SAFF Football Championship : ఛెత్రి హ్యాట్రిక్‌

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. టోర్నీలో ఘనమైన బోణీ చేసింది. తిరుగులేని ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌ బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’లో తమ ప్రారంభ మ్యాచ్‌లో 4–0తో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టగా, సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు ఉదాంత మరో గోల్‌ చేశాడు. ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన ఛెత్రి సేన చివరి వరకూ దానిని కొసాగించింది. పాకిస్థాన్‌ ఒకింత ప్రతిఘటించినా ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. 10వ నిమింలోనే ఫీల్డ్‌ గోల్‌ చేసిన ఫార్వర్డ్‌ ఛెత్రి.. ఆరు నిమిషాల తర్వాత పెనాల్టీ ద్వారా మరో గోల్‌ సాధించడంతో భారత్‌ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే స్కోరుతో ప్రథమార్థాన్ని ముగించింది. ద్వితీయార్థంలో మనోళ్లు మరింత చెలరేగగా.. 74వ నిమిషంలో ఛెత్రిని ప్రత్యర్థి డిఫెండర్లు బాక్సులో పడదోయడంతో భారత్‌కు పెనాల్టీ కిక్‌ లభించింది. దీన్ని గోల్‌గా మలిచిన ఛెత్రి హ్యాట్రిక్‌ సాధించాడు. ఇక 81వ నిమిషంలో ఉదాంత సింగ్‌ ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ ఆధిక్యం మరింత పెరిగింది. అదే ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగే రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్‌ తలపడనుంది.

భారత కోచ్‌ ఇగార్‌కు రెడ్‌ కార్డ్‌

ప్రథమార్థం ముగియడానికి కొద్దిసేపటికి ముందు చోటుచేసుకున్న ఓ ఉదంతం ఉద్రిక్తలకు దారితీసింది. భారత డిఫెండర్‌ ప్రీతమ్‌, పాకిస్థాన్‌ ఆటగాడు అబ్దుల్లాలో ‘త్రో ఇన్‌’ ఎవరు తీసుకోవాలనే విషయమై సందిగ్ధం ఏర్పడింది. ఈలోపు అబ్దుల్లా ‘త్రో ఇన్‌’కు సిద్ధమవడంతో భారత కోచ్‌ ఇగార్‌ స్టిమాక్‌ అతడి వద్దనుంచి బంతి లాగేసుకున్నాడు. దాంతో పాక్‌ ఆటగాళ్లు స్టిమాక్‌ను చుట్టుముట్టి వాదనకు దిగగా.. రెఫరీలు వచ్చి వారిని విడదీసేందుకు యత్నించారు. ఇంతలో భారత ఆటగాళ్లు కూడా పరిగెత్తుకు వచ్చారు. రెండు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు తీవ్రంగా వాదించుకుంటూ ఒకరినొకరు నెట్టుకోవడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. అయితే రెఫరీలు, మ్యాచ్‌ అధికారులు రెండు జట్ల ఆటగాళ్లను శాంతింపజేశారు. స్టిమాక్‌ ప్రవర్తన నిబంధనలకు విరుద్ధమంటూ అతడికి రెఫరీలు రెడ్‌ కార్డ్‌ చూపారు. అలాగే పాకిస్థాన్‌ మేనేజర్‌, ఇదర్దు ప్లేయర్లు జిన్హాన్‌, నబీలనూ రెఫరీ ఎల్లో కార్డు చూపారు.

సునీల్‌ @ 90

ఈ మ్యాచ్‌లో మూడు గోల్స్‌ చేసిన సునీల్‌ ఛెత్రి మొత్తం 90 అంతర్జాతీయ గోల్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆసియాలో అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ఆటగాడిగా 38 ఏళ్ల ఛెత్రి రికార్డు సృష్టించాడు. ఛెత్రికిది 138వ మ్యాచ్‌. ఇరాన్‌కు చెందిన అలీ దాయి 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *