చీకోటి కారులో చినజీయర్‌

హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
కాసినో స్కాం సూత్రధారి చీకోటి ప్రవీణ్‌ కారులో చినజీయర్‌ స్వామా? అవును ఇప్పుడు ఈ వార్తే, ఇందుకు సంబంధించిన ఫొటోలే సంచలనంగా మారాయి. చీకోటి కారులో కూర్చున్న చినజీయర్‌ స్వామిగారి ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌ గా సర్క్యులేట్‌ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఒకప్పటి ఆధ్యాత్మిక గురువు, ఏపీ సీఎం జగన్‌ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించిన స్వామి త్రిదండి చినజీయర్‌ స్వామి చీకోటి కారులో షికారు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. త్రిదండి చినజీయర్‌ స్వామిని చీకోటి తన కారులో కూర్చోబెట్టుకుని తిప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలే చినజీయర్‌ స్వామిని మరింత ‘పాపులర్‌’ చేసేశాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యమా బిజీగా ఉండే స్వామివారు కాసినో నిర్వాహకుడి కారులో ఎక్కి షికార్లు చేయడమేమిటని నెటిజన్లు తెగ ట్రోల్‌ చేసేస్తున్నారు. అత్యంత నిష్టాగరిష్టుడు, ఎందరో బడా బడా రాజకీయ నాయకులకు ఆధ్మాత్మిక గురువు, సమతామూర్తి విగ్రహివిష్కరణకు ఏకంగా ప్రధానిని రప్పించిన క్రేజీ స్వామి వారు.. ఒక కాసినో నిర్వాహకుడి కారులో తిరగడమేమిటి? అన్నది నెటిజన్ల సందేహం.అసలు త్రిదండి చినజీయర్‌ స్వామి వారి దర్శనం దొరకడమే సామాన్యులకు దుర్లభం. ఆయనపై పరమ భక్తితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన వారు కూడా ఆయనను అల్లంత దూరం నుంచి చూసి దణ్ణం పెట్టుకుని వెళ్లాల్సిందే. అసలు సామాన్యులకు స్వామి వారి అపాయింట్‌మెంట్‌ దొరకడమే కష్టం. మామూలు భక్తులు అల్లంత దూరం నుంచి స్వామివారిని మొక్కవలసిందే.అలాంటిది చీకోటి కారులో చీకోటి పక్కన కూర్చుని మరీ షికార్లు చేశారేమిటి చినజీయర్‌ స్వామివారు… వారికి చీకోటితో ఎలా పరిచయం, ఎలాంటి పరిచయం అంటూ నెటిజన్లు తమ సందేహాలను సోషల్‌ విూడియాలో పోస్టు చేస్తున్నారు.ఇక్కడే వారు చినజీయర్‌ స్వామి జగన్‌ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడాన్ని గుర్తు చేస్తూ.. గుడివాడ కాసినోకు, చిన జీయర్‌ స్వామి జగన్‌ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడానికి, చీకోటి కారులో స్వామి వారి షికార్లకు ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాలకూ, ప్రశ్నలకూ సమాధానం చెప్పేంత తీరిక స్వామి వారికి ఉంటుందా మరి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *