కవిత గప్‌ చుప్‌

తెలంగాణా రాజకీయాల ప్రస్థావన వచ్చినపుడల్లా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ల కంటే కవిత పేరు తెలంగాణా యువత గుర్తుచేసుకుంటుంది. ఆమె తండ్రికి తగ్గ తనయ. ఏమాత్రం తెలంగాణా వాదాన్ని తక్కువ చేయనీయరు. తెలంగాణ గురించి ఎవరు విమర్శించినా , తెలంగాణా ప్రభుత్వాన్ని గురించి విపక్షాలు చిన్న మాట జారినా ఆమె విరుచుకుపడుతుంటారు.ఆమెను తెరాస శ్రేణులు తెలంగాణా ఫైర్‌ బ్రాండ్‌ అన్నా రు. అది అక్షర సత్యం. తెలంగాణా రావడంలో కేసీఆర్‌ పాత్ర, తెలంగాణాను బంగారు తెలంగాణా చేయడానికి కేసీఆర్‌ కృషినీ జాతీయస్థాయి నాయకులకు కూడా వినిపించేలా, తెలిసేలా పార్లమెంటులో గర్జించిన కవిత ఇటీవల కొంత కాలంలో మౌనం వహించారు. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో కేసీఆర్‌ పాలన పట్ల తెలంగాణా బిజెపి నాయకులు ఘాటుగానే విమర్శస్తున్నారు. బండి సంజయ్‌ నాయకత్వంలో బిజెపి కేసీఆర్‌ పాలనా విధానం పై రోజూ విమర్శించని రోజు లేదు.కుటుంబ పాలన, అవినీతి పాలనా అంటూ ఆరోపణలుక గుప్పించని రోజు లేదు. బిజెపీ అగ్రనేతలు కూడా తెలంగాణాలో బిజెపీ పాగా వేయాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ కుటుంబాన్ని ఘాటుగానే విమర్శి స్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా, కవిత ఏమాత్రం ప్రతి విమర్శలతో విరుచుకుపడక పోవడం టిఆర్‌ ఎస్‌ వర్గాలే కాదు, యావత్‌ తెలంగాణా యువత కూడా ఆశ్చర్యపడుతోంది. ఔను కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా క్రియాశీలంగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రత్యర్థులపై విమర్శలను గుప్పించడంలో ఆమె ఎన్నడూ వెనుకాడే పరిస్థితి లేదు. అటువంటి కవిత గత కొంత కాలంగా ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య విమర్శల యుద్ధం జోరుగా నడుస్తున్న వేళ ఆమె మౌనం రాజకీయ వర్గాలనే కాదు తెరాస శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పరిశీలకులు ఆమె మౌనం వెనుక పలు కారణాలున్నాయంటూ తమ విశ్లేషణలకు పని చెబితే.. తెరాస శ్రేణులు తెర వెనుక ఏదో జరుగుతోంది.. కవితా మేడం ఎందుకు మౌనం వహించారంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో ప్రస్తుతం నడుస్తున్నమాటల యుద్ధంలో కవిత ఎందుకు మౌనాన్నే ఆశ్రయించారు? ఆమె మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఎవరికీ సమాధానాలు దొరకడం లేదు. పార్టీ కార్యక్రమాలలోనూ ఆమె కనిపించడం లేదు. విూడియా సమావేశాలూ ఏర్పాటు చేయడం లేదు. అసలింత వరకూ ఆమె ఇంతటి నిశ్శబ్దాన్ని పాటించిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. నిజామాబాద్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలైన సందర్భంలో కూడా ఆమె స్పోర్టివ్‌ గానే తీసుకున్నారు. తప్ప రాజకీయంగా వెనుకంజ వేయలేదు.పార్టీ కార్యక్రమాలలో ఆమె ఎప్పుడూ చురుకుగానే పాల్గొన్నారు. అయితే గత కొంత కాలంగా ఆమె మౌనం, ఎక్కడా ఏ పార్టీ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనకపోవడం ఆమె సహజ నైజానికి విరుద్ధంగా ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఎప్పుడో మూడు వారాల కిందట ఫాదర్స్‌ డే సందర్బంగా తన తండ్రి కేసీఆర్‌ కు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌, ఇప్పుడు గత మూడు రోజులుగా నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న బారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేయడం.. బాధితులను ఆదుకోవాలంటూ జాగృతి కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేయడం తప్ప ఆమె పెద్దగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టిన దాఖలాలు లేవు.దీంతో ఆమె రాజకీయంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. పార్టీ వర్గాలలో కూడా ఇవే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే కుటుంబ పరంగా విభేదాల కారణంగానే కవిత మౌనంగా ఉన్నారన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. తన సోదరుడు కేటీఆర్‌ తో విభేదాలే కవితను రాజకీయంగా మౌనం పాటించేలా చేశాయన్న వాదనా వినిపిస్తున్నది. కేటీఆర్‌ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సందర్భంలోనే కవిత తనకూ పార్టీలో కీలక పదవి కోరారనీ, తరువాత చూద్దామని అప్పటికి సముదాయించిన కేసీఆర్‌ ఆ తరువాత పట్టించుకోవడం లేదన్న భావనా ఆమెలో ఉందని అంటున్నారు.ఇక ఇప్పడు కేసీఆర్‌ తరువాత ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ అని దాదాపుగా నిర్ణయమైపోయిన తరువాత ఆమె తన సంగతేమిటని ప్రశ్నించిన క్రమంలో సొదరుడితో వచ్చిన అభిప్రాయభేదాల కారణంగానే కవిత మౌనం వహించారన్న వాదన పార్టీ వర్గాల నుంచీ వినిపిస్తున్నది. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు, వివాదాలు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. అన్న కేటీఆర్‌తో ఉన్న విభేదాలు కుటుంబంలో కలతలకు కారణమయ్యాయని అంటున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రిని విష్‌ చేయడం వినా గత కొంత కాలంగా కవిత తండ్రి కేసీఆర్‌ ను కలిసింది లేదని ప్రగతి భవన్‌ వర్గాల సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *