ప్రతిపక్షాలకు జీవో త్రిబుల్‌ వన్‌ భయం

జీవో 111 ఎత్తివేత అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆంక్షలను ఎత్తివేస్తూ తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీల స్పందనలో ఓ అంశం చాలా ఆసక్తికరంగా మారింది. జీవో 111 ఎత్తివేతకు ఆమోదముద్ర వేసింది తెలంగాణ కేబినెట్‌. ఈ అంశంపై గతంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ నిర్ణయం ప్రకటించగా… అందుకు అనుగుణంగానే సర్కార్‌ కూడా ముందుకెళ్తోంది. తాజాగా 111 జీవో రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలపటంతో….84 గ్రామాల పరిధిలో సంబరాలు మిన్నంటాయి. తమ ప్రాంతం ఇక అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తుందని స్థానికులు అభిప్రాయపడుతుంటే…. ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు జీవో 111 ఎత్తివేతను ఖండిస్తున్నాయి. కేవలం రియల్‌ దందా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ప్రతిపక్ష పార్టీలు ఎంత ఘాటుగా స్పందిస్తున్నప్పటికీ, కీలకమైన ఓ విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు. ఇదీ కాస్త ఆసక్తికరంగా మారినట్లు అయింది. అయితే దీనికి ఓ లెక్క ఉందన్న చర్చ వినిపిస్తోంది.111 ఎత్తివేత వెనుక ఇన్‌ సైడ్‌ ట్రేడిరగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో కొనుగోలు చేసిన భూముల వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తోంది. ఎన్జీటీని కూడా ఆశ్రయిస్తామని అంటోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డే చెప్పారు. ఇదిలా ఉంటే… బీజేపీ నేతలు కూడా సర్కార్‌ పై దుమ్మెత్తిపోస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరలేపిందని… ఎన్నికలకు నిధులు సవిూకరించుకోవడం కోసమే కేసీఆర్‌? 111 జీవో ఎత్తివేయడానికి సిద్ధమయ్యారని అంటోంది. అయితే ఇవన్నీ మాట్లాడుతున్నప్పటికీ… ఓ విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకోపోతున్నాయి.తాము అధికారంలోకి వస్తే జీవో 111 ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేయలేకపోతున్నాయి. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ను అన్ని విధాలా కార్నర్‌ చేస్తున్నప్పటికీ…ఈ అంశాన్ని నొక్కి చెప్పటం లేదు. పర్యావరణంతో పాటు హైదరాబాద్‌ లోని జంట జలాశయాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటుండగా… తాము అధికారంలోకి రాగానే తాజా నిర్ణయాన్ని రద్దు చేస్తామని మాత్రం అనటం లేదు. దీనికి ఓ లెక్క ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఈ పరిధిలోకి వచ్చే భూములు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. తాజా నిర్ణయంతో అక్కడి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ప్రాంతానికి మహర్దశ వచ్చిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తామని ప్రకటనలు చేస్తే… వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదన కూడా ఓవైపు నుంచి వినిపిస్తోంది. అలాంటి ప్రకటనలే చేస్తే… స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత కూడా తలెత్తే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు వస్తున్నాయి.మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీవో 111 ఎత్తివేత నిర్ణయం కూడా పలు నియోజకవర్గాల్లో రాజకీయాలను ప్రభావితం చేసే అంశంగానే కనిపిస్తోంది. అది అధికార పార్టీకి లాభం చేకూరుస్తుందా..? లేక ప్రతిపక్ష పార్టీలకు మైలేజ్‌ ను ఇస్తుందా..? అనేది చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *