ఆదాయం పెరిగినా.. వేతన వ్యథ!

మరో 2వేల మందికి పైగా అనారోగ్యం, ఇతర పనుల కారణంగా ఉద్యోగం మానేశారు. మరికొంత మంది పని ఒత్తిడి తట్టుకోలేక మృత్యువాత పడ్డారు. అయినా కొత్తగా ఒక్క ఉద్యోగమూ ఇచ్చింది లేదు. 2015 జూన్‌లో ఏపీఎ్‌సఆర్టీసీ నుంచి విడిపోయినప్పుడు 54,546మంది ఉద్యోగులుండగా.. ప్రస్తుతం వారి సంఖ్య 43,500కు తగ్గింది. అప్పట్లో ఉద్యోగుల వేతనాల కోసం నెలకు సుమారు రూ.235కోట్లు వ్యయం చేయగా, ఇప్పుడు రూ.135 కోట్ల నుంచి రూ.140 కోట్లు మాత్రమే వెచ్చిస్తున్నారు. మొత్తంగా జీతభత్యాలకు గతంలో ఏడాదికి సుమారు రూ.2820 కోట్లు అవసరం కాగా, ప్రస్తుతం రూ.1680 కోట్లు సరిపోతున్నాయి. చార్జీల సవరణతో గత కొన్ని నెలలుగా ఆర్టీసీ ఆదాయం కూడా రోజుకు రూ.13 కోట్ల నుంచి సుమారు రూ.16 కోట్లకు పెరిగింది. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఇంధనం కోసం చేసే వ్యయం కూడా పెరుగుతున్నా.. దానిని సెస్‌ల పేరుతో పెంచిన చార్జీలతో సర్దుబాటు చేసుకుంటోంది. సెస్‌ల రూపంలో రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది. మరోవైపు పాత బస్సులను

ఆదాయం పెరిగినా.. వేతన వ్యథ!
స్ర్కాప్‌ కింద పంపడంతో బస్సుల సంఖ్య సగానికి సగం తగ్గింది. వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసింది లేదు.. కొత్త బస్‌స్టేషన్లు నిర్మించిందీ లేదు. దీంతో నిర్వహణ వ్యయం కూడా సగానికి సగం తగ్గిపోయింది. ఇన్ని రకాలుగా ఆర్టీసీకి వెసులుబాటు కలిగినా.. ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి ఓడీ (ఓవర్‌ డ్రాఫ్ట్‌) వినియోగించుకుంటోంది. పైగా ఉద్యోగులకు 2017, 2021 పీఆర్సీల ఊసే లేదు. 2013 నాటి పీఆర్సీ బాండ్ల బకాయిలే ఇంకా చెల్లించలేదు. ఆదాయం పెరిగినా.. ఆర్టీసీ దివాళాకు చేరువ కావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దీనికి ఆర్టీసీ యాజమాన్యమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

చెప్పనలవి కాని ఉద్యోగుల కష్టాలు..

ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టే క్షేత్రస్థాయి ఉద్యోగులైన డ్రైవర్లు, కండక్టర్ల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. సంస్థలో సంస్కరణల పేరిట తమపై పని భారం పెంచి రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. విధుల్లో భాగంగా ఎదురయ్యే అనేక సమస్యలతో నిరంతరం సతమతమయ్యే డ్రైవర్లు, కండక్టర్లు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా.. ఉద్యోగమే వదులుకోవాల్సి వస్తుంది. కానీ, ఈ సమస్యలన్నీ తెలిసినా కొన్ని డిపోల మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు.. ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు కండక్టర్లు, డ్రైవర్లను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పైగా.. అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సైతం సెలవులను వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు మృత్యువాత పడిన సందర్భంలో సెలవు కోరినా.. మృతదేహం ఫొటోను వాట్సా్‌పలో పెట్టాలనే దుర్మార్గమైన ఆదేశాలు అమలు చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విధుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు డిపో ఆవరణలో వారిని నిరీక్షింపజేసి.. బస్సుల కొరత కారణంగా డ్యూటీ ఇవ్వకుండానే ఇంటికి పంపిస్తున్నారు. తిరిగి ఆ రోజును బలవంతంగా సెలవుగా పరిగణిస్తున్నారు.

అధికారులు దయ చూపితేనే వీక్లీ ఆఫ్‌..

ఉద్యోగులు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్‌)ను వినియోగించుకోవడమనేది ఆర్టీసీ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆదారపడి ఉంటుంది. వీక్లీ ఆఫ్‌, స్పెషల్‌ ఆఫ్‌ రోజుల్లోనూ డిపోల్లో శిక్షణకు లేదా ప్రత్యేక విధులకు హాజరు కావాలనే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏ కారణంతోనైనా డిపో అధికారుల ముందు హాజరు కాకపోతే.. అనుమతి లేకుండా రెండు మూడు సెలవులు తీసుకున్నారంటూ డిపో స్పేర్‌ (సస్పెన్షన్‌) పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. డిపో స్పేర్‌ సందర్భంలో సంజాయిషీ ఇవ్వడానికి వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరని అంటున్నారు. ఇక గైర్హాజరు పేరుతో ఉద్యోగుల వేతనాల్లో కోతలకు అంతూ పంతూ ఉండదు. డ్రైవర్లు, కండక్టర్‌లుగా 58 ఏళ్ల వయసు వరకు విధులు నిర్వహించడం కష్టసాధ్యమైన పనిగా వైద్య నిపుణులు పేర్కొంటుండగా.. పదవీ విరమణ వయసును ఏకంగా 60 ఏళ్లకు పెంచారు. వయోభారంతో 8 నుంచి 10 గంటలపాటు ఏకధాటిగా బస్సులను నడపడం తమకు సాధ్యం కాదని, ప్రధానంగా సిటీ రూట్లలో సాధ్యం కాదని మొరపెట్టుకున్నా వినిపించుకునే వారే ఉండరు. కండక్టర్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. బస్సు ఎక్కిన ప్రయాణికుడు టికెట్‌ తీసుకోకపోతే దానికి కండక్టర్‌ను బాధ్యుడిని చేసి సస్పెండ్‌ చేస్తారు. పైగా రోజుకు 6నుంచి 8గంటలపాటు విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులపై పనిభారం రెండింతలు పెరిగింది. రోజుకు సుమారు 10 నుంచి 12 గంటల పాటు పని చేసినా అధికారుల నుంచి ఈసడింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు కండక్టర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వేధింపులు భరించలేక 48 మంది మరణించినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

కారుణ్య నియామకాలపై లేని కనికరం..

సంస్థలో పని చేస్తూ ఏ కారణంతోనైనా ఆకస్మికంగా మృత్యువాత పడిన ఉద్యోగి, అనారోగ్యంతో పని చేయలేని నిస్సహాయతలో ఉన్న ఉద్యోగి కుటుంబం వీధుల్లో పడకుండా.. ఆ కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఉద్యోగం ఇచ్చి ఆదుకునే సంప్రదాయానికి ఆర్టీసీ తిలోదకాలిచ్చింది. ఆరోగ్యపరంగా నిస్సహాయతలో ఉన్న ఉద్యోగి కుటుంబంపై కనికరం చూపడంలేదనే ఆరోపణలున్నాయి. ఇక ఆకస్మికంగా మృత్యువాత పడిన ఉద్యోగులకు సంబంధించి సుమారు 2800 మంది దరఖాస్తు చేస్తే 1310 మందిని మాత్రమే ఉద్యోగాలకు ఆర్టీసీ ఎంపిక చేసింది. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇప్పించింది. కానీ, నాలుగేళ్ల పాటు పోస్టింగ్‌ ఇవ్వకుండా నిలిపివేసింది. ఇటీవల 160మందికి కానిస్టేబుళ్లుగా శిక్షణ ఇప్పించి సెక్యూరిటీ విధుల్లో నియమించింది. కానీ, ఇలా కారుణ్య నియామకాల కింద ఎంపికైన వారిని కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పరిగణిస్తోంది. వారు మూడేళ్లపాటు విధులు నిర్వహించిన తరువాత పరిస్థితిని సమీక్షించి.. సంస్థ సంతృప్తి చెందితే రెగ్యులర్‌ పోస్టులో నియమించాలనే సంప్రదాయాన్ని తెచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజీనామా చేస్తే ప్రయోజనాలు గల్లంతు..

ఆర్టీసీ నిబంధనల మేరకు ఉద్యోగి ఏ కారణంతోనైనా పదవీ విరమణ వయసు(60)కు ముందే ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. సంస్థ నుంచి ప్రయోజనాలు పొందే అర్హత కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో పలువురు ఉద్యోగులు ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ ఉద్యోగి రిటైరయినా.. తార్నాకలోని ఆస్పత్రిలో ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అలాగే స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం కింద.. ఉద్యోగి రిటైరయ్యే నాటికి ఉండే హోదాను బట్టి నెలకు రూ.500 నుంచి రూ.3500 వరకు పెన్షన్‌గా పొందే అవకాశం ఉంటుంది. బస్‌ పాస్‌ సౌకర్యాన్నీ వినియోగించుకోవచ్చు. సంస్థలో సేవలందించిన సర్వీస్‌ కాలానికి కొంత లెక్కగట్టి రిటైర్మెంట్‌ సందర్భంగా ఆర్ధిక సాయమూ అందజేస్తారు. వీఆర్‌ఎస్‌ తీసుకుంటే వీటన్నింటినీ కోల్పోవాల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పీఎఫ్‌ తదితర ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఆరు నెలలపాటు నిరీక్షించాల్సి వస్తోందని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *