిన సరిగ్గా నెల రోజులు పూర్తౌెన రోజే విజయవాడలో సిఎం జగన్‌ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల స్థాయి నుంచి మంత్రుల వరకు అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో మరో నాలుగు కార్యక్రమాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నాలుగున్నరేళ్ల కాలంలో జగన్‌ చేపట్టిన ఏ పథకాల కోసం బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ప్రకటించిన దాఖలాలు లేవు. బాబు నెల రోజుల జైలు జీవితం పూర్తౌెన రోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా యాధృచ్ఛికం కావొచ్చు. ఈ క్రమంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన నాలుగు కార్యక్రమాలు జనవరి వరకు కొనసాగనున్నాయి. దాదాపు 90రోజుల షెడ్యూల్‌ను సిఎం జగన్‌ ప్రకటించారు.జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పక్కాగా అమలయ్యేలా చూడాలని సిఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం జరగాలన్నారు. సెప్టెంబర 30న ప్రారంభించిన కార్యక్రమం నవంబర్‌ 10 వరకు జరుగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.రాష్ట్రంలోని 15,500సచివాలయాల పరిధిలో పట్టణాలు, గ్రామాల్లో 15వేల క్యాంపులు నిర్వహిస్తామన్నారు. కోటి 60లక్షల ఇళ్లను కవర్‌ చేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని చికిత్సలు అందించనున్నారు.వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, ఫ్యామిలీ డాక్టర్లు, స్పెషలిస్ట్‌ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. వైద్యం నుంచి మందుల వరకు అన్ని ఉచితంగా ప్రజలకు అందించేలా ప్రజా ప్రతినిధులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున సంప్రదించే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.1నుంచి ఏపీకి జగనే ఎందుకు కావాలి చేపడుతున్నట్లు సిఎం ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని, ప్రజలకు మరింత సేవ చేయడానికి, ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమం అని పేర్కొన్నారు. నవంబర్‌ 1నుంచి డిసెంబర్‌ 10 వరకు 40రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.అక్టోబర్‌ 25వ తేదీ నుంచి డిసెంబర్‌ 31 వ తేదీ వరకు 60రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు జగన్‌ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్‌ నాయకులంతా కలిసి యాత్ర చేపడతారన్నారు. ఎమ్మెల్యే అధ్యక్షతన మూడు ప్రాంతాల్లో ప్రతి రోజు మూడు విూటింగ్‌లు జరుగుతాయన్నారు.ఒక్కో రోజు అసెంబ్లీ నియోజక వర్గంలో పర్యటించి ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన విద్యా, వైద్యం, అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు జరుగుతాయని చెప్పారు.బస్సు యాత్ర జరుగుతున్న సమయంలోనే డిసెంబర్‌ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జనవరి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించిన నాలుగు కార్యక్రమాలు ప్రజలతో ముడిపడి ఉన్నవే కావడం గమనార్హం. సాధారణ ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా వారితో మమేకయ్యేలా వీటిని తీర్చిదిద్దారు. తొలి దశలో ప్రజలకు మౌలిక అవసరమైన వైద్యంతో ప్రారంభించి ఆ తర్వాత తమ వ్యూహాన్ని అమలు చేసేలా ఏపీకి జగనే ఎందుకు కావాలి, బస్పు యాత్రలు, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలను రూపొందించారు.మరోవైపు చంద్రబాబు నాయుడు ఎంత కాలం జైల్లో ఉంటారనే విషయంలో స్పష్టత లేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ వచ్చినా ఇతర కేసుల్లో సమస్యలు రావనే గ్యారంటీ లేదు. అంగళ్లు కేసుతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసులు బాబు మెడపై వేలాడుతున్నాయి. సుప్రీం కోర్టులో బాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై బాబుకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే మరికొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి రావొచ్చు.అదే సమయంలో అధికార పార్టీ మాత్రం పూర్తిగా జనంలోనే ఉంటుంది. ప్రతి ఇంటిని సందర్శించేలా ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. బాబు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ పార్టీ కార్యక్రమాలను చేపట్టేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *