భీమవరం మున్సిపాల్టీల్లో వాకీ టాకీలు

భీమవరం మున్సిపాలిటీ పరిధిలో సిబ్బందికి త్వరలో వాకీటాకీలు అందుబాటులోకి రానున్నాయి. పాలన పరంగా, మౌలిక వసతులైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఇతర ఏ సమస్య ఉన్నా వేగంగా అధికారులు, సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా వీటిని వినియోగించనున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సూచన మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీకి 80 వాకీటాకీల కోసం రూ.25 లక్షల నిధుల మంజూరు కోసం ప్రతిపాదించారు.భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 46 సచివాలయాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్కటి చొప్పున వాకీటాకీలు అందిస్తారు. ఆయా వార్డుల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు సచివాలయ సిబ్బందికి గాని, అధికారులకు నేరుగా గాని తెలియజేసినప్పుడు ఆ సమస్య సత్వర పరిష్కారం కోసం సచివాలయ సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు వాకీటాకీలను ఉపయోగిస్తారు. ఏదైనా అగ్నిప్రమాదం, తుపానులు, వరదల సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సమయాల్లో ఉన్నతాధికారులకు వాకీటాకీ ద్వారా సచివాలయ సిబ్బంది సమాచారం తెలియజేసి సాయం అందేలా చేయడానికి వీటిని వినియోగిస్తారు.తద్వారా ఉన్నతాధికారులు సత్వర ఆదేశాలు జారీ చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. మున్సిపల్‌ కమిషనర్‌, సెక్షన్‌ ముఖ్య అధికారులు ప్రతిరోజూ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో వారిని అప్రమత్తం చేయడానికి, పాలన పరంగా సేవలు వేగవంతం చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సమాచారం అందరికీ ఒకేసారి చేరడం ఇందులో ప్రధాన సౌలభ్యం. సచివాలయాల్లో విధుల్లో ఉండే ఇమ్యూనిటీ సెక్రటరీలు, హెల్త్‌ సెక్రటరీలు, ఇతర సిబ్బంది వీటిని వినియోగించేందుకు అవకాశముంటుంది. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే వద్ద కూడా వాకీటాకీలు ఉండటం వల్ల సమస్య వెంటనే వారి దృష్టికి వెళుతుంది. వాకీటాకీల వ్యవస్థ నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటీ తొలిసారిగా వినియోగించనుంది. 20 ఏళ్ల క్రితం ఇదే మున్సిపాలిటీ వాకీటాకీలను ఉపయోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, సిబ్బంది పుష్కలంగా అందుబాటులో ఉండటంతో వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. భీమవరం పట్టణంలో అత్యంత ఎత్తులో ఉండే బీఎస్‌ఎన్‌ఎల్‌ లేదా ప్రైవేట్‌ టవర్లకు అనుసంధానం చేసి నిరంతరం సిగ్నల్స్‌ ఇబ్బంది లేకుండా వాకీటాకీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *