బీజేపీకి అస్త్రాలుగా గవర్నర్లు…

కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మరో పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్‌ చేత కక్ష్య సాధింపు చర్యలు జరుగుతాయా? దక్షిణాదిన తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్‌ లతో వచ్చిన విభేధాలే ఇందుకు తార్కాణంగా కనబడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవస్థ బీజేపీకి అస్త్రాలుగా మారారు. ఎందుకంటే దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ గవర్నర్ల పనితీరుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అయిష్టతతో ఉండటమే ఇందుకు నిదర్శనం. అటు స్టాలిన్‌ ప్రభుత్వం. ఇటు కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్ల వద్ద ఆమోదం పొందకపోవడంతో వివాదం రాజుకుంది. తెలంగాణ శాసన సభ ఆమోదం పొందిన మూడు బిల్లులను గవర్నర్‌ తమిళసై ఆమోదం చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న గవర్నర్‌ కు తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. గవర్నర్‌ తమిళ సై బీజేపీ ప్రభుత్వం చేత నియామకం అయ్యారు. కాబట్టి కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం తనను అనేక సార్లు అవమానపర్చిందని, ఎటు వంటి ప్రోటోకాల్‌ పాటించలేదని గవర్నర్‌ తమిళ సై ఆరోపణ. తగ్గేదే లే అన్నట్టు వ్యవహరించింది తమిళసై. ఆపి వేసిన మూడుబిల్లులను ఆమోద ముద్ర వేసినప్పటికీ రాష్ట్ర పతి పరిశీలనకు మరో రెండు బిల్లులను పంపింది. కీలకమైన ఈ రెండు బిల్లులను ఆపడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటోంది. వివరణ కోసం మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు తమిళ సై. అయితే తమిళ సై విూద తీవ్ర అగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తున్నారు. అసలు గవర్నర్‌ పోస్టు జాన్తా నై అంటున్నారు. రాష్ట్ర శాసన సభ ఆమోదం శిరోధార్యం అని సరికొత్త వాదనకు తెరలేపారు. గవర్నర్‌ పోస్టులు రాష్ట్రాలకు అవసరమే లేదని ఆయన వాదన. గవర్నర్‌ పోస్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారమేనని ఆయన అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకుని బీజేపీ గవర్నర్‌ లను వినియోగించుకుంటుందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్‌ లు రాజకీయ ఉద్దేశాలతో పని చేస్తున్నారని అన్నారు. స్టాలిన్‌ ప్రభుత్వాన్ని అక్కడి గవర్నర్‌ ఇరుకున పెట్టారు. అక్కడ కూడా పెండిరగ్‌ లో ఉన్న బిల్లులను వెంటనే ఆమోద ముద్ర వేయకపోవడంతో తమిళనాడు శాసనసభ కొత్తగా ఒక బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్ర శాసన సభ ఆమోదిస్తే అదే ఫైనల్‌ చేయాలని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంది. డిఎంకే, కూటమి పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వచ్చిన విభేధాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగునాట గవర్నర్‌ తో విభేధాలు కొత్తేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో టిడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి విభేధాలు తారాస్థాయికి చేరాయి. చికిత్స కోసం అప్పటి సీఎం హోదాలో ఎన్టీఆర్‌ అమెరికా బయలు దేరారు. అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కి ప్రత్యామ్నాయం లేదు. పార్టీ స్థాపించిన ఏడు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగడం, అధికారంలోకి రావడం కాంగ్రెస్‌ పార్టీకి మింగుడు పడలేదు. ఎన్టీఆర్‌ ను గద్దె దింపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. టిడీపీ పార్టీలో, ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న నాదెళ్ల భాస్కర్‌ రావును కాంగ్రెస్‌ పార్టీ పావుగా వాడుకుంది. కరడు గట్టిన కాంగ్రెస్‌ వాది అయిన అప్పటి గవర్నర్‌ రామ్‌ లాల్‌ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి సీట్లో నాదెళ్ల భాస్కర రావు ను కూర్చోబెట్టారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్టీఆర్‌ ఖంగుతిన్నారు. తన సీటుకే ఎసరు పెట్టిన గవర్నర్‌ వ్యవస్థను ఎన్టీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. నాడు ఎన్టీఆర్‌ గవర్నర్‌ వ్యవస్థను తప్పు పడితే నేడు కేటీఆర్‌ గవర్నర్లు రాష్ట్రాలకు అవసరం లేదని వాదిస్తున్నారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ ఎంపీ బినయ్‌ విశ్వమ్‌ పార్లమెంటులో తాజాగా ఓ ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ దిశగా రాజ్యంగానికి సవరణ చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రాల అధికారాలు, కేంద్రం హక్కుల మధ్య ఉండాల్సిన సమతౌల్యాన్ని గవర్నర్‌ వ్యవస్థ దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను ప్రజలు ఎన్నుకోలేదని, కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల విధి నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్లకు ఉండకూడదని తన బిల్లులో ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ , డీఎంకే సపోర్టుగా వామ పక్ష పార్టీ అయిన సీపీఐ కూడా రాజ్యాంగ సవరణ జరగాలని వాదించడం చర్చనీయాంశమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *