రాజకీయ రంగు పులుముకుంటున్న రెజ్లర్ల ఆందోళన

భారత క్రీడా చరిత్రలో రెజ్లింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశ్వక్రీడా సమరమైన ఒలింపిక్స్‌లో దేశానికి అత్యధిక వ్యక్తిగత పతకాలు తెచ్చిపెట్టింది కూడా కుస్తీ వీరులే. 120 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ సాధించిన పతకాలు 35. అందులో అత్యధికంగా హాకీలో 12 పతకాలు రాగా.. ఆ తర్వాత రెజ్లర్లే 7 మెడల్స్‌(2 రజతాలు, 5 కాంస్యాలు) సాధించారు.త్రేతాయుగంలో వాలి, సుగ్రీవుడి నుంచి ద్వాపరయుగంలో భీమార్జునుల వరకు బలనిరూపణకు ఈ క్రీడనే ఉపయోగించారు. ఆధునిక కాలంలో మట్టి నుంచి మ్యాట్‌ పైకి మారి ఎన్నో హంగులు జోడిరచుకున్న నాటి మల్లయుద్ధమే నేటి రెజ్లింగ్‌. అలాంటి రెజ్లింగ్‌ ఆట ఇప్పుడు ప్రమాదంలో పడిరది. విశ్వవేదికపై తమ అద్వితయమైన ప్రదర్శనతో మువ్వెన్నల జెండాను రెపరెపలాడిరచిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్లెక్కారు. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరేసేందుకు సిద్దమయ్యారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగికంగా వేధించాడని, అతన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమమే చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ నిరసనలపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో ఓ కమిటీ వేసి విచారణకు ఆదేశించారు.ప్రభుత్వానికి తమ నివేదికను అందజేసింది. అయితే ఈ నివేదికలో ఆ కమిటీ ఏ రిపోర్ట్‌ ఇచ్చిందో బహిర్గతం చేయలేదు. అయితే ఆ కమిటీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై రెజ్లర్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని క్లీన్‌ చీట్‌ ఇచ్చినట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. దాంతో రెజ్లర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని, వేల మంది యువ రెజ్లర్లను అతను లైంగికంగా వేధించాడని ఢల్లీి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏడుగురు బాధితులతో రిటర్న్‌ కంప్లయింట్‌ కూడా ఇప్పించారు. ఢల్లీి పోలీసులు ఎఫ్‌ఐర్‌ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు పోలీసులకు మొట్టికాయలు వేయడంతో కేసు నమోదు చేశారు. బాధితుల్లో మైనల్‌ బాలిక ఉండటంతో బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌ సింగ్‌పై పోక్సో కేసు కూడా పెట్టారు. విచారణను బ్రిజ్‌ భూషణ్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని, అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని రెజ్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు.మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలను రుజువు చేస్తే ఊరి వేసుకుంటానని ప్రకటించారు. డబ్ల్యూఎఫ్‌ఐలో తీసుకొచ్చిన మార్పులతోనే రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారని, వారి వెనుక ఓ బడా పారిశ్రామిక వేత్త ఉన్నారని ఆరోపించారు. అతని మద్దతుదారులు కూడా రెజ్లర్లనే తప్పుబడుతున్నారు.2021లో డబ్ల్యూఎఫ్‌ఐ తమ పాలసీలో మార్పులు చేసింది. ఒలింపిక్‌ కోటా విజేతలు కూడా ట్రయల్స్‌లో పాల్గొనాలని, దేశవాళీ పోటీల్లో పాల్గొనడంతో పాటు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలని, ఓ రాష్ట్రం నుంచి ఒక్క టీమ్‌ మాత్రమే పోటీల్లో పాల్గొనాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఇది హర్యానా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌కు నచ్చలేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్‌ రెజ్లర్లలో సింహ భాగం హర్యానాదే.ఈ క్రమంలోనే డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ పదవి నుంచి బ్రిజ్‌ భూషణ్‌ను తప్పించి తమకు అనుకూలమైన విధానలు చేసుకోవాలనే రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారని అతని మద్దతుదారులు వాదిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఐఓఏ స్పాన్సర్‌ షర్ట్‌ కాకుండా నైకీ షర్ట్‌తో బరిలోకి దిగడంపై వినేశ్‌ ఫోగట్‌ను వివరణ కోరడంతోనే ఆమె బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై కక్ష్య పెంచుకుందని, ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపేందుకు ఈ నిరసనలు చేస్తున్నారని రెజర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారులు చెప్పినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలు నచ్చకపోతే రెజ్లర్లు అప్పుడే రోడ్డెక్కేవారు కదా? రెండేళ్లు ఎందుకు ఆగారని, దేశవాళీ ట్రయల్స్‌ ఆడి టోక్యో ఒలింపిక్స్‌లో ఎలా బరిలోకి దిగుతారని రెజర్ల మద్దతుదారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. 2011 నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్‌ భూషణ్‌ను తొలిగించాలనే డిమాండ్‌ 2016 నుంచే మొదలైంది. కాకపోతే అతను తన పలుకుబడితో ఈ పదవిలో కొనసాగారు.బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ చాలా పవర్‌ ఫుల్‌ వ్యక్తని, అతనికి భయపడే ఇన్నాళ్లు బయటకు రాలేదని రెజ్లర్లు అంటున్నారు. చాలా మంది యువ రెజ్లర్లు తమకు ఫోన్‌ చేసి బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ వేధింపులు తెలియజేశారని, రెజ్లింగ్‌ క్రీడ భవిష్యత్తు కోసం తాము పోరాటం చేస్తున్నామని స్టార్‌ రెజ్లర్లు అంటున్నారు. ఇక నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రెజర్లు నినాదాలు చేస్తున్నారనే ప్రచారం కూడా బ్రిజ్‌భూషణ్‌ మద్దతుదారులు బలంగా వినిపిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా రెజ్లర్లు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తమ గోడును వినాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు.రాజకీయ ఉద్దేశం లేదని పదే పదే చెబుతున్నారు. ఆరంభంలో తమకు మద్దతుగా నిలవడానికి వచ్చిన బృందా కారత్‌ను కూడా వెనక్కి పంపారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తుండటంతోనే రెజ్లర్లు తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు. ఏది ఏమైనా రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం దేశంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *