3 పార్టీలకు కోమటిరెడ్డి చెమటలు

కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి.. ఆయన కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి దూకేయడానికి సిద్ధపడ్డారని అందరికీ అర్థమైంది. అయితే ఆయన ఎప్పుడు చేరుతారన్న విషయం మాత్రం తెలుగు టీవీ సీరియల్‌ గా సా…గుతోంది. ఈ క్రమంలో ఆయన తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారన్నది మాత్రం వాస్తవం. మునుగోడు అసెంబ్లీ నియోజవకర్గానికి ఉప ఎన్నిక ఖాయం అన్న వార్త ఖరారు కావాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమి రెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయాలి. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడూ అంటూ ఆయన రాజీనామా ముహూర్తం మాత్రం ఎప్పుడు ఖరారౌతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆయన రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, బీజేపీలకు మాత్రం చెమటలు పట్టిస్తున్నారు. ఎలాగంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికలో విజయంపై ధీమాగా లేదు. అందుకోసం ఎలాగైనా కోటమి రెడ్డి రాజగోపాల రెడ్డిని బుజ్జగించేందుకు శతధా ప్రయత్నం చేస్తోంది. మరొ వైపు రెండు వరుస ఉప ఎన్నికలలో పరాజయం తరువాత అధికార టీఆర్‌ఎస్‌ మరో ఉప ఎన్నికలో పరాజయాన్ని స్వీకరించడానికి రెడీగా లేదు. అందుకే మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా ఉంటే బాగుండునని భావిస్తోంది. ఒక వేళ చేసేసి ఉప ఎన్నికను అనివార్యం చేస్తారేమోనని ఆందోళన పడుతోంది. ఒక విధంగా కోమటి రెడ్డి రాజీనామా వల్ల ఉప ఎన్నికలు వస్తాయన్న భయంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ లకు చెమటలు పట్టడాన్ని అర్ధం చేసుకోవచ్చు.ఉప ఎన్నిక కావాలని కోరుకుంటున్న బీజేపీకీ కోమటిరెడ్డి తీరు, వైఖరి చెమటలు పట్టిస్తున్నాయి. ఎరక్కపోయి ఆయనను నమ్ముకున్నామని పార్టీ రాష్ట్ర నాయకత్వమే కాదు, అధిష్టానమూ బెంగటిల్లుతోంది. ఎందుకంటే.. రాజీనామా పేరుతో కోమటిరెడ్డి బీజేపీతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంత కాలం రాష్ట్రంలో బీజేపీ అధికార టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు గట్టి సవాల్‌ విసురుతూ బలోపేతం కావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతే కాదు.. తన వల్లే, తన సవాల్‌ వల్లే కేసీఆర్‌ ఖంగారు పడుతున్నారనీ, తాను రంగంలో ఉంటే టీఆర్‌ఎస్‌ జీరోయే అన్న లెవల్‌ లో మాట్లడుతున్నారు.ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. తనను సీఎం స్థాయి అభ్యర్థిగాఫోకస్‌ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌తో బీజేపీ పక్షాన తనే యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పుకుంటున్నారు. తాను బీజేపీలో చేరడం ద్వారా ఆ పార్టీ కేసీఆర్‌పై చేస్తున్న యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నానన్న రేంజ్‌ లో ఆయన మాటలు ఉన్నాయి. దీంతో కమలం పార్టీలో కలకలం ప్రారంభమయింది. అంతే కాదు.. రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సిందిగాబీజేపీ అగ్రనాయకత్వం తనను ఆహ్వానించాలని కండీషన్‌ పెట్టినట్లు ఆయన ప్రకటనలు, ప్రసంగాలను బట్టి ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. దీంతో ఎరక్కపోయి కోమటి రెడ్డిని కాంటాక్ట్‌ చేశామని ఇప్పుడు కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *