తెలంగాణలో మహిళా ఓటర్లే కీలకం

తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ప్రజా సంఘాలు మొదలుకొని సబ్బండ వర్గాల మహిళామణులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ముందుండి ఉద్యమించారు. ఎన్నో ఆశలతో తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు ఆశించిన మేరకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పవచ్చు. మహిళలకు ఒకటి అర పథకాలు ప్రవేశపెట్టి కేసీఆర్‌ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది.బంగారు తెలంగాణ కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే బంగారం అయ్యిందనే విమర్శలు మహిళా రంగంలో కూడా కనిపిస్తోంది. తెలంగాణ జాగృతి, బతుకమ్మ పేరిట క్రియాశీలకంగా వ్యవహరించిన కేసీఆర్‌ కుమార్తె కవితకు మాత్రమే ప్రత్యేక రాష్ట్రంలో ప్రాధాన్యత లభించింది. కవిత 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోవడంతో ఆమెకు అధికారిక హోదా తగ్గకుండా ఉండేందుకు వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత అంటే కవిత మాత్రమే అనే వ్యవహారంగా పరిస్థితులు మారిపోయాయి.రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా లిక్కర్‌ స్కాం వ్యవహారంతో దేశవ్యాప్తంగా కూడా కవిత పేరు మార్మోగిపోయింది. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత జాతీయ స్థాయిలో సానుభూతి పొందాలనే వ్యూహంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అంశాన్ని ఢల్లీి వేదికగా లేవనెత్తి హడావుడి చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ముందుగా రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించి దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు రావడంతో కవితతో పాటు బీఆర్‌ఎస్‌ కూడా వెనుకంజ వేశాయి. 2014లో మొదటి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌లో ఒక మహిళకు కూడా చోటు దక్కకపోవడం చూస్తే నారీలోకంపై కేసీఆర్‌ ప్రభుత్వానికి ఉన్న వివక్ష ఎంటో అర్థం అవుతోంది. మహిళలకు రాష్ట్ర కేబినెట్‌లో స్థానం ఇవ్వకపోవడంపై ఒక ప్రతిపక్ష మహిళా ప్రజాప్రతినిధి ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దావా వేయడం అప్పట్లో సంచలనం రేపింది. దీంతో రెండో మారు ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులిచ్చారు. తెలంగాణ ఓటర్లలో 48 శాతం మహిళలున్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం కేవలం 5 శాతమే ఉండడం దురదృష్టకరం. 2014లో 7.56 శాతంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం 2018లో తగ్గింది. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పద్మాదేవేందర్‌ రెడ్డి, గొంగిడి సునీత, రేఖా నాయక్‌ గెలవగా, కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. సీతక్క మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మిగిలిన పార్టీల నుంచి ఒక్క మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.2018 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ నుంచి కేవలం నలుగురు మహిళలకే టికెట్లు కేటాయించారు. ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ 100 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, ఇందులో 11 సీట్లే మహిళలకు ఇచ్చింది. టీడీపీ 13 స్థానాల్లో ఒక స్థానాన్ని మహిళకు ఇచ్చింది. బీజేపీ 14 స్థానాలను, సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ 10 స్థానాలను, టీజేఎస్‌, సీపీఐలు ఒక్కో స్థానాన్ని మహిళలకు కేటాయించాయి. ఎంఐఎం ఒక్క మహిళకు కూడా టికెట్‌ ఇవ్వలేదు.చట్టసభలో 5 శాతం ప్రాతినిథ్యంతో 48 శాతం మహిళా ఓటర్ల సమస్యలపై మహిళా ప్రజాప్రతినిధులు ఏం పోరాడగలరు? తమకు ఎక్కువ సీట్లు ఇవ్వమని అడగలేని సంక్లిష్ట పరిస్థితులను మహిళా నాయకులు ఎదుర్కొంటున్నారు. ‘మహిళలు ఎన్నికల్లో గెలువలేరు. రాజకీయం చేయలేర’ని పార్టీలు భావించడమే దీనికి ప్రధాన కారణం. ఎన్నికల్లో ప్రతి సీటూ ముఖ్యమే కాబట్టి, మహిళలకు సీట్లు ఇచ్చే విషయంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అయితే, సీట్ల విషయంలో మహిళలు వద్దు గానీ, ఓట్లు దగ్గరకు వచ్చేసరికి మాత్రం రాజకీయ పార్టీలకు మహిళలు కావాలి. ఇటీవల మహిళా ఓటర్ల తీరులో మార్పు వస్తున్నట్లు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో పార్టీల అంచనాలకు మించి మహిళల ఓటింగ్‌ సరళి ఉండబోతుందని, మహిళలను తమవైపు తిప్పుకున్న పార్టీదే విజయమని కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు సంకేతాలు ఇచ్చాయి. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ గత డిసెంబర్‌ నుంచి మూడు పర్యాయాల్లో కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో మహిళలు కాంగ్రెస్‌ వైపు నిలబడ్డారని స్పష్టంగా తేలింది. బీజేపీతో పోలిస్తే దాదాపు 10 శాతం మంది మహిళలు అధికంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడమే ఆ పార్టీ అఖండ విజయానికి దారులు వేసింది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదల పెద్ద సమస్యగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆదాయం పెరగకుండా, ధరల పెరగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమస్యపై మహిళలు మాత్రమే సరిగ్గా స్పందించగలరు. మన దేశ సంస్కృతిలో ఇంటిని నడిపే పాత్ర ప్రధానంగా మహిళదే కావడం దీనికి కారణం. వంట గ్యాస్‌ మొదలుకొని బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మహిళలు సీరియస్‌గా తీసుకుంటున్న ఈ ధరల పెరుగుదల చుట్టే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి, వారి మనసు గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌ ప్రకటించిన ఐదు హావిూలల్లో నాలుగు మహిళలను లక్ష్యంగా చేసుకొని రూపొందించడమే దీనికి నిదర్శనం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *