జబర్దస్త్‌ ప్రోగ్రాం నుంచి టీచర్‌ గా…

ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలోని నటీనటుల్లో చాలామంది డాక్టర్లు, ఇంజీనర్లు కావాలనుకున్నవారే. అలాగే టీచర్లుగా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి సినిమాల్లోకి వచ్చినవారే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, కామెడీ కింగ్‌ బ్రహ్మానందం, ఎంఎస్‌ నారాయణ.. ఇలా మాస్టార్లుగా కెరీర్‌ ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టినవారే. అయితే ఇందుకు భిన్నంగా ఓ నటుడు ఇప్పుడు గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్‌గా జాయిన్‌ అయ్యారు. ఇప్పటివరకు తన కామెడీ పంచులతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఆయన ఇప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు రెడీ అయ్యారు. ఆయన మరెవరో కాదు ప్రముఖ జబర్దస్త్‌ కమెడియన్‌ గణపతి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన గణపతి అదే మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌ గా బాధ్యతలు తీసుకున్నారట. 1998లో డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటి నుంచో పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్‌ కేటాయించింది. అందులో జబర్దస్త్‌ గణపతి కూడా ఉన్నారట.జబర్దస్త్‌ రెగ్యులర్‌గా చూసేవారికి గణపతి అంటే తెలియని వారుండరు. హైపర్‌ ఆది టీమ్‌లో చాలా బొద్దుగా ఉంటూ కామెడీ పంచులతో తెగ నవ్వించారాయన. చాలా స్కిట్లలో ఆదికి భార్యగా లేడీ గెటప్‌లలో కూడా అలరించారు. పలు సినిమాల్లో కూడా కమెడియన్‌గా నటించి మెప్పించారాయన. అయితే ఆది జబర్దస్త్‌ షో మానేశాక గణపతి కూడా బయటకు వచ్చేశారు. ఈక్రమంలోనే తాజాగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారట. అన్నట్లు సర్కార్‌ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్నది కల ఈనాటిది కాదట. అతని 25 ఏళ్ల కలనట. జబర్దస్త్‌ కు రాకముందు కూడా కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారట. ఆ తర్వాతే హైదరాబాద్‌ కు వచ్చి కమెడియన్‌గా స్థిరపడ్డారట. మొత్తానికి కామెడీ పంచులు, ప్రాసలతో నవ్వించిన గణపతి ఇప్పుడు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *