అనంత టీడీపీలో కుమ్ములాటలు

అనంతపురం, జూన్‌ 28
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో దూసుకుపోవాలని అనుకుంటూ ఉంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న గొడవల కారణంగా ఈ ఎన్నికల్లో కూడా చతికిల పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ముఖ్యంగా వర్గపోరు తెలుగుదేశం పార్టీని ఊహించని విధంగా వెనక్కులాగుతూ ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా.. మాజీ టీడీపీ ఎమ్మెల్యేలకు.. కొత్తగా పార్టీలోకి వచ్చి ఎదిగిన నేతలకు పొసగడం లేదు. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకూ ఇదే కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే వాతావరణమే కనిపిస్తూ ఉంది. అందుకు పెనుగొండ నియోజకవర్గం మినహాయింపేవిూ కాదు. ఏపీలో ప్రతిష్టాత్మకంగా టీడీపీ బస్సు యాత్రలు చేపట్టింది. ఈ యాత్రలలో విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర పెనుకొండకు చేరుకుంది.ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎప్పటి నుండో పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సవితమ్మ, బీకే పార్ధసారధి వర్గాల మధ్య ఘర్షణ ఉన్న వైరం తాజాగా బయటపడిరది. జై బీకే అని.. ఓ వర్గం నినాదాలు చేస్తే.. జై సవితమ్మ అంటూ మరో వర్గం నినాదాలతో పెనుగొండ ఎన్టీఆర్‌ సర్కిల్‌ మారుమోగింది. వెంటనే తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు తన్నుకున్నారు. రెండు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అలా పెనుగొండ నియోజకవర్గంలో గ్రూపు తగాదా బయటకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని గొడవలు చూస్తామో ఈ రెండు వర్గాల మధ్య అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *